సీట్ల పెంపు అసాధ్యం

– నిబంధనల ప్రకారం 2026 లోపు లేనట్టే
– సెక్షన్‌ 26 ప్రకారం పెంపు అవసరం లేదు
– టీడీపీలోకి వలసలు ప్రొత్సహించడానికే వెంకయ్య ప్రకటనలు 
– 2031 జనగణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన 

హైకోర్టు విభజన విషయంలో తొందరేమీ లేదు.. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక రైల్వే జోన్‌ పెద్ద ఇంపార్టెంట్‌ ఇష్యూ కాదు.. పార్టీ ఫిరాయింపు అంశమూ అంత సీరియస్‌ కానే కాదు.. కానీ, తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు మాత్రం వీరికి ముఖ్యమైపోయింది...! 

పబ్లిసిటీ కోసం వెంకయ్య ఆరాటం
వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే, చెప్పేటోడు మహా మేధావి.. అన్నట్టుందిప్పుడు వ్యవహారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్, తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు అంశం ఇప్పట్లో సాధ్యం కాదనీ, ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నియోజకవర్గాల్ని పెంచాల్సి వస్తే ఆర్టికల్‌ 170(3)ని సవరించాల్సి వుంటుందనీ ఓ ప్రశ్నకు సమాధానంగా సెలవిచ్చారు. దీనిపై వెంకయ్యనాయుడు, చాలా వేగంగా స్పందించేశారు. కేంద్ర హోం మంత్రితో కూడా మాట్లాడేశారట. ఎంత స్పీడో కదా.? మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదనీ, నియోజకవర్గాల పెంపుకి సంబంధించి అవసరమైన సవరణల కోసం క్యాబినెట్‌ నోట్‌ తయారవుతోందనీ సెలవిచ్చారు వెంకయ్యనాయుడు. తెలుగు రాష్ట్రాలకి ఇప్పుడాయనే ’పెద్దన్న’ మరి.! ఈ పెద్దన్న, పనికొచ్చే విషయాల్లో మాత్రం తన పెద్దరికం చూపించరు. ఎక్కడ పబ్లిసిటీ దొరుకుతుందో చూసుకుని, ఆయా అంశాల చుట్టూ వాలిపోతారంతే.! 

ప్రత్యేక హోదాని ఇలాగే నానబెట్టేశారు
ప్రజలకు నిజాలు తెలిస్తే వారిలో ఎక్కడ చైతన్యం పెరిగిపోతుందో అనే భయమో... లేదా, ప్రజలకు నిజాలు తెలిస్తే తన అమసర్థత మీద కప్పుకున్న మేలిముసుగు తొలగిపోతుందేమోననే ఆందోళన మితిమీరుతున్నదో తెలియదు గానీ.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాత్రం.. మాటలతో మాయచేస్తూ.. ప్రజలను పదేపదే బురిడీ కొట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో ఆయన ఎన్నిరకాల మాయమాటలు చెప్పి.. సాంతం రాష్ట్రప్రయోజనాలను భ్రష్టు పట్టించారో అందరికీ చాలా స్పష్టంగా తెలిసిందే. హోదా స్థానే ఒక చేవచచ్చిన పుచ్చు ప్యాకేజీని తీసుకువచ్చి.. అక్కడికేదో తాను రాష్ట్రాన్ని ఉద్దరించేస్తున్నట్లుగా రాష్ట్రమంతా పర్యటిస్తూ సన్మానాలు చేయించుకున్న చవకబారు వైఖరి ఆయనకు మాత్రమే చెల్లింది. అలాంటి వెంకయ్యనాయుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు విషయంలో మరోసారి మాటల గారడీతో మోసానికి తెగబడుతున్నారు. 

కుదరదని కేంద్రమంత్రి స్పష్టం చేసినా..
సమావేశాలు జరిగిన ప్రతిసారీ లోక్‌సభలో రాజ్యసభలో ఇదో రొటీన్‌ కొశ్చన్‌. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, తెరాస తరపు నుంచి ఇదే ప్రశ్న పడుతూ ఉంటుంది. మా రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను పెంచుతున్నారా లేదా? విభజన చట్టంలో ఆ ప్రతిపాదన ఉంది కదా.. అని అంటూ ఉంటారు. దీనికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఒకేమాట.. లేదు, పెంచే ప్రతిపాదనలేదు, 2026 వరకూ అలాంటి ఆలోచనే లేదు.. సీట్లు పెంచాలంటే రాజ్యాంగ సవరణ అవసరం, అదంతా ఇప్పుడు కుదిరేపని కాదు.. అని కేంద్ర హోంశాఖ నుంచి సమాధానం వస్తూ ఉంటుంది. 

ఆర్టికల్‌ 170 ఏం చెబుతోంది...?
సీట్ల పెంపు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170కి లోబడి ఉండాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. 2008లో దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. తదుపరి పునర్విభజన 2026 తర్వాత తీసుకునే తొలి జనాభా లెక్కల ప్రచురణ ఆధారంగా మాత్రమే చేయాలని ఆర్టికల్‌ 170(3)లో పొందుపరిచారు. 2026 తర్వాత తొలి జనాభా లెక్కలంటే 2031లో చేపట్టబోయే జనగణన వరకు నియోజకవర్గాల పెంపుకోసం ఆగాల్సి ఉంటుంది. అయితే దీనివల్ల ఆశించిన లక్ష్యం నెరవేరదని, విభజన చట్టంలోని సెక్షన్‌ 26ని సవరించి వచ్చే ఎన్నికల నాటికి సీట్లు పెంచాలని టీyî పీ, టీఆర్‌ఎస్‌ కోరుతూ వస్తున్నాయి. అందుకు అటార్నీ జనరల్‌ మాత్రం దీనికోసం 170(3)కి సవరణలు చేయాలని గతంలోనే న్యాయశాఖకు సలహాఇచ్చారు. 

