జగన్‌ రావాలి.. రాజన్న రాజ్యం తేవాలి!

‘జగన్‌బాబు బయటకు రావాలి.. రాజన్న రాజ్యం తేవాలి. మా బతుకులు మారాలి’ ఇదీ పశ్చిమగోదావరి జిల్లా ప్రజల ఆకాంక్ష. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ, జననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిలకు ప్రజల నుంచి అడుగడుగునా నిండు మనసు స్వాగతం లభించింది. ‘రాజన్న హయాంలో పక్కా ఇళ్లు కట్టించారు. చేతి నిండా పని దొరికింది. రెండు పూటలా బువ్వ దక్కింది. జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ ఆదుకుంది. మా బిడ్డల పెద్ద చదువులకు ఫీజు రీయింబర్సుమెంటు ఆసరా అయ్యింది. పెద్దాయన పోయాక మాకు కష్టాలొచ్చాయి. దేవుడిలాంటి ఆయనను పొట్టనపెట్టుకున్నారు. జననేత శ్రీ జగన్‌ను అన్యాయంగా జైలులో పెట్టించారు. ఇంత బాధలోనూ.. మా కోసం నడిచి వచ్చావా తల్లీ!’ అంటూ శ్రీమతి షర్మిలను అక్కున చేర్చుకున్నారు. కాంగ్రెస్ ‌ప్రభుత్వం అసమర్థ పాలన.. సర్కారుతో అంటకాగుతూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై వారంతా దుమ్మెత్తిపోశారు.

‘అధైర్యపడకండి. మీరు కోరుకుంటున్నట్టు జగనన్న త్వరలోనే వస్తాడు. రాజన్న రాజ్యం మళ్లీ తెస్తాడు. మీ కష్టాలన్నీ తీరుస్తాడ’ని శ్రీమతి షర్మిల వారికి భరోసా ఇచ్చారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిధిలోని పెంటపాడు, కస్పా పెంటపాడు, యానాలపల్లి, పరిమెళ్ల, గణపవరం మండలం జల్లికొమ్మర మీదుగా సాగింది. పరిమెళ్లలో రచ్చబండ నిర్వహించిన శ్రీమతి షర్మిల అక్కడి ప్రజలతో మమేకమై, వారి సమస్యలు తెలుసుకున్నారు.

తాడేపల్లిగూడెం (ప.గో. జిల్లా) :

‘పంట పండటం లేదు.. బతుకు సాఫీగా సాగడం లేదు.. ధాన్యాగారంగా పేరొందిన డెల్టాలో అన్నదాత పరిస్థితి ఉల్టా అయ్యింది. వరి వేయడం కన్నా ఉరి వేసుకోవడమే మేలనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అన్నదాత నోట్లో మట్టికొడుతోంది ఈ ప్రభుత్వం. నీళ్లివ్వదు. కరెంటివ్వదు. ఎరువుల ధరలు పెరిగాయి. పెట్టుబడికి.. వచ్చే రాబడికి పొంతన ఉండటం లేదు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తామని బ్యాంకు ఖాతాలు తెరవమన్నారు. ఇంతవరకు పైసా సాయ‌ం అందించలేదు’ అని శ్రీమతి షర్మిల ఎదుట అన్నదాతలు ఆక్రోశం వెళ్లగక్కారు.

‘ఒక బల్బు, ఒక ఫ్యాను వాడినా వేలకు వేలు కరెంటు బిల్లులు కట్టమంటున్నారు. లేని కరెంటుకు ఇంతలా షాకులిస్తున్నారు’ గుడిసెవాసుల ఆవేదన ఇది. ‘తాగేందుకు నీళ్లులేక.. ఉండేందుకు ఇల్లులేక.. మౌలిక సదుపాయాల జాడలేక అవస్థలు పడుతున్నాం’ రచ్చబండలో శ్రీమతి షర్మిలకు మహిళలు వెళ్లబోసుకున్న గోడు ఇది.

