మైనారిటీలు మరిచిపోని మహానేత


మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కులమతాలకు అతీతంగా తన సుపరిపాలనను అందరికీ అందించాడు. సంక్షేమ ఫలాలు అట్టడుగు వర్గాలకు అందాలని ఆకాంక్షించాడు. బడుగు, బలహీన వర్గాలు సంతోషంగా ఉన్నప్పుడే ఆ జాతి మూలాలు స్థిరంగా ఉంటాయని నమ్మిన లౌకిక వాది ఆయన. మైనారిటీలను అక్కున చేర్చుకుని, వారి సంక్షేమానికి బాటలు వేసిన ఆ దివంగత నేతను ఈ రంజాన్ శుభ సందర్భంగా తలుచుకుంటున్నారు ముస్లింసోదరులు. 

రిజర్వేషన్ పుణ్యం మహానేత చలవే

మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం, ఆ తర్వాత వారి గురించి పట్టించుకోకపోవడం అప్పటి వరకూ ఉన్న పాలకుల సిద్ధాంతం. కానీ వైఎస్సార్ అలాంటి అవకాశ వాద సిద్ధాంతాలను చెరిపేశారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించారు. ముస్లిం విద్యార్థులకు స్కాలర్ షిప్ పెంచారు. ఆరోగ్యశ్రీ, ఇందరమ్మ ఇళ్లు పథకాల్లో వారికి పెద్దపీట వేశారు. కాంగ్రెస్ హయాంలో సమైక్యాంధ్రప్రదేశ్ లో తప్ప ముస్లింలకు 4% రిజర్వేషన్ మరే రాష్ట్రంలోనూ లేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఈ రిజర్వేషన్ రాకుండా ఉండేందుకు ఎన్నో కుతంత్రాలు కూడా చేసారు. కానీ వైఎస్ తాను అనుకున్నది అమలు చేసి చూపించారు. ఆయన హయాంలోనే మైనారిటీలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించారు. మైనారిటీలకు విద్యా, ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే మెదటి స్థానంలో నిలిపిన ఘనత వైఎస్సార్ కే దక్కుతుంది. ప్రధానంగా విద్యారంగంతో పాటు రిజర్వేషన్ విషయంలో ఆయనవి సాహసోపేత నిర్ణయాలే. పేదరికంలో మగ్గిపోతున్న ముస్లింల పట్ల ఆయన చాలా ఆందోళన కనబరిచేవారు. విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మాత్రమే వారి ఉన్నతి సాధ్యమని నమ్మారు. సమైక్య రాష్ట్రంలో పాతబస్తీ అభివృద్ధికి 2000 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు వైఎస్సార్. పాతబస్తీ మురుగు నీటి సమస్య పరిష్కారానికే అందులో 700 కోట్లు వెచ్చించారు. 

తండ్రిబాటలోనే తనయుడు

వైఎస్సార్ ఆశయాల సాధకుడిగా ప్రజా సంకల్పయాత్ర చేపట్టారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ముస్లింలపై అభిమానం చూపడంలో, వారి సంక్షేమం గురించి ఆలోచించడంలో నాటి మహానేతను గుర్తుకు తెస్తున్నారు. తెలంగాణాలో మాదిరిగానే ఏపీలోనూ చట్టబద్ధంగా రిజర్వేషన్లను 12% పెంచాలని కోరారు. ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో దిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నాకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ముస్లింల అభ్యున్నతికి వైఎస్సార్ అహర్నిశలూ కృషి చేసినట్టే, వైఎస్ జగన్ సైతం వారికోసం పాటుపడుతున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో నవరత్నాలతో పాటు మైనారిటీలకు కూడా ఆయన ఎన్నో హామీలందించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మైనారిటీ సబ్ ప్లాన్ అమల్లోకి తెస్తానని హామీ ఇచ్చారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్ ల ఇస్తున్న ఐదువేల వేతనాన్ని 10000కు, మోజిన్ సాబ్ లకు ఇస్తున్న 3000 రూపాయిలను 5000కు పెంచుతామని కూడా మాటిచ్చారు. 

ముస్లింలను మోసం చేసిన బాబు

మైనారిటీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు వారికి ఏ పథకాన్నీ అందకుండా చేస్తున్నాడు. టీడీపీ హయాంలో ముస్లింలకు రక్షణ లేకుండా పోతోంది. ముస్లిం నిరుద్యోగ యువతకు 5లక్షల వరకూ రుణాలిప్పిస్తాన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే మర్చిపోయాడు. పేద ముస్లింలకు లక్ష వరకూ వడ్డీలేని రుణాలన్నాడు. ఆ హామీని కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు సర్కార్ హయాంలో మైనారిటీలకు దక్కింది శూన్యం. 
ఈ పవిత్ర రంజాన్ మాసంలో మహానేత వైఎస్సార్ ను తలుచుకుని, వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆకాంక్షిస్తున్నారు ముస్లిం సోదరులు. పాదయాత్రలో వైఎస్ జగన్ ను కలిసి తమ వినతులు చెప్పుకుంటున్నారు. ఆత్మీయ సమ్మేళనంలో యువనేతతో తమ మనోవ్యధను పంచుకుంటున్నారు. రానున్న రోజుల్లో రాజన్న రాజ్యం మళ్లీ రావాలని కోరుకుంటున్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని చల్లగా చూడమని అల్లాను వేడుకుంటున్నామంటున్నారు. ఈ పండుగ శుభవేళ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు.

Back to Top