ఉద్యోగాలపై పూటకోమాట

2019 నాటికి రాష్ట్రంలో లక్ష ఐటి, 2లక్షల ఎలక్ట్రానిక్ ఉద్యోగాల కల్పన లక్ష్యం అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖా మంత్రి నారా లోకేష్.  ఆయనగారు ఈ స్టేటుమెంట్లు ఇస్తున్న సమయానికి అనంతలో ఇద్దరు యువకులు నిరుద్యోగులుగా ఇక బతకలేమంటూ ఉరిపోసుకుని ఉసురు తీసుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా గవర్నమెంటు నోటిఫికేషన్లు పడక, ప్రైవేటు ఉద్యోగాలు సరిపడా లేక తమకు ఉపాధి లేకుండా పోయిందని సూసైడ్ నోటు రాసి మరీ ప్రాణాలు తీసుకున్నారా నిరుద్యోగులు. రెండు రోజుల క్రితం యువభేరిలో ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పింది ఇలాంటి పరిస్థితి గురించే. హోదా వల్ల రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని, దానికోసం పోరాడితే రాష్ట్రానికి బోలెడన్ని ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. యువత నిరుద్యోగంలో మగ్గిపోనక్కర్లేదని, మూడేళ్ల క్రితమే కేంద్రం మెడలు వంచి చంద్రబాబు హోదాను సాధించి ఉంటే, ఈ పాటికి లక్షలాది ఉద్యోగాలు రాష్ట్రంలో నిరుద్యోగుల పాలిటి వరాలై ఉండేవని జగన్ విద్యార్థులకు వాస్తవాలను వెల్లడించారు. 

ఒక పక్క నిరుద్యోగంలో యువత కొట్టు మిట్టాడుతుంటే లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని అదే పాట పాడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు చంద్రబాబు, లోకేష్లు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతుల్లో ఐటి కంపెనీలు వస్తాయంటూ కల్లబొల్లి మాటలతోనే సమావేశాలను నెట్టుకొస్తున్నారు. ఎసెంట్రిక్ సొల్యూషన్స్, పిఎమ్ టెక్నాలజీస్, బాస్టియన్ బ్రింగర్స్, సినేట్ లిమిటెడ్, ఇన్సప్రెడ్జ్ ఐటి సొల్యూషన్స్, యాడ్ షెల్స్ టెక్నాలజీస్, మైత్రేయా వంటి సంస్థలు ఎన్నో ఏళ్లుగా విశాఖలో ఉన్నాయి. కాని లిమిటెడ్ టర్నోవర్తో ఉన్న ఈ సంస్థలు పెద్ద ఎత్తున ఐటి ఉద్యోగాలను కల్పించలేకపోతున్నాయి. మూడున్నరేళ్లలో ఐటిలో 22వేలు, ఎలక్ట్రానిక్స్ లో 40 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు లోకేష్. అదే నిజమైతే మరో మూడేళ్లకు అంతకు మూడింతలు రెట్టింపు ఉద్యోగాల కల్పన ఎలా సాధ్యం అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పోని కొత్త కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయా అంటే అదీ లేదు. ఐటి కంపెనీలు క్యూలు కట్టేందుకు రావడం లేదంటూ సెలవిచ్చారు నారాలోకేష్. కొత్త కంపెనీలు రావట్లేదు, వచ్చినా లోకల్ రిజర్వేషన్ అమలు చేసే పరిస్థితి లేదు, అసలా కంపెనీలు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు మెదలౌతాయో తెలీదు…కాని ఐటి మంత్రిగారు మాత్రం రాబోయే మూడేళ్లలో మూడు లక్షల ఉద్యోగాలంటూ ఊదరగొట్టేస్తున్నారు ప్రతిచోటా. కనీసం ఏడాదికి 50వేల ఉద్యోగాలను కూడా ఇవ్వని ప్రభుత్వం మూడేళ్లలో మూడు లక్షల ఉద్యోగాలను ఇస్తుందా అని ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు.

Back to Top