ప్రభుత్వ నిర్లక్ష్యంతో మూతబడుతున్న ఫ్యాక్టరీలు.!

వేలాదిమంది కార్మికులు రోడ్డుపాలు..!
విదేశీ నామస్మరణతో రాష్ట్రానికి వెన్నుపోటు..!
పరిశ్రమలపై పచ్చప్రభుత్వం శీతకన్ను..!

విజయవాడ: రాష్ట్రంలోని పరిశ్రమలకు గడ్డుకాలం ఎదురైంది.  చంద్రబాబు పుణ్యమాని ఫ్యాక్టరీలన్నీ ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. దీంతో, వేలాదిమంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. పెట్టుబడుల పేరుతో సింగపూర్, జపాన్ ల చుట్టూ చక్కర్లు కొడుతున్న చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా..రాష్ట్రంలో ఉన్నపరిశ్రమలను పట్టించుకోవడం మానేశారు. ప్రభుత్వం నుంచి సహకారం లోపించడంతో  సరుకులు ఉత్పత్తి చేసే ఉత్పాదక పరిశ్రమలు మూసేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఫ్యాక్టరీల మూసివేతతో కార్మికులు ఉపాధి కోల్పోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.  

పడకేసిన పాలన..పరిశ్రమలకు గడ్డుకాలం..!
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు ఉదాహరణే ఫెర్రో పరిశ్రమలు.  స్టీల్ ఆధారిత ఉత్పత్తి తయారీకి ప్రధాన ఆధారమైన ఫెర్రో పరిశ్రమలకు... విద్యుత్ ఛార్జీలు భారంగా మారాయి. రాయితీలు కల్పించాలని పరిశ్రమల యాజమాన్యాలు పాలకులకు మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు.   విద్యుత్ ఛార్జీలు తగ్గకపోగా ఉత్పత్తి పెనుభారమైంది. దీంతో, నడపలేని పరిస్థిితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా 35 ఫెర్రో పరిశ్రమలుండగా, అందులో ఇప్పటికే 28 పరిశ్రమలు మూతబడ్డాయి. మిగిలిన పరిశ్రమలు సైతం సగం రోజులు మాత్రమే పనిచేస్తూ రేపో మాపో మూతబడేందుకు సిద్దంగా ఉన్నాయి. ఐనా  ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోంది. 

రాష్ట్రానికి వెన్నుపోటు..!
నూతన పారిశ్రామిక విధానంలో యూనిట్ కు రూ.1.50 పైసల వరకు రిబేట్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది.  కష్టాల్లో ఉన్న పాత పరిశ్రమలకు సైతం రిబేట్ ఇవ్వాలని ఫెర్రో పరిశ్రమల అసోసియేషన్ ముఖ్యమంత్రిని కలిసినా ఎలాంటి ఫలితం లేదు. విదేశీ నామస్మరణతో చంద్రబాబు రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారని ప్రజలు, ప్రతిపక్షాల నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి సొంత ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కళ్లుతెరిచి  కష్టాల కడలి నుంచి  పరిశ్రమలను గట్టెక్కించకపోతే ....చంద్రబాబు కార్మికుల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. 
Back to Top