ఎపి జిడిపి అంకెల గారడీ

- అంకెల గారడీ మాటలతో బురిడీ
- రాష్ట్రాభివృద్ధి గురించి చంద్రబాబు కాకిలెక్కలు
- లేని గొప్పలతో ప్రసంగాలు
- అసలు గణాంకాలు బయటపెట్టిన ప్రతిపక్షం

దేశం మొత్తం మీద జిడిపి 7.1 శాతం ఉంటే, రాష్ట్రంలో 12.23 శాతం ఉందని చెబుతాడు చంద్రబాబు. ఇక్కడ ప్రజలకే కాదు, దేశమంతా అదే టముకు వేసే పనిలో ఉన్నాడు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర జిడిపి ఆంధ్రప్రదేశ్ కంటే తక్కువ ఉందంటే ఎవరైనా నమ్ముతారా?
విభజన తర్వాత ఆదాయం వచ్చే హైదరాబాద్ ను కోల్పోయాం. వరుసగా మూడేళ్లుగా రాష్ట్రం కరవు కోరల్లో చిక్కుకుని ఉంది. సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పడిపోయింది. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. వారికి కొత్త రుణాలూ మంజూరు కాలేదు. అలాంటప్పుడు వ్యవసాయ దాని అనుబంధ రంగాల్లో అంత అభివృద్ధి ఎలా సాధ్యమైందని సూటిగా ప్రశ్నిస్తున్నారు ప్రజలు, ప్రతిపక్షాలు

అసలు 24 గంటలూ విపక్షం అభివృద్ధికి అడ్డం పడుతుందని దొంగ టముకు వేసే చంద్రబాబు ఉన్నట్టుండి 12.23 శాతం వృద్ధిరేటు ఎలా సాధించారో చెప్పాలని నిలదీస్తే మాత్రం నీళ్లు నములుతాడు. ప్రజలు నమ్మి గెలిపించిన ప్రభుత్వం మూడున్నరేళ్లలో సాధించింది మాత్రం శూన్యం. అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలు తప్ప ప్రజలు చెప్పుకోడానికి ఏమీ లేవు. ప్రత్యేక హోదా, పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రాజధాని నిర్మాణం, జిల్లాలవారీగా అభివృద్ధి ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది చంద్రబాబు అసమర్థత.
జాతీయంగా జిడిపి అని రాష్ట్రంలో జిఎస్ డిపి అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు చెప్పిన జిఎస్ డిపి లెక్కలు విని ప్రజలు విస్తుపోయారు, ఆర్థికవేత్తలు ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వం లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయం వివిధరంగాల్లో ఇలా ఉంది. 6.83 లక్షల కోట్ల ఆదాయం రాష్ట్రానికి ఉండగా, ఇందులో వ్యవసాయంనుంచి 30శాతం, పరిశ్రమలు 23శాతం, సర్వీసు రంగం 46శాతం ఆదాయం సమకూరుతుందని చెబుతున్నారు. అయితే 2014లొ 12.12 శాతం ఉన్న గ్రోత్ రేట్ 2015కి వచ్చే సరికి 10.82 అయింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇది 11.61 గా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే... ఈలెక్కలన్నీ కేంద్ర ఆర్థికశాఖ గణాంకాలకు ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నాయి. దీంతో ఇవికూడా తన పాలనలో హామీలు నెరవేర్చామని చెప్పుకుంటున్న కాకిలెక్కలు, తప్పుడు అంకెలేనని... బాబు తన మార్కు మాయలు గారడీలు జిడిపి విషయంలోనూ అలాగే కొనసాగిస్తున్నారని ఆర్థికరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
ఇవన్నీ ఎలా ఉన్నా ప్రజలకైతే ఒక లెక్కుంది. అది సరిచేయడానికి సమయం కూడా ఎంతోలేదు. ఆ విషయం బాబు అండ్ బ్యాచ్ కి కూడా తెలిసిపోయింది.

Back to Top