జన్మభూమిలోనూ గ్రాఫిక్సు

– తప్పుడు లెక్కలతో వ్యవసాయంలో వృద్ధిరేటు 
– ప్రజల నిరసనను పట్టించుకోని సర్కారు
– 2019 ఎన్నికలే లక్ష్యంగా పథకాల రూపకల్పన
– గత హామీలే నెరవేర్చని సర్కారు

జన్మభూమి పేరు చెప్పి మరో గ్రాఫిక్సు చిత్రానికి చంద్రబాబు తెరలేపారు. వ్యవసాయ రంగాన్ని ఉద్ధరించే మహానుభావుడిలా అందమైన పాటలతో.. ప్ర‌చార దాహం తీర్చుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే తాను మాత్రం తప్పుడు లెక్కలతో వృద్ధి రేటు చూపిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో కూడా వ్యవసాయ రాబడే ఎక్కువగా చూపుతున్నారు. ఈ గారడి బహు చిత్రంగా వుంది.

చేపల పెంపకం వ్యవసాయంలో చూపిస్తారా
కొల్లేరు సరస్సు, కోనసీమ కొబ్బరి తోటలు తుదకు సముద్రపు ముప్పు నుండి కాపాడే మడ అడవులను కూడా నేల మట్టం చేసి చేపలు, రొయ్యలు పెంచుతున్నారు. దీంతో వస్తున్న ఆదాయాన్ని కలుపుకొని వ్యవసాయంలో రెండంకెల వృద్ధిరేటు చూపుతున్నారు. 2014–15తో పోల్చి చూస్తే 2015–16లో 7.69 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గింది. 2016–17లో 2.93 లక్షల ఎకరాల సాగు పడిపోయింది. మరో వైపు ఈ మూడేళ్ల కాలంలో నీరు–ప్రగతి పథకం కింద దాదాపు రూ.9,900 కోట్లు వ్యయం చేశారు. ఈ నిధులు తెలుగుదేశం కార్యకర్తలకు హారతి కర్పూరంలా సమర్పించారని, ఈ ప్రభుత్వాన్ని కొమ్ముగాచే మీడియానే పలు సందర్భాల్లో వివిధ కథనాలను వండి వార్చింది. ఈ నిధుల వ్యయం ద్వారా వ్యవసాయాభివృద్ధికి ఏ మాత్రం మేలు చేయలేదు. ప్రస్తుతం అమలు జరుగుతున్న జన్మభూమి కూడా ప్రచార ఆర్భాటానికి తప్ప క్షేత్రస్థాయిలో వ్యవసాయ రంగానికి ఏ మాత్రం ఉపకరించడం లేదు. ఒక వైపు రాష్ట్రంలో సాగు విస్తీర్ణం భారీగా పడిపోతుండగా వ్యవసాయ రంగంలో రెండంకెల వృద్ధి రేటు ఎలా సాధ్యమో చెప్పమంటే అభివృద్ధి నిరోధకులుగా ముద్రించి ఎదురుదాడికి దిగుతున్నారు. 
ఏటేటా తగ్గుతున్న సాగు
రైతులకు గానీ ప్రభుత్వానికి గానీ చెరకు సాగు విస్తీర్ణం పెరిగితే రాబడి పెరుగుతుంది. 2014–15లో 3,47,500 ఎకరాల్లో చెరకు సాగు అయితే 2015–18 నాటికి 2,41,265 ఎకరాలకు సాగు పడిపోయింది. పైగా రికవరీ శాతం 2014–15లో దేశం మొత్తం మీద 10.4 శాతం వుంటే ఏíపీలో 9.7 శాతంగా వుంది. తిరిగి 2016–17కి ఏపిలో 9.3 శాతానికి రికవరీ శాతం పడిపోయింది. ఈ గణాంకాలన్నీ ప్రభుత్వ రికార్డుల నుండి తీసుకున్నవే. 
రైతులపై భారం 57 వేల కోట్ల రుణభారం
2015 ఆగస్టులో వెలువడిన కేంద్ర ఆర్థిక సర్వే ప్రకారం ఏపీలో చిన్న సన్నకారు రైతులపై 2016–17 నాటికి రూ.44,599 కోట్లు రుణభారం వుంది. ఇందులో వ్యవస్థీకృత రంగం నుండి తీసుకున్నది కేవలం రూ.18,727 కోట్లుకాగా ప్రయివేటు వడ్డీ వ్యాపారం నుండి రూ.25,872 కోట్లు రైతులు అప్పు చేశారు. మధ్యతరగతి రైతులపై మరో రూ.7,388 కోట్లు పెద్ద రైతులపై రూ.5,542 కోట్ల రుణభారం వుంది. మొత్తం ఏíపీరైతులపై రూ.57,529 కోట్ల అప్పు వుంది. ఈ గణాంకాలను పరిశీలిస్తే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు రుణ ఉపశమన పథకం సముద్రంలో కాకి రెట్టతో సమానం. సన్న చిన్నకారు రైతులు ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.25,882 కోట్లు అప్పు చేసి వుండగా ఈ పద్దు కింద రైతు రుణ ఉపశమనం ఏ విధంగానూ ఉపకరించదు. రాష్ట్రంలో రైతు కుటుంబాల పరిస్థితి కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఇంత దుర్భరంగా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం జన్మభూమి సభల్లో చేస్తున్న ప్రసంగాలు ఏపీని ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. 
