కడుపు నింపని ‘కరువు’ పని

– రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పేరుకుపోయిన కూలీలు
– నిబంధన ప్రకారం 15 రోజుల్లో అందని వేతనాలు 
– తూతూ మంత్రం పనులకు బిల్లు తెచ్చుకుంటున్న తెలుగు తమ్ముళ్లు
– వాళ్లకు వంద రోజులు పూర్తయితే పనులు ఆగిపోవాల్సిందే 

వైయస్‌ఆర్‌ హయాంలో అనంతపురంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఉపాధి హామీ పథకం చంద్రబాబు, జన్మభూమి కమిటీల పుణ్యమా అని నీరుగారిపోతోంది. కరువు ప్రాంతాల్లో రైతులు, రైతు కూలీలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఆనాడు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌తో కలిసి దివంగత ముఖ్యమంత్రి  వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి అనంతపురంలో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. అయితే బిల్లుల చెల్లింపులో జాప్యం, ఉపాధి పునుల కేటాయింపులో  పక్షపాతం వెరసి పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఆయా గ్రామాల్లోని బాగా డబ్బున్న టీడీపీ నాయకులు సైతం ఉపాధి పనులను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఉదయాన్నే వెళ్లి ఓ గంటో అరగంటో కాలక్షేపం చేసొచ్చి బిల్లులు పొందుతున్నారు. వారికి వంద రోజులు పూర్తయితే ఇక ఆ గ్రామంలో పనులు ఆగిపోయినట్టే. ఇలా ఉంది జన్మభూమి కమిటీల నిర్వాకం...

ఉపాధి కూలీలకు వేతన కష్టాలు
ఉపాధి కూలీలకు వేతన కష్టాలు వెంటాడుతున్నాయి. పెద్దనోట్ల రద్దు తర్వాత బ్యాంకులు విధించిన ఆంక్షలు, నగదు కొరతతో ఉపాధి కూలీల కష్టాలు రెట్టింపయ్యాయి. ఉపాధి పనులు చేస్తున్నప్పటికీ సకాలంలో కూలి అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలో అత్యధికమంది పేదలు ఉపాధి పనులపైనే ఆధారపడుతున్నారు. పని చేసిన 15 రోజుల్లో వేతనాలు చెల్లించాలనేది నిబంధన. కానీ, 2017 నుంచి కేంద్ర ప్రభుత్వం నెలల తరబడి బకాయిలు పెడుతూనే ఉంది. 
రూ. 602 కోట్ల బకాయిలు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనులు చేసిన కూలీలకు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విడుదల చేసిన రూ.263 కోట్ల ఏ మూలకూ చాలని పరిస్థితి ఉంది. రాష్ట్రంలోని ఉపాధి కూలీలకు సుమారు రూ.602.2 కోట్ల వరకూ బకాయిలున్నాయి. అత్యధికంగా విజయనగరం జిల్లాలోనే రూ.63.8 కోట్ల వరకూ బకాయిలు పేరుకుపోయాయి. ఆ తర్వాత స్థానాల్లో ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలు ఉన్నాయి. అతి తక్కువగా కృష్ణా జిల్లాలో రూ.23.9 కోట్ల బకాయిలు ఉన్నట్లు అధికారిక రికార్డులు తెలియ జేస్తున్నాయి.
60 లక్షలకు పైగా కూలీలు
రాష్ట్రంలో ఏటా 35,61,448 కుటుంబాల నుంచి సుమారు 60 లక్షలకుపైగా కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్‌లో ఉన్న ప్రభుత్వం ఉపాధి నిధులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దీంతో, మన రాష్ట్రంలో పని దినాలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రత్యేక హోదా విషయం లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత దెబ్బతింది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఉపాధి పనులపైనా నిఘా పెట్టి తనిఖీలు చేపడుతోందని, నిధుల విడుదలలో జాప్యానికి ఇది ఒక కారణమని అధికారులు చెబుతున్నారు. 

రాష్ట్రంలో పేరుకుపోయిన ఉపాధి బకాయిల వివరాలు
జిల్లా పేరు                          బకాయి (రూపాయల్లో)
విజయనగరం                                    63.8 కోట్లు
ప్రకాశం                                            63.5 కోట్లు
శ్రీకాకుళం                                         61.5 కోట్లు
విశాఖపట్నం                                    60.6 కోట్లు
తూర్పుగోదావరి                                 58.6 కోట్లు
అనంతపురం                                     56.5 కోట్లు
పశ్చిమగోదావరి                                 41.5కోట్లు
చిత్తూరు                                          41.2 కోట్లు
కర్నూలు                                         36.9 కోట్లు 
కడప                                              36.2 కోట్లు
నెల్లూరు                                          30.9 కోట్లు
గుంటూరు                                       27.1 కోట్లు
కృష్ణ                                               23.9 కోట్లు 
 

తాజా వీడియోలు

Back to Top