స్పీకర్ పరిధి నుంచి తప్పించి ఈసీకి ఇచ్చేలా చట్టం తేవాలి

♦ ఫిరాయింపు కేసులపై కేంద్ర హోం మంత్రికి జగన్ వినతిపత్రం
♦ ఎన్నికల సంఘం పరిధిలోకి తెచ్చేలా ఆర్డినెన్స్ ఇవ్వాలి
♦ కేసులు పరిష్కరించేందుకు మూడు నెలల కాల వ్యవధి ఉండాలి
♦ అప్పుడే పార్టీ ఫిరాయింపులను సమర్థంగా అడ్డుకోగలం
♦ ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది
♦ డబ్బు ఎరచూపి  13మంది ఎమ్మెల్యేలను లాక్కుంది
♦ ఏపీ సర్కారు అవినీతి చర్యలపై సీబీఐ విచారణ జరపాలి
♦ ఏచూరి, శరద్‌పవార్, శరద్‌యాదవ్‌లకూ వినతిపత్రాల సమర్పణ
 
న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపు కేసులను స్పీకర్ పరిధి నుంచి తప్పించి ఎన్నికల సంఘానికి ఇచ్చేలా ఆర్డినెన్స్ తెచ్చే అంశాన్ని పరిశీలించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. మూడు నెలల కాల వ్యవధిలో కేసులు పరిష్కరించేలా ఈ ఆర్డినెన్స్ ఉండాలని, పార్టీ ఫిరాయింపులను అడ్డుకునేందుకు ఈ చర్య దోహదపడుతుందని సూచించారు. ఆయన మంగళవారం పార్టీ ఎమ్మెల్యేలతో కలసి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, జేడీయూ నేత శరద్‌యాదవ్‌కు కూడా ఈ వినతిపత్రాన్ని అందించారు. వినతిపత్రంలోని ముఖ్యాంశాలు...

► పార్లమెంటు 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తెచ్చి పదో షెడ్యూలులో చేర్చింది. దీని అమలుతో సంతృప్తిచెందక పార్లమెంటు మరో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా 2003లో మరింత కఠినంగా వ్యవహరిస్తూ చట్టంలో మార్పులు తెచ్చింది. దీని ప్రకారం రెండు ఒరిజినల్ రాజకీయ పార్టీలు విలీనం అయితే తప్ప.. వంద శాతం సభ్యులు పార్టీ మారినా వారి సభ్యత్వం నిలవదు. అందరూ అనర్హత వేటుకు గురవుతారు. ఆ మేరకు ఫిరాయింపుదార్ల సభ్యత్వాలు రద్దుచేయాలని సభాపతికి పిటిషన్లు ఇచ్చినా ఫలితం లేదు. మరిన్ని ఫిరాయింపులు ఉన్నాయంటూ అధికార టీడీపీ బహిరంగంగానే చెబుతోంది. మా పార్టీ తరపున ఎన్నికైన నంద్యాల పార్లమెంటు సభ్యులు ఎస్పీవై రెడ్డి ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే టీడీపీలోకి ఫిరాయించారు. అతడి సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్‌సభ స్పీకర్‌ను కోరాం. 21 నెలలు గడిచినా ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. మేం మరోసారి స్పీకర్‌కు విన్నవిస్తాం. కానీ వారు స్పందించరు. అలాంటప్పుడు చట్టం వల్ల ఏం ఉపయోగం?

► తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పార్టీ నేతలు, కార్యకర్తలను భయకంపితులను చేసింది. మా పార్టీ ఎమ్మెల్యేలకు రూ. 20 కోట్ల నుంచి రూ. 30 కోట్లు ఆశ చూపుతూ, మంత్రి పదవులు ఇస్తామని ఎరవేస్తూ అనైతికంగా 13 మందిని లాక్కుంది. అవినీతి సొమ్ముతో ఇంత ఘోరానికి పాల్పడుతుంటే, ఫిరాయింపుల నిరోధక చట్టం వెక్కిరింపులకు గురవుతుంటే మన ప్రజాస్వామ్యం ప్రశ్నించకుండా మౌనం వహిస్తోంది. రాజకీయ పార్టీల ఈ అనైతిక, రాజ్యాంగ విరుద్ధ చర్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఫిరాయింపుదారులపై వేటు అంశాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకురావాలి. ఫిర్యాదుచేసిన మూడు నెలల నిర్దిష్ట కాల వ్యవధిలోగా అన్ని ఫిరాయింపు నిరోధక కేసులను పరిష్కరించేలా ఆర్డినెన్స్ తెచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నాం.

► రాష్ర్టంలో జరుగుతున్న ఫిరాయింపులకు మూలం అవినీతి సొమ్మే. కాంట్రాక్టర్లకు అదనపు సొమ్ము(ఎస్కలేషన్) చెల్లించి భారీగా ముడుపులు పుచ్చుకునేందుకు వీలుగా టీడీపీ ప్రభుత్వం ఏకపక్షంగా జీవో నంబరు-22ను జారీచేసి భారీగా ముడుపులు అందుకుంది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి టీడీపీలోని తన ఆంతరంగికులతో  కలసి భారీఎత్తున రియల్ ఎస్టేట్ దందాలకు దిగారు. ఎమ్మెల్యేలు మొదలుకుని మంత్రులు, ముఖ్యమంత్రి వరకు సిండికేట్‌గా ఏర్పడి ఇసుక అక్రమతవ్వకాలు చేపడుతున్నారు. దీని ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వీరి అవినీతిని మరో సమగ్ర నివేదికలో పొందుపరిచి మీకు ఇస్తున్నాం. వీటన్నింటిపై సీబీఐతో దర్యాప్తు చేయించి వీటికి అంతం పలకాలి. లేదంటే ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది. ఈ అంశాలన్నింటినీ మేం అసెంబ్లీలో లేవనెత్తితే మా సభ్యులను సస్పెండ్ చేశారు.

► ఇటీవలే ముగిసిన బడ్జెట్ సెషన్‌లో అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇస్తే ....ఫిరాయింపుదారులు తాము విప్ అనుసరించేందుకు తగిన సమయం లేదని చెప్పేందుకు వీలుగా వెంటనే ముగించేశారు. స్పీకర్‌పై అవిశ్వాసం ప్రకటించేందుకు 71(1) నిబంధన కింద నోటీసు ఇచ్చాం. ఆర్టికల్ 179(సీ) ప్రకారం ఈ తరహా నోటీసు ఇచ్చినప్పుడు 14 పని దినాలు ముగిసేవరకు కూడా ఈ నోటీసుపై చర్చ జరగరాదు. కానీ స్పీకర్ అదే రోజు దీనిని చర్చకు తీసుకున్నారు. కేవలం విప్ నుంచి ఫిరాయింపుదారులను రక్షించేందుకు ఇలా చేశారు. అప్రొప్రియేషన్ బిల్లు-2016పై ఓటింగ్ సందర్భంలో కూడా ఇదే రీతిలో వ్యవహరించారు.

మేం నిరసన తెలిపినా పట్టించుకోలేదు. స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ పేరుతో  నిధులను టీడీపీ ఎమ్మెల్యేలకు, వారి ప్రాతినిథ్యం లేని చోట టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు ఇస్తున్నారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటుచేసి సామాన్యుడికి అన్యాయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి. పార్టీ ఫిరాయింపుదారులపై వేటు అంశాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి ఎన్నికల సంఘం పరిధిలోకి తీసుకురావాలి. ఫిర్యాదుచేసిన మూడు నెలల నిర్దిష్ట కాల వ్యవధిలోగా అన్ని ఫిరాయింపు నిరోధక కేసులను పరిష్కరించేలా ఆర్డినెన్స్ తెచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. 
Back to Top