జడివానలో జన సంకల్పం
ప్రజా సంకల్ప పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో సాగుతోంది. తమ బంగారు భవితకు బాసటగా నిలిచేది వైఎస్ జగనే అని జనం నమ్ముతున్నారు. అడుగులో అడుగు వేస్తూ ఆ మహాసంకల్పానికిమద్దతుగా సాగుతున్నారు. ఆ యువనేత అడుగులు ఎక్కడుంటే అక్కడ సంబరంలా ఉంటోంది. రామచంద్రాపురం, మండపేట, అనపర్తి నియోజకవర్గాలమీదుగా సాగుతున్న ప్రజా సంకల్ప యాత్రకు వరుణుడు కూడా ఆటంకం కలిగించలేకపోతున్నాడు. చలిగాలులు, చినుకులు, వర్షాలు, బురద దారులు ఏవీ ప్రజా సంకల్పానికి అడ్డం కాలేకపోయాయి. అటు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్, ఇటు ప్రజలు ఎవ్వరూ వర్షాన్ని లెక్క చేయడంలేదు. జనం కోసం జగన్, జగన్ వెంట జనం అప్రతిహతంగా సాగుతూనే ఉన్నారు. ప్రతి నియోజక వర్గంలోనూ మహిళలు పెద్ద సంఖ్యలో యువనేతకు బ్రహ్మరథం పడుతున్నారు. గోదావరి వాసుల ఆత్మీయతను అడుగడుగునా జననేతకు పంచి పెడుతున్నారు. 
మహత్తర ఘట్టం
మహానేత వైఎస్సార్ జయంతి, మహాసంకల్ప యాత్రికుని పాదయాత్ర 2500 కిలోమీటర్లకు చేరడం యాధృచ్ఛికంగా ఒకే రోజు వచ్చాయి. ఈ సందర్భంగా తండ్రిని స్మరించుకుని, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసారు వైఎస్ జగన్. పసలపూడి ప్రాంతంలో యువనేత ప్రజాసంకల్ప పాదయాత్ర 2500 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకుంది. ఈ  సందర్భంగా వైఎస్ జగన్ అభిమానుల మధ్య భారీ కేక్ ని కట్ చేసారు. పసలపూడి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భారీ సంఖ్యలో అభిమానులు వచ్చి యువనేతను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పూల వర్షం కురిపిస్తూ, నవరత్నాల ఫ్లెక్సీలతో వైఎస్ జగన్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.  
పెరుగుతున్న చేరికలు
వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ఆరంభమైన కొద్ది రోజులకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. ప్రజల నాడి తెలిసిన నాయకుడు, ప్రజలు పట్టం కట్టనున్న నాయకుడి వెంట సాగాలని ఎంతో మంది ఇతర పార్టీల నేతలు, మాజీ రాజకీయనాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరుతున్నారు. వారివెంటే వందలాదిగా కార్యకర్తలు కూడా పార్టీలోకి వస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మహిధర్ రెడ్డి భారీగా తన అనుచరులతో తరలి వచ్చి, మందలపాక వద్ద ప్రజా సంకల్ప యాత్ర సాక్షిగా వైఎస్ జగన్ ను కలిసారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రజలతో పాటు నేనూ నమ్ముతున్నానని, అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతున్నానని ప్రకటించారు. టిడిపి నేతలు మాజీ ఎమ్మెల్సీ వెంకట శివారెడ్డి, కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ మాజీ మంత్రి శేషశయనారెడ్డి మనవడు బైరెడ్డి సిద్ధారెడ్డి సైతం 400 నాయకులు, కార్యకర్తలతో ఊరేగింపుగా తరలి వచ్చి, వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. 
యువనేతను కలుస్తున్న సినీ ప్రముఖులు
పాదయాత్రలో వైఎస్ జగన్ ను ప్రత్యేకంగా వచ్చి కలుస్తున్నారు సినీ ప్రముఖులు. గతంలో పోసాని కృష్ణ మురళి, హాస్యనటుడు పృథ్వీ ప్రజా సంకల్పయాత్రలో ఉన్న యువనేతను కలిసారు. సినీ ప్రముఖుడు ఛోటాకే నాయుడు సైతం జగన్ తో కలిసి పాదయాత్రలో అడుగులు వేసారు. ముఖ్యమంత్రి అంటే ఇలాంటి మనిషే ఉండాలి అనిపించేలా వైఎస్ జగన్ ఉన్నాడంటూ కితాబిచ్చారు ఛోటాకె నాయుడు. ఆయనతో కలిసి పాదయాత్రలో కొద్దిసేపు నడిచారు. పాదయాత్ర, దానికి లభిస్తున్న జనాదరణ చూసాక జగన్ పై అభిమానం పెరిగిందని అన్నారు. 
వానలో జనవెల్లువగా బహిరంగ సభలు 
రామచంద్రాపురం, రాయవరం ప్రాంతాల్లో బహిరంగసభల్లో వానను కూడా లెక్కచేయకుండా జనసందోహం పోటెత్తింది. అభిమాన నాయకుని చూసేందుకు గాలులు, వర్షాలు, వడగళ్లూ అడ్డంకావని అన్నారు గోదావరి వాసులు. చద్రబాబు అవినీతిపై యువనేత విరుచుకుపడే తీరుపై హర్షం వ్యక్తం చేస్తూ తమ ప్రతిస్పందన తెలుపుతున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో యువనేత అడుగు జాడలు ఎన్నో అపూర్వ ఘట్టాలకు వేదికలౌతున్నాయి. రాబోయే మంచి రోజులకు భరోసానిస్తున్నాయి. 

 
Back to Top