జనం కోసం జగనిజం

అబద్ధాలతో, మోసాలతో రాజకీయం చేయడం వైయస్సార్ రక్తంలోనే లేదు. నైతిక విలువలకు, ఆదర్శరాజకీయాలకు, సంక్షేమ పాలనకు వైయస్సార్ ఓ చెరగని సంతకం. ఆయన వారసుడిగా, ఆయన ఆశయాలకు సేవకుడిగా ఉండటమే జగన్ నైజం. ఇచ్చిన మాటను తప్పకపోవడమే ఆయన వ్యక్తిత్వంలో ఉన్న నిజం. ఇది జగనిజం. రాష్ట్రం అంతా ఆ విషయాన్ని నమ్ముతోంది. జగన్ నాయకత్వాన్ని స్వాగతిస్తోంది. అందుకు నిదర్శనంగా నిలుస్తోంది నంద్యాల ప్రజా వెల్లువ. జగన్ అడుగుపెట్టిన చోటల్లా కంచుకోటలా నిలబడుతున్నజనమే జగన్ గెలుపుకు సాక్షి. నంద్యాల ఉప ఎన్నికలు దుర్మార్గపాలనకు ఆఖరి రోజులని, ధర్మాన్ని గెలిపించే ప్రజలకు ఆయుధమని అనుకోవాలి.
ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాల నాటకం రోజురోజుకీ కొత్త మలుపు తిరుగుతోంది. ఫిరాయింపుల నాయకులపై ప్రజా నిఘా ఎంత గట్టిగా ఉందో.. నంద్యాలలో వైయస్ఆర్ కాంగ్రెస్ పోటీకి పెట్టిన తర్వాత గానీ తెలియరాలేదు. ఏదో సెంటిమెంటును అడ్డుపెట్టుకుని తమ అవినీతి, అరాచక పాలనపై ప్రజాభిప్రాయం రాకుండా పబ్బం గడిపేద్దామనుకున్న పచ్చ నేతల కళ్లు ఒక్కసారిగా చల్లబడ్డాయి. కారణం... జగన్. 
నంద్యాలలో జగన్ బహిరంగసభ పెట్టేవరకు ఒకలెక్క... పెట్టిన తర్వాత ఒక లెక్క. ఆ మహానేత వారసుడొచ్చాడు. ఆయన కొడుకొచ్చాడు అంటూ ఇప్పుడు నంద్యాల ప్రజానీకం నినదిస్తోంది. వైయస్ తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటోంది. ఇలాంటి సమయంలోనే వైయస్ జగన్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయన ప్రచారం మొదలైంది మొదలు, టిడిపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ప్రారంభమైంది. జగన్ ప్రచారం రోజు రోజుకీ జన సంద్రం అయిపోతుంటే, ఏం చేయాలో పాలుపోక టిడిపి వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేతగా జగన్ ఇస్తున్న హామీలు... అధికారంలో ఉండి కూడా తాము ఇవ్వలేకపోతున్నామనే బాధ, ప్రతి నిజమైన తెలుగుదేశం కేడర్ లోనూ ఉంది.