కాంగ్రెస్ ‌ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు, ప్రభుత్వంతో అంటకాగుతూ టిడిపి చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షు‌డు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం రాత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఉంగుటూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. పెంటపాడు మండలంలోని పెంటపాడు, కె.పెంటపాడు, యానాలపల్లి, పరిమెళ్ల మీదుగా గణపవరం మండలంలోని జల్లికొమ్మరకు శ్రీమతి షర్మిల పాదయాత్ర చేరింది. పెంటపాడు మండలం యానాలపల్లిలో రైతులు శ్రీమతి షర్మిల ఎదుట గోడు వెళ్ళబోసుకున్నారు. పంట నూరిస్తే ఖర్చులు కూడా రావటం లేదని, చేలల్లో బాతులను మేపేందుకు ఎకరాను రూ.5 వేలకు ఇచ్చేస్తున్నామని వాపోయారు.
మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత తమకు అన్ని విధాలా అన్యాయమే జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న నాయకత్వంలో రాజన్న పాలన మళ్లీ వస్తుందని, రైతులంతా ధైర్యంగా ఉండాలని శ్రీమతి షర్మిల వారికి భరోసా ఇచ్చారు.

పరిమెళ్ల సమీపంలో రోడ్డు పక్కనే నివాసం ఉంటున్న యానాదులు తమ పూరి పాకలకు వస్తున్న కరెంటు బిల్లులను శ్రీమతి షర్మిలకు చూపించారు. కనీసం వీధిలైట్లు కూడా లేవని, జననేత‌ శ్రీ జగన్ సిఎం అయితేనే తమ జీవితాలు బాగుపడతాయని అన్నారు. అక్కడే చిన్న పూరిపాకలో కదల్లేని స్థితిలో ఉన్న నర్సింహులును శ్రీమతి షర్మిల స్వయంగా పరామర్శిం చారు. అతని భార్య పెద్దింట్లు తమ అవస్థలను శ్రీమతి షర్మిలకు వివరించింది. తమ కొడుకు చనిపోయాడని, నిరుపేదలైన తమను ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని పెద్దింట్లు చెప్పింది. శ్రీమతి షర్మిల ఆ కుటుంబాన్ని ఓదార్చారు. పరిమెళ్లలో నిర్వహించిన రచ్చబండ సభలో మహిళలు మాట్లాడుత.. మహానేత వైయస్ తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు భూమిని సేకరించారని.. ఆయన మరణం తర్వాత పట్టించుకునే నాథుడే లేడని తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏకరువు పెట్టారు.

గడప దాట‌ని ప్రభుత్వం చేతలు :
రచ్చబండలో శ్రీమతి షర్మిల ప్రసంగిస్తూ.. ఈ ప్రభుత్వంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, పేదలు, ఎస్సీ, బిసిలు ఎవరూ సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం కిరణ్ మాత్రం ‌ప్రకటనలు ఇస్తూ తమ ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మాటలు కోటలు దాటుతుంటే.. చేతలు మాత్రం గడప దాటటం లేదని ధ్వజమెత్తారు. మహిళలైతే బ్యాంకుల నుంచి అప్పులు ఎందుకు తీసుకున్నాం ప్రభో.. అని బాధపడుతున్నారన్నారు. అన్నివర్గాల వారు చెబుతున్న సమస్యల్ని పరిష్కరించే బాధ్యత రాజన్న రాజ్యంలో జగనన్న తన భుజాలపై వేసుకుంటారని హామీ ఇచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన చంద్రబాబు పాలనను గుర్తుకు తెస్తోందని‌ శ్రీమతి షర్మిల ఆరోపించారు.

బుధవారం రాత్రి 7 గంటలకు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తిచేసిన శ్రీమతి షర్మిల అనంతరం ఉంగుటూరు నియోజకవర్గంలో అడుగుపెట్టారు. గూడెం నియోజకవర్గంలో 25.7 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఉంగుటూరు నియోజకవర్గంలోని జల్లికొమ్మర వద్ద శ్రీమతి షర్మిల బస చేశారు. పాదయాత్రలో వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజేష్, తాడేపల్లి గూడెం నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపీ, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ నేత మొవ్వా ఆనంద శ్రీనివాస్, డాక్టర్ హరికృష్ణ, గంటా ప్రసాదరావు, గాదిరాజు సుబ్బరాజు, వగ్వాల అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top