మాఫీల‌న్నీ మాట‌లే...!


-
రైతుల‌కు చేర‌ని
రెండో కిస్తీ

-
మొద‌టి విడ‌త బ‌కాయిలు
నిల్‌

-
హార్టిక‌ల్చ‌ర్‌కు
అంద‌ని సాయం

హైద‌రాబాద్‌:  రైతుల రుణ మాఫీపై ప్ర‌భుత్వం త‌న మోసాల ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తూనే
ఉంది. క‌ఠిన నిబంధ‌న‌లు,
ఎన్నో ష‌ర‌తులు, మ‌రెన్నో వ‌డ‌పోత‌ల‌తో కోత‌లు పెట్టిన స‌ర్కారు, వాట‌న్నింటినీ దాటుకొని అర్హ‌త సాధించిన
రైతుల‌కు సొమ్ము చెల్లించే విష‌యంలో ప‌లు మ‌భ్య‌పెట్టే కార్య‌క్ర‌మాల‌కు తెర‌తీసింది.
రెండ‌వ కిస్తీ చెల్లింపుల‌పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు హడావుడి చేయటం మిన‌హా నేటికీ
పూర్తి స్థాయిలో నిధులు విడుద‌ల చేయ‌లేదు. అర‌కొర‌గా విడుదలైన సొమ్మును సైతం బ్యాంకుల‌కు
బ‌దిలీచేయ‌ట్లేదు. రెండ‌వ కిస్తీ ప‌రిస్థితి ఇలా ఉండ‌గా, మొద‌టి విడ‌త మాఫీలో మూడు, నాలుగు ద‌శ‌ల్లో అర్హ‌త సాధించిన వారికి
నేటికీ చెల్లింపులు జ‌ర‌గ‌లేదు. ఎక‌రాకు రూ. ప‌దివేల చొప్పున ఉద్యాన‌వ‌న పంట‌ల
రైతుల‌కు చేస్తామ‌న్న సాయాన్ని కూడా ఇప్ప‌టి వ‌ర‌కు అందించ‌లేదు. అదిగో మాఫీ, ఇదిగో జీవో అన‌డంతో రైతులు బ్యాంకులు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల చుట్టూ
తిరుగుతున్నారు.

హార్టిక‌ల్చ‌ర్‌కి హ్యాండ్‌..

వెల‌గ‌పూడిలో తాత్కాలిక స‌చివాల‌యాన్ని లాంఛ‌నంగా ప్రారంభిస్తూ రూ.3,200 కోట్లు విడుద‌ల చేసే ఫైలుపై సీఎం తొలి సంత‌కం
చేశారు. రెండో కిస్తీ,
మొద‌టి విడ‌త బ‌కాయిలు
చెల్లిస్తామ‌న్నారు. అలాగే హార్టిక‌ల్చ‌ర్‌ రైతుల‌కు రూ.375 కోట్లు ఇచ్చే మ‌రో ఫైలుపై కూడా చంద్ర‌బాబు
సంత‌కం చేశారు. నిధులు మేలో విడుద‌ల చేస్తామ‌న‌గా జూలై మూడోవారం వ‌చ్చినా హార్టిక‌ల్చ‌ర్
రైతుల‌కు రూపాయి ఇవ్వ‌లేదు. ఖ‌రీఫ్ మొద‌ల‌వ‌డంతో మాఫీ కోసం రైతులు గ‌గ్గోలు
పెడుతున్నా వారి గోడు ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదు.

నిధులు విడుద‌లైందంటూ ప్ర‌చారం...

రెండ‌వ బ‌కాయి కింద 36,39,553 రైతు ఖాతాల‌కు రూ. 3,002.55 కోట్లు చెల్లించాల్సి ఉండ‌గా ఆర్థిక శాఖ
మేలో రూ.వెయ్యి కోట్ల‌కు బ‌డ్జెట్ రిలీజ్ ఆర్డ‌ర్ ఇచ్చింది త‌ర్వాత ఎప్ప‌టికో రైతు
సాధికార సంస్థ‌కు నిధులు విడుద‌ల‌య్యాయి. ఇంకా రైతుల అకౌంట్ల‌లో జ‌మ కాలేదు.
మిగిలిన రెండో కిస్తీ సొమ్ముతో పాటు మొద‌టి విడ‌త బ‌కాయిలు, హార్టిక‌ల్చ‌ర్‌ రైతుల‌కు, మాఫీ సాఫ్ట్‌వేర్ స‌పోర్టు త‌దిత‌రాల‌కు
ఆర్థిక శాఖ బీఆర్‌వో ఇచ్చాక సైతం నిధుల ల‌భ్య‌త‌బ‌ట్టి వీలు చూసుకొని విడుద‌ల
చేస్తుండ‌గా,
వ్య‌వ‌సాయ‌శాఖ
పాల‌నామోదం ఇవ్వడంతోనే సొమ్ము విడుద‌లైపోయిన‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌చారం
చేసుకొంటోంది. 

 

Back to Top