ఇంతకీ వీళ్లను ఇంతగా బాధపెట్టే పని జగన్ ఏం చేశాడబ్బా అని ఆరా తీస్తే..
ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఇలా ఉన్నాయి.
- నంద్యాల నా గుండెల్లో ఉందని నినదించిన జగన్, నంద్యాల ప్రజలు న్యాయం వైపునే నిలబడాలని... జరగబోతున్న ఉప ఎన్నిక ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతోందని జగన్ చెబుతున్నారు.
- అబద్ధాలు, మోసాలు తన వల్లకాదని చెప్పిన జననేత, చంద్రబాబు మాదిరి తన దగ్గర డబ్బుల మూటలు, అబద్ధాల మాటలు లేవని, విశ్వసనీయత ఉన్న రాజకీయాలే తన ఆస్తి అని తేల్చి చెప్పాడు. 
- రాబోయే రోజుల్లో నంద్యాల పార్లమెంటు స్థానాన్ని జిల్లాగా మారుస్తామని, నంద్యాలనే జిల్లా హెడ్ క్వార్టర్ గా మారుస్తానని చెప్పారు. 
- జగన్ తమ గ్రామానికి వస్తున్నాడని తెలిసిన జనం.. తిండి కూడా మానేసి అలా వీధిరోడ్లపై హారతి పట్టి ఎదురుచూశారు. ఎంతోమంది చెల్లెమ్మలు తమ అభిమాన అన్నకు రాఖీ కట్టి ఆశీర్వచనం తీసుకున్నారు.
- తాను అనుకున్నది నేరుగా ప్రజల్లోకి వెళ్లేలా చెప్పడమే కాదు చంద్రబాబు బూటకపు మాటలను కూడా ఎండకట్టారు జగన్.
- చంద్రబాబు తప్పు చేశావ్. తప్పు చేసినందుకు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. నిలదీస్తూనే ఉంటాం అన్నారు.
- ప్రజలను మోసం చేసిన చంద్రబాబును వదిలిపెట్టేదిలేదని హెచ్చరించారు. బాబు చేసిన నేరాలకు ఏ శిక్ష విధించినా చాలదన్నారు. రాష్ట్రం మెత్తాన్ని మోసం చేసిన వ్యక్తికి ఉరిశిక్ష వేసినా తప్పులేదన్నారు.
పేదలకోసం కాక, బినామీ కాంట్రాక్టర్లకోసమే ఇళ్లపథకం పెట్టిన విషయం ప్రజల ముందు బయట పెట్టారు.
పసుకు కుంకుమ కాదు.. మహిళల కంట్లో ఉప్పూ కారం కొట్టిన బాబును తెలుగు మహిళలు నమ్మరని చెప్పారు.
మూడున్నరేళ్లుగా బాబుకు నంద్యాలలో ఉన్న ముస్లింలు కనిపించలేదని, ఉప ఎన్నికలు ఉండటంతో వారిపై ప్రేమ పొంగుకొచ్చిందన్నారు. 
అవినీతి ఆస్తులతో అహంకారం తలకెక్కిన బాబు ఆ డబ్బుతో ఎవరినైనా కొనాలనుకుంటున్నాడు. అలాంటి ఆస్తులు తనకులేవన్నారు. మాట తప్పడు అన్న విశ్వసనీయతే తనకున్న ఆస్తి అని బహిరంగంగా చెప్పారు.
బాబు దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపు నిచ్చారు వైయస్ జగన్. అందుకు నంద్యాల ఓటు నాంది కావాలన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవ్యక్తి మోసం చేయకూడదని హితవు పలికారు. 
నంద్యాల ఓటుతో వ్యవస్థమారుతుందని, నవరత్నాలు తెచ్చుకునే పాలనకు బీజం పడుతుందన్నారు.
గండ్రేవులను నిర్మించి రెండు పంటలకు నీరిస్తాం అని హామీ ఇచ్చారు.
అర్థరాత్రి సోదాలు బెదిరింపులు దేనికి సంకేతం అని నిలదీశారు.
వైయస్సార్ సిపికి మద్దతిస్తున్నారని వైశ్యులపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు దౌర్భాగ్య రాజకీయం గురించి రోడ్ షోలో ప్రజలకు వివరించారు.
రాజకీయాల్లో మార్పు రావాలంటే ప్రజా చైతన్యం కావాలన్నారు జగన్. రాజకీయనాయకులు హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే చొక్కాపుచ్చుకుని ప్రశ్నించాలన్నారు. మోసం జరిగితే ప్రజలు నిలదీస్తారనే భయం కలగాలి. అప్పుడే విశ్వసనీయ రాజకీయాలను చూడగలుగుతామన్నారు.
నంద్యాలలో జరిగే రోడ్ షోలో జగన్ ను చూసేందుకు, ఆయన మాటలను వినేందుకు ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. చంద్రబాబుకు ఎన్నికలు ఉంటేనే ప్రజలు గుర్తొస్తారా అని ప్రశ్నించారు జగన్. రోడ్లపక్కన భవనాలు కూల్చడం అభివృద్ధి కాదని, ప్రజల కళ్లల్లో ఆనందం చూడటమే అసలైన అభివృద్ధి అని నిర్వచించారు. 
మూడున్నరేళ్లలో ఒక్క హామీనీ నెరవేర్చని బాబు మళ్లీ మోసపు వాగ్దానాలతో ఎరవేస్తున్నాడన్నారు. రుణ మాఫీ జరగలేదని రైతు ప్రశ్నిస్తే జగన్ మనుషులని పేరు మోపి, కేసులు బనాయిస్తానంటాడు. ఈ అహంకారం కొట్టుకుపోయే రోజు దగ్గర్లోనే ఉందని జగన్ తెలియజేసారు.
అవినీతి సొమ్ము ఉందన్న అహంకారంతో ఎవరినైనా కొనొచ్చనుకుంటున్న చంద్రబాబు, ఓటర్లను కూడా ఐదు వేలతో కొనేద్దామనుకుంటున్నాడు. దెయ్యంలా వచ్చి చేతికి డబ్బిచ్చి ఓటేయమని ఒట్టేయించుకుంటాడు. అందుకే లౌక్యంగా వ్యవహరించాలి. అలాంటి పాపానికి తగిని శాస్తి చేయాలని కోరారు జగన్. 
మోసం చేసే వాడో, మాట మీద నిలబడే వాడో.... ఎవరు కావాలో తేల్చుకునే బాధ్యత ప్రజలదేనన్నారు జగన్. 
జగన్ ప్రసంగం ఓ ప్రవాహం. ఓ సవాల్. ఒక ప్రశ్న. ఒక ఆలోచన. మూడేళ్లకుపైగా ప్రజల గుండెల్లో రగులుతున్న ఆవేదన. ఆక్రోశం. అవన్నీ కలిసి నంద్యాల రోడ్ షోలో జగన్ మాటకు జనం పోటెత్తేలా చేస్తున్నాయి. జగన్ ఒక మాట చెబితే అందులో నిజం ఉంటోంది. ఒక విశ్లేషణ చేస్తే అందులో నిజాయితీ కనిపిస్తోంది. ఒక ప్రశ్న సంధిస్తే ప్రభుత్వానికి సమాధానం కరువవౌతోంది. మొత్తంగా జగన్ నంద్యాలలో అడుగు పెట్టింది మొదలు పచ్చపార్టీ పరువు పంచర్ అవుతోంది. యువనేత రోడ్ షో చైతన్యజన యాత్రలా సాగిపోతోంది. జగనిజం ధాటికి ఎదురు లేదని నంద్యాల పీఠం శిల్పా మోహన్ రెడ్డిదని దాదాపు ఖారరైపోయింది. 








Back to Top