జనం కోసం జననేత దీక్షలు..!

ప్రాణాలు పణంగా పెట్టిన పోరాటాలెన్నో..!
ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం..
ప్రతి దీక్షలో దక్షత..!

పోరాటలకు పెట్టింది పేరు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.  ప్రజల పక్షాన ఆయన కొనసాగించిన ప్రతి దీక్షలో దక్షత కనిపిస్తుంది.  రాష్ట్రంలో ప్రజాసమస్యలపై వైఎస్ జగన్ రాజీలేని పోరాటం కొనసాగిస్తూ వస్తున్నారు. అందునా ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఎన్నో పర్యాయాలు ప్రమాదకరస్థాయిలో దీక్షలు  కొనసాగించారు . నిరవధిక నిరాహార దీక్షలతో పాటు ...కర్షకులు, కార్మికులు, శ్రామికులు, విద్యార్థులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల ప్రజల తరుపున వైఎస్ జగన్ మరెన్నో పోరాటాలు చేశారు. చేస్తూనే ఉన్నారు. 

ఫీజు పోరు..!
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు మిలాఖతయిన రోజుల్లో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ .. వైఎస్ జగన్ 2011 ఫిబ్రవరిలో 7 రోజుల పాటు ఇందిరాపార్క్ వద్ద జగన్ కఠోర దీక్ష సాగించారు. ఆరోగ్యం విషమిస్తుందని వైద్యులు హెచ్చరించినా ఖాతరు చేయలేదు.  ఫిబ్రవరి 24న  పోలీసుల ద్వారా బలవంతంగా ఆస్పత్రికి తరలించారు.

విభజనపై హోరు..!
రాష్ట్రాన్ని విడగొట్టాలని కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ .. తనపై తప్పుడు కేసులు బనాయించిన దశలోనూ వెరవకుండా 2013 ఆగస్టు 24న వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు.7 రోజుల పాటు మొక్కవోని సంకల్పంతో దీక్ష కొనసాగించారు. ఎవరూ చూసేందుకు వీలులేని జైలు గోడల మధ్యే వైఎస్ జగన్ దీక్షను కొనసాగించారు.  ఆరోగ్యం క్షీణించడంతో 29వ తేదీ అర్ధరాత్రి జైలు అధికారులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఐనప్పటికీ వైఎస్ జగన్ దీక్షను వీడలేదు. ఆరోగ్యం విషమించడంతో  31 వ తేదీన వైద్యులు బలవంతంగా ప్లూయిడ్స్ ఎక్కించి భగ్నం చేశారు. 

కలిసుండాలని కఠోరదీక్ష..!
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్ జగన్  అక్టోబర్‌లో మరోసారి నిరాహార దీక్ష చేపట్టారు. విభజనను వ్యతిరేకిస్తూ లోటస్‌పాండ్ వేదికగా  ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 2013 అక్టోబర్ 5న దీక్షను ప్రారంభించారు. ఆరోగ్యం బాగా క్షీణించి శరీరంలో కీటోన్స్ ప్రమాదకర స్థాయికి చేరుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో....9 వ తేదీ రాత్రి పోలీసులు నిమ్స్‌కు తరలించి బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు.

ఆరోగ్యం విషమించినా బేఖాతరు..!
తాజాగా వైఎస్ జగన్ ప్రత్యేకహోదా సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టి నిద్రాహారాలు మాని ఏడురోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేశారు. శరీరంలో వ్యవస్థలన్నీ కుప్పకూలే పరిస్థితి వచ్చినా, కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించినా వేటినీ లెక్కపెట్టలేదు. వైఎస్ జగన్ దీక్షకు భయపడిపోయిన చంద్రబాబు చీకట్లో పోలీసులతో దీక్షను భగ్నం చేయించి జీజీహెచ్ కు తరలించారు.  బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు. మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిగా, తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజాసంక్షేమం కోసం  వైఎస్ జగన్ చూపుతున్న పోరాటపటిమ మరెందరికో స్ఫూర్తినిస్తోంది. 
Back to Top