ప్రజల్ని మాయలో ముంచేందుకు జన్మభూమి
ప్రజల్ని మాయలో వుంచేందుకు జన్మభూమి పేరుతో అర్థం పర్థం లేని సంక్షేమ పథకాలతో కాలం వెలిబుచ్చుతున్నారు. ఈ సంక్షేమ పథకాల అమలులో కూడా చిలక కొట్టుళ్లు ఎక్కువై ప్రజలకు మొత్తంగా చేరడం లేదు. రేషన్‌ కార్డుల పంపిణీ, గ్రామాల్లో గర్భిణీలకు సీమంతం, ఒకింటికి రెండు పింఛన్లు, దివ్యదర్శనాలు, చంద్రన్న కానుకలు ఇలాంటివి వ్యవసాయ రంగం కుదుటపడేం దుకు ఏ మేరకు ఉపకరిస్తాయో జన్మభూమి సభల్లో ముఖ్యమంత్రి వివరిస్తే మంచిది. జన్మభూమి సభల్లో ప్రజల నుండి వస్తున్న నిరసనలు ఎక్కువగా వున్నా ఈ సందర్భంలో కోట్లాది రూపాయలు ప్రకటనల కింద పొందిన మీడియా, ప్రజల నిరసనను మరుగుపరచడం జరుగుతోంది.
స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల అమలేది..?
చంద్రబాబు పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా వున్న కాలంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ స్వామినాథన్‌ సూచనలను అమలు చేయాలని బల్లగుద్ది వాదించిన సందర్భాలు లేకపోలేదు. అయితే అధికారం చేపట్టిన తర్వాత ఆయన సూచనలకు విరుద్ధంగా విధానాలు అమలు జరుగుతున్నాయి. కోటి ఎకరాలలో పండ్ల తోటలను పెంచాలని ముఖ్యమంత్రి ఇటీవల చేసిన ప్రతిపాదన వ్యవసాయ రంగంలో ప్రయివేట్‌ పెట్టుబడులకు ద్వారాలు తీయడం కార్పొరేట్‌ శక్తుల కబంధ హస్తాల్లోకి రైతులను నెట్టడమే అవుతుంది. వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పెట్టుబడులు పెరిగితేనే రైతుల అభివృద్ధి సాధ్యమని డాక్టర్‌ స్వామినాథన్‌ ప్రధానంగా సూచించారు. కానీ ముఖ్యమంత్రి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ శక్తులకు అప్పజెప్పాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే స్వామినాథన్‌ పేరు ఏ సందర్భంలోనూ ఈ మూడున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి నోట నుండి రాలేదు. 2019 ఎన్నికల్లో గట్టెక్కపోతే దుకాణం కట్టేయవల్సి వస్తుందనే భయంతో ప్రజల్ని ఆకర్షించేందుకు జన్మభూమి పథకం ద్వారా చౌకబారు సంక్షేమ పథకాలను వల్లె వేస్తున్నారు. జన్మభూమి సభలు జరుగుతున్న తీరు పరిశీలిస్తే రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాకులైన రైతులకు, వ్యవసాయానికి ఏ మాత్రం ఉపకరించే విధంగా లేదు. 
గిట్టుబాటు ధరలు లేవు...
ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్‌ ఒడిదుడుకులు సంభవించిన‌ప్పుడు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్నికల సందర్భంగా చేసిన హామీ ప్రకారం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఇంకా సిద్ధం కాలేదు. కనీసం 5 దఫాలు జన్మభూమి సందర్భంగా ధారబోసిన నిధులు కూడగట్టి వుంటే ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసే అవకాశముండేది.
 

Back to Top