కబ్జా చక్రవర్తి అక్రమ కట్టడంలో దర్జాగా బాబు

లింగమనేని గ"లీజు"దందా
ప్రముఖ పత్రిక వద్ద పేదలిచ్చిన డాక్యుమెంట్లు..
ఎస్టేట్‌లో పేదల భూములు స్వాహా
300 ఎకరాల కబ్జా భూములు
వాటి విలువ రూ. 1,500 కోట్లు పైనే...
సమీకరణ నుంచి ఎస్టేట్‌కు మినహాయింపు
కొద్ది దూరంలో ఆగిపోయిన రాజధాని సరిహద్దు
 
లింగమనేని రమేష్...ఈపెద్దమనిషి రాజధానిలో రాబంధులా వాలిపోయి పేదల భూములను కొట్టేసిన ఘనాపాటి.  బాబుకు అత్యంత ఆప్తుడు. చంద్రబాబు అవినీతి బినామీగా అవతారమెత్తిన కబ్జా రాయుడు. జస్ట్ ఎయిర్ కోస్టా విమానాలకు బాసే కాదు..? చట్టాన్ని ఎగతాళి చేస్తూ, కృష్ణా నదిని కూడా కబ్జా చేసి ప్యాలెస్ లాంటి భవంతి కట్టుకున్న పనిమంతుడు. అంతేకాదు ఆ భవంతిని తన ఇష్టదైవం లాంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి సమర్పించుకున్న భక్త ‘హనుమంతుడు. 

కోస్తాంధ్రలోని రెండు ప్రధాన పట్టణాలయిన విజయవాడ - గుంటూరుల నట్టనడుమ మూడు వందల ఎకరాల విలువైన భూమిని అవలీలగా చెరబట్టిన కబ్జా కాలకేయుడు . కబ్జా చేసుకున్న భూమికి సరిహద్దు గోడను కూడా నిర్మించుకున్న సమర్ధుడు. ఎంత సమర్ధుడంటే.. భూ సమీకరణ చట్టం ఆయన సరిహద్దు గోడదాకా వచ్చి వంగి సలామ్ కొట్టి పక్కకు తిరిగి వెళ్లింది...
 
రాజధాని అమరావతిలో ‘బాబు’ల బినామీ భూ బాగోతాలు తవ్వినకొద్ది కోకొల్లలుగా బయటపడుతున్నాయి. లింగమనేని రమేష్‌, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య ఉన్న బంధాన్ని రుజువుచేసే మరో పక్కా ఆధారం వెలుగోలికి వచ్చింది. భూ సమీకరణ విషయంలో బినామీలైతే ఒకరకంగా.. బడుగు రైతులైతే మరో రకంగా  వ్యవహరించిన బాబు భూ మాఫియా బాగోతం బట్టబయలైంది. ఇందుకు సంబంధించిన ఆధారాలెన్నె వెలుగుచూశాయి. 

మూడు పంటలు పండే పేదల భూములను బలవంతంగా సమీకరించిన చంద్రబాబు ప్రభుత్వం లింగమనేని వంటివారిని మాత్రం వదిలేసింది. నిడమర్రు సమీపంలోని లింగమనేని ఎస్టేట్‌ను రాజధాని భూ సమీకరణనుంచి తప్పిం చడం... ప్రతిఫలంగా లింగమనేనివారు ముఖ్య మంత్రికి కృష్ణానదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌ను నజరానాగా సమర్పించడం  తెలిసిన విషయాలే.  ఈ ఎస్టేట్‌లో 300 ఎకరాల పేదల భూములు కలిపేసుకున్న విషయం తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా లింగమనేని విషయంలో చంద్రబాబు ఉదారంగా వ్యవహరిం చారు. 

చంద్రబాబు అధికారంలోకి రాగానే..
గుంటూరు జిల్లా కాజ గ్రామంలో ఉన్న 300 ఎకరాల పేదల భూములను ఆక్రమించిన లింగమనేని.. చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే చక్రం తిప్పారు.  రైతులను మభ్యపెట్టి, మాయచేసి, బెదిరించి ఖాళీ స్టాంప్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారు. అనంతరం ఆ స్టాంప్ పేపర్లలో తమకు నచ్చినట్లు రాసుకుని ముఖ్యమంత్రి అండతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల సహకారంతో రూ.1500 కోట్ల విలువ చేసే భూముల్ని తన వశం చేసుకున్నారు. రాజధాని ప్రాంతం ప్రకటనకు కొద్ది రోజుల ముందే లింగమనేని  ఈ 300 ఎకరాల విలువైన భూములను ఓ ఎస్టేట్ మాదిరిగా మార్చారు.

భద్రతా సిబ్బంది, సీసీ కెమెరాలు, ఎక్కడికక్కడ చెక్‌పోస్టులతో పటిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఎస్టేట్ మొత్తాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.  ఇక్కడ ఎకరం రూ.ఐదు కోట్ల వరకూ పలుకుతోంది.  కాజ గ్రామానికి చెందిన కొంత మంది రైతుల వద్ద గతంలో ఓ కంపెనీకి 99 ఏళ్ల పాటు లీజుకిచ్చిన అగ్రిమెంట్‌లు ఉండటంతో లింగమనేని కబ్జా భాగోతం వెలుగులోకి వచ్చింది. ఈ భూముల పక్కనే ‘చినబాబు’ కొట్టేసిన అగ్రిగోల్డ్  హాయ్‌ల్యాండ్ కూడా ఉండటం గమనార్హం. లీజుకు ఇచ్చిన తమ భూములు ఎక్కడు న్నాయో తెలుసుకునేందుకు కాజ గ్రామస్తులు ప్రయత్నించగా, లింగమనేని ఎస్టేట్‌లో ఉన్నట్లు తేలింది.
 
పేదల వద్ద పక్కా ఆధారాలు...
లింగమనేని ఎస్టేట్స్ యాజమాన్యం అధీనంలో ఉన్న భూముల్లో తమ భూములు కూడా ఉన్నాయని, వాటికి సంబంధించిన పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బాధిత రైతులు తెలిపారు. అయితే తమ భూములను చూసేందుకు కూడా వీలు లేకుండా ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని వాపోతున్నారు. 

సీఎం చంద్రబాబు అండదండలు ఉండటం వల్లే లింగమనేని ఎస్టేట్స్ వైపు కన్నెత్తి చూసేందుకు అటు రెవెన్యూ.. ఇటు పోలీసు అధికారులు సాహసించడం లేదు.  సర్వే నెంబరు  191, 192, 226 ఇలా అనేక సర్వే నెంబర్‌లలో ఉన్న 300 ఎకరాల భూమిని లింగమనేని యాజమాన్యం కొట్టేసిందని బాధితులు చెబుతున్నారు. రాజధాని దురాక్రమణపై ప్రముఖ పత్రికలో  వరుస కథనాలు రావడంతో బాధితులు తమ వద్ద ఉన్న విక్రయ డాక్యుమెంట్‌ల ఆధారాలతో పత్రికా ప్రతినిధులను ఆశ్రయించారు. దీంతో,  లింగమనేని గ‘లీజు’ దందా బాగోతం బట్టబయలైంది. 
Back to Top