విశ్వాసాలను అవహేళన చేస్తూ వివాదాల నియామకాలు


మనుషులనే కాదు మతాలను, దేవుడిని కూడా మోసం చేయగల ఘనుడెవరంటే చంద్రబాబు అనే చెప్పాలి. అధికారం చేతిలో ఉంటే ఉచితానుచితాలను ఖాతరు  చేయడు బాబు. టిటిడింతిరుమల తిరుపతి దేవస్థానం. కోట్లాదిమంది ప్రజల విశ్వాసాలకు, మనోగతాలకు, ఆధ్యాత్మిక చింతనకూ పెట్టని కోట ఆ ఏడుకొండలు. ఈ ఆలయ కార్యనిర్వాహక వర్గంలో వరుసగా పరమతస్తులను నింపుతుండటం చూస్తే ప్రభుత్వం కావాలనే ఇలా వ్యవహరిస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

అన్యమత ప్రచారకర్తలకు టిటిడి ఛైర్మన్ పదవి

టిటిడి బోర్డు ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ ను నియమించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్థిక మంత్రి యనమలకు దగ్గరి బంధువైన కారణంగా రాజకీయ పరమైన ఒత్తిడి ఒక కారణంగా ఇందులో కనిపిస్తోంది. అయితే పుట్టా సుధాకర్ ను టిటిడి కీలక పదవిలో నియమించడాన్ని హిందూధర్మ అనుయాయులు, మత బోధకులు, భక్తులు నిరసిస్తున్నారు. క్రైస్తవ మత ప్రచార సభలకు వెళ్లడమే కాక, ఆ సభలకు సంబంధించిన పత్రాల్లో తరుచూ పుట్టా సుధాకర్ ఫొటో ఉంటుందని, అన్యమత అభిమానిని ఇలాంటి పదవికి ఎలా ఎంపిక చేస్తారంటూ పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. 

తాను క్రిస్టియన్ నే అని చెప్పుకునే పాయకరావు పేట ఎమ్మెల్యే అనిత ను టిటిడి బోర్డు మెంబర్ గా చేయడం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పట్టే వ్యవహారమే. గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అనిత తాను క్రైస్తవాన్ని నమ్ముతానని, తన వెంట బైబిల్ ఎప్పుడూ ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు హిందూ ధార్మిక సంస్థలో పరమత అభ్యర్థిని ఎలా ఎన్నిక చేస్తారంటూ హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తిరుపతిలో అన్యమత ప్రచారకులు, అన్యమతస్తుల జోక్యం, చివరికి టిటిడి పాలనాయంత్రంగాంలోనూ అన్యమతస్తులకు పెద్ద పీట వేయడాన్ని హిందూత్వ వాదులు సహించలేకపోతున్నారు. ఈ విమర్శనలన్నీ విన్న తర్వాత అనిత స్వయంగా టిటిడి పదవికి రాజీనామా ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే విమర్శలకు సమాధానంగా ప్రభుత్వమే అనితతో రాజీనామా లేఖ రాయించిందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేని, మహిళలను ఒప్పించి తప్పించారు గానీ, ఆర్థికమంత్రి ఒత్తిడికి తలొగ్గి పుట్టా సుధాకర్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేక పోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.  

కుల కేటగిరీ

ఓపక్క మత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసిన చంద్రబాబు నియామకాల గొడవ తీరకముందే మరో వివాదానికి తెరలేచింది. టిటిడికి చెందిన వెంకటేశ్వరా భక్తి ఛానెల్ కు డైరెక్టర్ గా, ధర్మకర్తల మండలిలో సభ్యుడిగా ఉన్న రాఘవేంద్రరావును ఛానెల్ ఛైర్మన్ గా నియమించారు. గతంలోనే ఆయనకు ఎస్వీబిసిలో పదవులివ్వడాన్ని పలువురు నేతలు, భక్తులుసైతం వ్యతిరేకించారు. హీరోయిన్లనే కాదు, దేవీ దేవతలను, చారిత్రక ప్రముఖ పాత్రలను సైతం అశ్లీలంగా, అంగాంగ సౌష్టవంగా చూపించే దర్శకుడికి పవిత్రమైన పదవిని ఇవ్వడంపై పలువురు తీవ్రంగా విమర్శించారు. కానీ చంద్రబాబు వేటినీ ఖాతరు చేయలేదు. ఇటీవలే చేసిన ఒక్కరోజు దీక్షకు సినీ ప్రముఖుల్లో రాఘేవంద్ర రావు వంటి కొందరు మాత్రమే వచ్చి మద్దతు పలికారు. కులాభిమానం, తన పంచనున్న వారిపై ఎలాంటి ఆరోపణలున్నా వారిని అందలమెక్కించడం అనే గుణం బాబులో ఎన్నాళ్లుగానో ఉంది. అందుకే నేడు రాఘవేంద్రరావు కు ఛైర్మన్ పదవి ఇవ్వడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నా బాబు తనకేం పట్టనట్టు ఉండిపోయాడు.

బాబు కోటరీకే కోటా

చంద్రబాబు కు నమ్మకస్తులు, ఎన్నో ఏళ్లుగా టిడిపికి లోపాయకారీ సేవలు చేసిన వారికే పలు పదవులు దక్కుతుండటం గమనించాల్సిన విషయం. ఎస్వీబిసి ఛానెల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న నరసింహారావు బాబు కు అత్యంత సన్నిహితుడే. గతంలో జర్నలిస్టుగా పనిచేసే సమయంలో ముఖ్యమంత్రి తనతో పాటు వెంటబెట్టుకుని హెలికాఫ్టర్ లో తిప్పినంత చనువు వీరిద్దరి మధ్యా ఉంది. ఆ బాంధవ్యమే నరసింహారావుకు ఎస్వీబిసి సిఇఓ పదవికి కారణమని చాలామంది విమర్శించారు. నియామకే ఓ దుమారం అయితే ఏడాదిలోపే ఆయనపై లెక్కలేనన్ని అవినీతి ఆరోపణలు చుట్టుముట్టడం, ప్రభుత్వమే విచారణ చేపట్టాల్సి రావడం కొసమెరుపు. 
ఆధ్యాత్మిక వాదులు, హిందూ ధర్మపరిపోషకులు, సామాన్య భక్తులకు ఆగ్రహం తెప్పించేలా, హిందూ ధర్మ విశ్వాసాలను దెబ్బతీసేలా చంద్రబాబు నిర్ణయాలు ఉంటున్నాయని విశ్లేషకులంటున్నారు. 


 
Back to Top