ఇరుక్కుపోయిన చంద్రబాబు

మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కంటే ఎక్కువగా పాద యాత్ర చేయాలని నిర్ణయించుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని ప్రతిఘటన ఎదురైందా... అంటే అనే సమాధానమే వస్తోంది. కుడితిలో పడ్డ ఎలుకలా మునగలేక, పైకి రాలేక ఆయన ఇబ్బంది పడుతున్నారు. దీనంతటికీ ఓ కారణముంది. మహానేత మాదిరిగా ఆ యాత్రను తెలంగాణ ప్రాంతంనుంచే మొదలు పెట్టాలనేది బాబు యోచన. ఆ ప్రాంతంలో గతంలో తనకెదురైన ఇబ్బందులను తప్పించుకోవడానికి రెండు కళ్ళ సిద్ధాంతాన్ని విడిచిపెట్టాల్సిందేనని ఆయన నిర్ణయించుకున్నారు. వెంటనే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చేద్దామనుకున్నారు కూడా. 
ఊహించని మలుపు
ఇక్కడే ఊహించని మలుపు ఎదురైంది. అదే సంభవిస్తే పార్టీకి రాజీనామా చేసేందుకూ వెనుకాడబోమని ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు బాబుకు తెగేసి చెప్పడంతో ఆయన కంగుతిని ఆలోచనలో పడ్డారు. లేఖ ఇస్తే తప్ప తెలంగాణలో అడుగు పెట్టలేని పరిస్థితి ఇప్పుడు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల నుంచి అనుకోకుండా ఎదురైన ఈ ధిక్కార ధోరణి ఆయనకు ఊపిరాడనీయడం లేదు. 
లేఖ ఇచ్చేస్తారని అదే పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు సంబరంపడిపోతుంటే.. మరో ప్రజాప్రతినిధి ఇంకో అడుగు ముందుకేసి హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేందుకు తమ పార్టీకి అభ్యంతరం లేదని పేర్కొంటూ లేఖ ఇవ్వబోతున్నారని విలేకరులకు చెప్పడం.. బాబుకు చిర్రెత్తించింది. వెంటనే ఆయనను పిలిచి చివాట్లు కూడా పెట్టారని తెలిసింది.
పేరు మాట సరే.. గండం గడిచేదెలా
పాదయాత్రతో పేరు కొట్టేద్దామనీ, తద్వారా పునరధికార ప్రాప్తికి మార్గం సుగమం చేసుకుందామనీ ఆయన భావించారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే, పాదయాత్ర మాట దేవుడెరుగు... ఈ లేఖ గండం నుంచి బయట పడడానికి మార్గాలను వెతుక్కోవలసిన పరిస్థితులు ఆయన ఏర్పడ్డాయి. కళ్ళెదుటే కనిపించిన ఆశల సౌథం నిలువునా కూలిపోతుంటే దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు.  ప్రధానితో ఐదు నిముషాల భేటీలో పొందిన ఆనందాన్ని వ్యక్తంచేసినంతసేపు పట్టలేదు డైలమాలో పడిపోవడానికి. లేఖ ఇవ్వండని తెలంగాణ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులంతా ముక్తకంఠంతో కోరిన నాడు ముక్తసరిగా కూడా మాట్లాడని బాబు... ఇప్పుడు ఎవరు కోరారని లేఖ ఇస్తానంటూ ప్రకటన చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సరే లేఖ తయారైందనుకుంటే దాన్ని పట్టుకెళ్ళి ఎవరికిస్తారని కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ కాల పరిమితి ముగిసిపోయింది. ఆ కమిటీ నివేదిక ఇచ్చేసి చేతులు దులిపేసుకుంది. ఇస్తే అప్పట్లోనే ఇచ్చి ఉండాలి. ఒకవేళ ఈయన తీసుకెళ్ళినా పుచ్చుకునేందుకు ఎవరూ ఖాళీగా లేరని స్పష్టమైపోయింది. దిక్కు తోచని స్థితిలో ప్రస్తుతానికి తాత్సార మంత్రాన్ని పఠించాల్సిందే బాబు గారూ!
Back to Top