కాకినాడ టీడీపీలో అసంతృప్తి కాక

– ఎన్నికల బాధ్యతల నుంచి యనమల, చినరాజప్పను తప్పించిన బాబు 
– యనమలను నమ్ముకుంటే నష్టమేనని అభిప్రాయం
– సీట్ల పంపకాల్లో చినరాజప్పపై ఆరోపణలు
– స్థానికేతరుడు ప్రత్తిపాటికి కార్పొరేషన్‌ బాధ్యతలు 

ఇప్పటికే నంద్యాల ఎన్నికలపై పూర్తిగా నమ్మకం కోల్పోయిన చంద్రబాబు కాకినాడ మీద దృష్టిసారించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పార్టీకి చెందిన జిల్లా నేతల సమర్థతపై నమ్మకం సడలింది. వారిని నమ్ముకుని కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో గట్టెక్కడం కష్టమేనని నిర్ణయానికొచ్చారు. ఇప్పటికే కాకినాడలో వైయస్‌ఆర్‌సీపీ దూసుకుపోతున్న నేపథ్యంలో.. టీడీపీ ఇప్పటికీ రెబెల్స్‌ బెడదతో సతమతం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటమి భయంతో స్థానికల నాయకులను పక్కన పెట్టేస్తున్నారు. హుటాహుటిన పొరుగు నేతలను రంగంలోకి దించుతున్నారు. నయానో, నజరానాలతోనూ కార్పొరేషన్‌ను దక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే.. ఆయన తీరును స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బయటి వారొచ్చి ఇక్కడ ఏం చేస్తారని పెదవి విరుస్తున్నారు.

ఒకరి తర్వాత ఒకరికి కళ్లెం..
ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎన్నికల బాధ్యతల్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్టుగా టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఎన్నికల్లో ఆయన వలన కలిసొచ్చేదేమీ ఉండదనే అభిప్రాయం కేడర్‌లో కూడా ఉంది. ఇక, పార్టీ పరువును మంటగలిపేశారన్న ఆలోచనతో పంపకాల్లోనే సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును వ్యూహాత్మకంగా పక్కన పెట్టేశారు. మంత్రుల ద్వారా ఎమ్మెల్యేకు చెక్‌ పెట్టారు. ఆ మంత్రుల్లో ఒకరైన డిప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్పకు తాజాగా షాక్‌ ఇచ్చారు. అవమానకర రీతిలో ఆయన్ని పక్కన పెట్టినట్టు తెలిసింది.
ఉప ముఖ్యమంత్రికీ తప్పలేదు..
సీట్ల పంపకాల్లో అనుసరించిన ధోరణి పార్టీని కుదిపేయడంతో చినరాజప్పకు అసమ్మతి సెగ తాకింది. ఏకపక్షంగా అభ్యర్థులను ఎంపిక చేశారంటూ అసంతృప్తివాదులంతా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు కాపుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నగరంలో పార్టీకి ఆశించినంత పట్టులేదు. ఇంకోవైపు సీట్ల పంపకాల్లో సమతూకం లేకపోవడంతో కొన్ని సామాజిక వర్గాలు దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో చినరాజప్పను నమ్ముకుంటే కష్టమన్న అభిప్రాయంతో చంద్రబాబు ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలిసింది.

ఆయన స్థానంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజప్ప ఇకపై వెనకుండి నడవడం తప్ప ముందుండి నడిపించే పరిస్థితి లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. కాకపోతే, ఎక్కడి నుంచో వచ్చినచ నేతలు ఇక్కడేం చేస్తారని, పార్టీ పరిస్థితి అలా తయారైందని కొందరు పెదవి విరుస్తున్నారు. 
 
Back to Top