సెక్షన్‌ 26లో ఏముంది..? 
రాష్ట్రం విడిపోయాక ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను 175, 119గా నిర్ణయించారు. అయితే పునర్విభజన  చట్టంలో సెక్షన్‌ 26 కింద ఆ  సంఖ్యను 175 నుంచి 225కి, 119 స్థానాలున్న తెలంగాణలో 153కి మార్చుకోవచ్చని పొందుపరిచారు. అవిభాజ్య ఉత్తరప్రదేశ్‌ విభజన సమయంలో ఉత్తరాఖండ్‌లోకి 21 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వెళ్లాయి. సాధారణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు 60కి తక్కువ ఉండకూడదన్న రాజ్యాంగ నిబంధనకు లోబడి రాజకీయ అనిశ్చితి రాకూడదన్న ఉద్దేశ్యంతో ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ స్థానాలను విభజన చట్టంలోనే 70కి పెంచారు. దీని ప్రకారమే రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అంశాన్ని పొందుపరిచారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్య 175, 119 ఉన్నాయి. పైగా ఇప్పటికే ఒక విడత ఎన్నికలు కూడా జరిగి దాదాపు మూడేళ్లుగా పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలో జనాభా లెక్కలు పూర్తయ్యేలోపు నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం దాదాపు లేనట్టే. అయినా టీడీపీ, టీఆర్‌ఎస్‌లు ప్రచారం చేసుకుంటున్నాయంటే అదంతా జంపింగ్‌ జపాంగ్‌లను ఊరుకోబెట్టడానికే వెంకయ్య చేత మోసపూరిత హామీలు గుప్పిస్తున్నారనేది సుస్పష్టం. 

ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలిగా..
ఏపీ, తెలంగాణల్లో సీట్లు పెరుగుతాయని వెంకయ్య చెప్పుకొచ్చారు. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ దగ్గర నోట్‌ రెడీ అయ్యిందన్నారు. మరి సభలో హోం మినిస్ట్రీ సహాయమంత్రి.. పెంచే యోచన లేదంటే, సభ బయట ఆ శాఖతో ఎలాంటి సంబంధం లేని వెంకయ్యా.. హోం మినిస్ట్రీ దగ్గర నోట్‌ ఉంది అని అంటున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సాంకేతికంగా 2026 వరకు అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచడానికి అవకాశమే లేదంటూ సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి     హన్స్‌రాజ్‌ జి.అహిర్‌ మంగళవారం నాడు లోక్‌సభలో చాలా విస్పష్టంగా ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాలు ఇప్పట్లో పెరగబోయేది లేదంటూ.. విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. సెగ్మెంట్లు పెంచేస్తాం అనే మాయమాటలు చెప్పి.. వక్ర రాజకీయాలు నడుపుతూ.. పార్టీ ఫిరాయింపులతో ఊరేగుతున్న కొందరు రాజకీయ పెద్దలకు చెమట్లు పట్టాయి. ఇలాంటి మంత్రాంగాలకు వెంకయ్యే దిక్కు కావడంతో వారు ఆయననే ఆశ్రయించారు. వెంకయ్య వెంటనే రంగంలోకి దిగారు. ఇదిగో అదిగో పెంచేస్తున్నాం.. అంటూ తాను ఇన్నాళ్లూ అందరినీ మబ్బులో పెట్టి పబ్బం గడుపుకుంటూ ఉంటే.. ఇప్పుడిలా జనానికి క్లారిటీ రావడం ఆయనకు ఇష్టం లేకపోయినట్లుంది. వెళ్లి హోంమంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ ను కలిశారు. బయటకు వచ్చి, కేంద్ర హోంశాఖ నియోజకవర్గాల పెంపుపై నోట్‌ తయారు చేస్తున్నది. లోక్‌సభలో ప్రకటన చేసిన సహాయ మంత్రికి విషయం తెలియదు.. అంటూ తనదైన శైలిలో మాయమాటలు ప్రయోగించారు. 

అదే మాట హోమంత్రితో చెప్పించవచ్చుగా..
వెంకయ్య మాటల్లో నిజాయితీ ఉన్నట్లయితే.. రాజ్‌నాథ్‌ తో భేటీ తర్వాత బయటకు వచ్చి తాను హామీ గుప్పించడం కాదు. చేతనైతే రాజ్‌నాధ్‌ తో గానీ, హోంశాఖ సహాయమంత్రితోనే గానీ ఇదే ప్రకటన చేయించి ఉంటే కాస్త నమ్మశక్యంగా ఉండేది. అలాకాకుండా.. తన నోటికి వచ్చినట్లుగా ఏదో నియోజకవర్గాలు పెంచేస్తున్నాం అనడం వల్ల జనాలను మళ్లీ మళ్లీ మాయలో ముంచడమే తప్ప ఫలితం మాత్రం ఉండదని.. ఆయన మాటల్లో చాలా లౌక్యంగా నోట్‌ తయారవుతున్నదనే చెప్పారు తప్ప.. సదరు తయారీ ఎప్పటికి పూర్తవుతుందో.. ఎప్పటిలోగా వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందో.. అనే మాటలు మాత్రం చెప్పడం లేదు. 
Back to Top