జలదిగ్బంధంలో భ్రమరావతి


విశ్వనగరం అన్నారు. ఇంద్రలోకంలో అమరావతిని తలదన్నే రాజధాని అన్నారు. రోడ్ల కోసం కోట్లు ఖర్చుపెట్టామన్నారు. డ్రైనేజీ బ్రహ్మాండంగా చేయిస్తున్నామన్నారు. మౌలిక వసతుల్లో నెంబర్ వన్ అమరావతి, ప్రపంచదేశాలు పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయి అన్నారు. అందులో ఒక్కటీ నిజం లేదని వర్షాలు తేల్చేసాయి. అటు విజయవాడ నగరం, ఇటు రాజధాని అమరావతి నీటిలో మునకలేస్తున్నాయి. చుట్టు పక్కల గ్రామాలైతే మిగిలిన ప్రాంతాలతో సంబంధాలే తెగిపోయాయి. తూళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలు ముంపుకు గురయ్యాయి. కొండవీటి వాగులో గంట గంటకూ వరద ఉధృతి పెరుగుతోంది. నీరుకొండ వద్ద రాజధాని భూములు చెరువులను తలపిస్తున్నాయి. పెడపరిమి దగ్గరి కోటేళ్ల వాగు పొంగి ప్రవహించడంతో గూంటూరు వెలగపూడి మధ్య రహదారి మూసుకుపోయింది. సచివాలయం, అసెంబ్లీ భవనాలు నీళ్లలో తేలుతున్నాయి. ఆ భవంతుల్లోకి ప్రవేశించే వీలు కూడా లేకుండా పరిసర ప్రాంతాలన్నీ నీటి మయం అయ్యాయి. ఉండవల్లి, పెనుమాకల్లో పంటపొలాలన్నీ జలమయమే. అమరావతిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కొండవీటి వాగు దగ్గర పోలీసులను కాపలా పెట్టారు. వాగు పొంగితే ఏం చేయాలో ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించనే లేదు.

మునిగిపోయిన రోడ్లు
ఎక్స్ ప్రెస్ రోడ్లు మునిగిపోయాయి. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మించే చోట బ్రిడ్జీల కింద గోతుల్లో నీళ్లు నిండాయి. రాజధాని చుట్టు పక్కల 29 గ్రామాల్లో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ప్రజారవాణా వ్యవస్థ నిలిచిపోయింది. 12 నుంచి 14 సెంటీమీటర్ల వర్షానికే అభినవ నగరం అమరావతి మునిగిపోయిందంటే 25 సెంటీమీటర్లు వర్షం పడితే పరిస్థితి ఏమిటి? ఇప్పటికే వాగు వంకలు పొంగి పరుగులు పెడుతున్నాయి. ఊళ్లూ, రోడ్లూ, భవంతులూ నీట మునుగుతున్నాయి. వర్షాలు ఇలాగే కొనసాగితే బాబుగారు చెప్పిన విశ్వరాజధాని మరో కేరళ సంఘటనను పునరావృతం చేయకుండా ఉంటుందా?

గతం నుంచి పాఠాలేవి?
అసలు రాజధానిగా కృష్ణాతీరాన్ని ఎంచుకోవడాన్నే నిపుణులు తప్పు పట్టారు. పంటలు పండే ప్రాంతాన్ని రాజదానిగా చేసుకోరాదని హితవు చెప్పారు. నీటి వసతులు, నదులు, వాగులు పారే ప్రాంతాల్లో నిర్మాణాల వల్ల ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు భారీ నష్టాలు కలుగుతాయని చెప్పారు. కానీ అవకాశవాద చంద్రబాబుకు ఇవేమీ తలకెక్కలేదు. అమరావతే రాజధాని అంటూ, రాష్ట్రంలో రాజధానికి పనికొచ్చే నేల మరెక్కడా లేదన్నట్టు ప్రవర్తించాడు. చెన్నై, ముంబై, కేరళ ప్రాంతాల్లో జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాలను చూస్తూ కూడా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోకపోవడం విడ్డూరమే. 

హెచ్చరికలు తప్ప సహాయక చర్యలు లేవు!
కొండవీటి వాగు పొంగుతుందని రెడ్ అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం, సహాయక చర్యలకోసం సంసిద్ధంగా ఉందా అంటే అదేమీ లేదు. ముంపు ప్రాంతాల్లో ఎలాంటి సహయాలూ అందడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుని ఉన్నాయి. వారికి నిత్యావసరాలనూ, వైద్య అవసరాలనూ తీర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. చంద్రబాబు అరచేతిలో చూపించిన భ్రమరావతి గ్రాఫిక్కులు చెదరిపోయి అసలు నిజాలు, డాంబికాల వెనక దాగిన వాస్తవాలు బైట పడుతున్న తరుణంలో ప్రజలు అమరావతిని రాజధానిగా అంగీకరిస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. 

తాజా వీడియోలు

Back to Top