గుంటూరు : ఆమె నడచి వస్తుంటే పల్లె పల్లె అంతా పులకిస్తోంది. ఆమె పట్ల అభిమానం వెల్లువవుతోంది. ఆమె రాక కోసం ఊరూరూ ఆత్మీయ తోరణం అవుతోంది. వాడవాడలా స్వాగతాల సందడి నెలకొంది. గుండె గుండెలో అంతులేని ఉత్సాహం ఉప్పెన అవుతోంది. గడపగడపలో పండుగ వాతావరణం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఇలాంటి దృశ్యాలే ఆవిష్కృతం అవుతున్నాయి. మేలు చేసిన మహానేత తనయను చూసి ఉప్పొంగిపోయింది.
మహానేత రాజన్నపై ప్రజల గుండెలోతుల్లో ఉన్న మమకారం.. ఆయన తనయ శ్రీమతి షర్మిల వెంట నడిచే ప్రతి అడుగులోనూ ప్రతిబింబిస్తోంది. జననేత జగనన్నపై అనురాగం.. ఆయన సోదరితో చేసే ప్రతి కరచాలనంలో కనిపిస్తోంది. శ్రీమతి షర్మిలతో ప్రజలు కష్టాలు చెప్పుకొనే తీరు.. తిరిగి రాజన్న రాజ్యం కావాలనే బలమైన ప్రజాకాంక్ష ప్రతిఫలిస్తోంది. కుమ్మక్కు రాజకీయాలను మహానేత తనయ ఎండగడుతూ ప్రసంగించినపుడు ప్రజలు ప్రతిస్పందించిన వైనం.. మంచిరోజులు దగ్గర్లోనే ఉన్నాయనే విషయాన్ని చాటుతోంది. శ్రీమతి షర్మిల పాదయాత్ర అందరిలోనూ భరోసా నింపుతోంది.
డెల్టాలో రెండు పంటలకూ నీరిస్తానని మాట నిలబెట్టుకున్న రాజన్ననూ... వరదలతో పంటలు కోల్పోయిన రైతన్నను ఓదార్చిన జగనన్న భరోసాను తమ గుండెల్లో పదిలంగా నింపుకున్న గుంటూరు జిల్లా గ్రామీణులు ఆ నేతల దూతగా వచ్చిన శ్రీమతి షర్మిలకు అపూర్వంగా స్వాగతిస్తున్నారు. ఉచిత విద్యుత్... రుణ మాఫీ వల్ల లబ్ధి పొందిన రైతులు, ఫీజు రీయింబర్సుమెంటుతో ఉన్నత విద్య చదివిన విద్యార్థులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు పొందిన బడుగులు మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రగా వస్తున్న శ్రీమతి షర్మిల అడుగులో అడుగేస్తున్నారు.
శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం వేమూరు నియోజకవర్గంలో కొనసాగింది. పాదయాత్ర మార్గంలోని పంటపొలాల్లో పనులు చేస్తున్న రైతులు, రైతుకూలీలు బిలబిలమంటూ రోడ్డుపైకి వచ్చారు. 'జగన్మోహన్రెడ్డి జిందాబాద్' అంటూ నినాదాలు చేస్తూ రాజన్న రాజ్యం రావాలని, తామంతా మద్దతు పలుకుతామని మాట ఇచ్చారు. తోట బసవపున్నమ్మ అనే కూలీ తమ కష్టాలను ఏకరువు పెట్టగా, సానుభూతి చూపిన శ్రీమతి షర్మిల గ్రామ సర్పంచ్‌తో మాట్లాడి పరిష్కారమయేలా చూడాలని, నియోజకవర్గ పార్టీ నేత మేరుగ నాగార్జునకు సూచించారు.
అమృతలూరు మండలం మోపర్రు సరిహద్దుల్లోకి వెళ్లగానే ఎదురేగి వచ్చిన గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. శ్రీకాకుళం నాగేశ్వరరావు కుమ్మరిసారెను శ్రీమతి షర్మిల సందర్శించారు. కుమ్మరిసారెపై కుండ తయారీలో ఆమె కూడా పాలుపంచుకున్నారు. ఓదార్పుయాత్రలో తమ గ్రామం వచ్చిన శ్రీ జగన్మోహన్రెడ్డి కూడా తన ఇంటిని సందర్శించి పలకరించినట్టు ఈ సందర్భంగా నాగేశ్వరరావు గుర్తుచేసుకున్నారు. గ్రామసెంటరులో శ్రీమతి షర్మిల మహానేత వైయస్ఆర్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి రచ్చబండలో సమస్యలు తెలుసుకున్నారు.
కరెంటు ఛార్జీలు, గ్యాస్ ధరలు పెరిగాయని, రోజుకు మూడు గంటలు కూడా లేని కరెంటుకు బిల్లులు మాత్రం అధికంగా వస్తున్నాయని మహిళలు చెప్పారు. స్పందించిన శ్రీమతి షర్మిల ప్రజలకు కనీసం మంచినీరు కూడా అందివ్వలేని ప్రభుత్వం బతికున్నట్టు కాదు...చచ్చిపోయినట్టేనని అన్నారు. సమయం చూసుకుని కాంగ్రెస్, టిడిపిలకు బుద్ధిచెప్పాలని, జగనన్నను ఆశీర్వదిస్తే రాజన్న రాజ్యం వస్తుందని అన్నారు.
భోజన విరామం తర్వాత తురుమెళ్ల చేరుకున్న శ్రీమతి షర్మిలకు గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. అమృతలూరు చేరుకోగానే భారీసంఖ్యలో వేచివున్న జనం ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. బాణసంచా కాల్చుతూ సంతోషాన్ని వ్యక్తంచేశారు. ప్రసన్నాంజనేయస్వామి సెంటరులో భారీగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు. అక్కడ్నుంచి ప్రజలను పలకరించుకుంటూ పాదయాత్ర పెదపూడి చేరుకుంది. రెండువైపులా అలంకరించిన ప్రధాన వీధుల్లో పండుగ వాతావరణం కనిపించింది. సెంటరులోని వైయస్ఆర్ విగ్రహం ఎదురుగా పూలబాట పరిచి అందులో మహానేత వైయస్ఆర్ అక్షరాలను స్పష్టంగా తీర్చిదిద్దారు. అనంతరం పెదపూడి శివారులో ఎస్టీ కాలనీ వద్ద రాత్రి బసకు శ్రీమతి షర్మిల చేరుకున్నారు.