జనంతో మమేకం - మరో ప్రజా ప్రస్థానం

మహబూబ్ నగర్, 27 నవంబర్ 2012: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర పాలమూరు జిల్లాలో అప్రతిహతంగా కొనసాగుతోంది. ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ షర్మిల జనంతో మమేకమై ముందుకు సాగుతున్నారు.

      జిల్లాలోని ఆలంపూర్ నియోజక వర్గంలో సోమవారం ఐదో రోజు  కొనసాగిన షర్మిల పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గద్వాలలో షర్మిల పాదయాత్రకు ఊళ్లకు ఊళ్లే కదిలొచ్చినట్టు కనిపించింది. ఐజ-గద్వాల రహదారిలో కనుచూపు మేర జన ప్రవాహం కనిపించింది.పాలకుల నిర్లక్ష్యం వల్ల తాము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రజలు దారి పొడవునా షర్మిలకు మొరపెట్టుకున్నారు.

      ఆలంపూర్ నియోజక వర్గంలోని బింగిదొడ్డి, తాటికొండ, శేషంపల్లి, మల్దకల్ గ్రామాల్లో షర్మిల నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి  జనం భారీ సంఖ్యలో తరలి వచ్చారు. గ్రామాల్లో వారు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. విద్యుత్, తాగునీరు, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లు ఇవ్వడం లేదన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ పథకాలు అటకెక్కాయని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా ఫలితం లేకుండా పోతోందని షర్మిలకు విన్నవించుకున్నారు.

      వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్పప్పుడు ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, గిట్టుబాటు ధరలు, రుణాల మాఫీ విషయంలో తాము ఎంతో లబ్ది పొందామని పలువురు మహిళలు గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాలన్నింటికీ తిలోదకాలు ఇచ్చిందని మండి పడ్డారు. తినడానికి తిండి, ఉండటానికి ఇళ్లు కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా ఆపరేషన్లు చేసేవారని, ఇప్పుడు డబ్బులు ఇస్తేకానీ వైద్యం అందని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. గ్రామాల్లో కూలి పనులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు.
 
      ప్రజల కష్టాలు విన్న షర్మిల ప్రభుత్వం మీద మండి పడ్డారు. ప్రజల గోడును పట్టించుకోని ఈ పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మీ కష్టాలన్నీ తీరుస్తారని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు తలెత్తడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలే కారణమని షర్మిల ధ్వజమెత్తారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అప్పటి వరకు అందరూ ఓపిక పట్టాలని కోరారు.
 
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛను

     మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన పింఛన్లను ప్రభుత్వం రద్దు చేస్తుందని షర్మిల ఆరోపించారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. అంతేకాకుండా నీరుగారిపోతున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్లీ బతికించుకుందామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చే విధంగా జగనన్నచూస్తారని భరోసా ఇచ్చారు.

      వైయస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపుల పాయలో అక్టోబర్ 18న ప్రారంభమైన షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. షర్మిల పాదయాత్ర సోమవారం నాటికి 539.10 కిలో మీటర్లు పూర్తి చేసుకుంది. పాలమూరు జిల్లాలో షర్మిల ఐదోరోజు 16.2 కిలో మీటర్లు పాదయాత్ర చేశారు.

Back to Top