పచ్చపార్టీకి పరాభవం

– టీచర్, గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో టీడీపీకి ఎదురుదెబ్బ
– చంద్రబాబు అధికార గర్వానికి గ్రాడ్యుయేట్ల హెచ్చరిక 
– వైయస్‌ఆర్‌ సీపీ బలపరిచిన అభ్యర్థిదే విజయం
– డబ్బు రాజకీయాలు తాత్కాలికమేనని తేల్చిన టీచర్లు
– ఒక వర్గం ఓటర్లలోనే ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టం 

ఒంటి మీద చారలున్నంత మాత్రాన పిల్లి.. పులి కాలేదు. డబ్బులిచ్చి అరువు తెచ్చుకున్న గాలివాటానికి ఎంగిలి ఇస్తరాకుల్లా ఎగిరిపడ్డ పచ్చ పార్టీకి ఓటు దెబ్బ గట్టిగానే తగిలింది. పచ్చని కుటుంబంలో చిచ్చురేపి చంకలెగరేసిన దొంగల ముఠాకు గ్రాడ్యుయేట్, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొకం వాచిపోయేలా ఓటమి అంటగట్టి ఇంటికి పంపారు. రెండు వేల ఓట్లు కూడా లేని ఎన్నికల్లో కోట్లు గుమ్మరించి అసెంబ్లీలో కాలు దువ్విన చంద్రబాబుకు గంటలు గడవక ముందే గట్టిగా బదులు తీర్చుకున్నారు. వాపు చూసుకుని బలమని విర్రవీగి ఆకాశంలో విహరిస్తున్న పచ్చ పార్టీ నేతలను ఒక్కసారిగా జుట్టు పట్టుకుని కిందకు దించారు. అధికారం ఉంది కదా అని విర్రవీగితే తోక కత్తిరించి పారేస్తామని చెప్పకనే చెప్పారు. 

బాబును గంటల్లోనే నేలకు దించిన ఓటమి
స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో  గెలిచే సరికి తమ అధికారం మరో ఐదేళ్లపాటు ఎక్స్‌ టెండ్‌ అయినట్టుగా ఫీలవుతున్నారు తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ అభిమానులు, అనుకూల మీడియా. మరి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏ రీతిన నెగ్గిందనే విషయం కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నా... అద్భుతం చేసేసినట్టు భుజాలు ఎగరేస్తున్నారు. మరి అన్నిచోట్లా కొని గెలవడం అనేది సాధ్యంకాదనే అంశం కేవలం కొన్ని గంటల్లోనే టీడీపీకి క్లారిటీ వచ్చింది. స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు జరిగిన టీచర్స్, గ్రాడ్యుయేట్స్‌ కోటాలోని ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. ప్రస్తుతం ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటో స్పష్టం అవుతోంది.

టీచర్స్‌ తమ వైఖరి స్పష్టం చేశారు
టీచర్స్‌ కోటా విషయానికి వస్తే.. తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమల పరిధిల్లోని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పరువు నిలుపుకోలేకపోయింది. ఇక్కడ ప్రతిపక్షాల అభ్యర్థులు విజయం సాధించారు. తూర్పులో విఠపు, పశ్చిమలో కత్తి నరసింహారెడ్డి విజయకేతనం ఎగరేశారు. వామపక్ష పార్టీల తరపున పోటీ చేసిన వీళ్లకు ప్రతిపక్ష వైఎయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. ఇక్కడ సిట్టింగులకు తెలుగుదేశం పార్టీ తీర్థం ఇచ్చింది. గత ఎన్నికల్లో గెలిచిన వారిని పార్టీలోకి చేర్చుకుని.. వారినే అభ్యర్థులుగా పెట్టింది. అయితే ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వోద్యుగులైన టీచర్లు వేసిన ఓట్లతో అధికార పార్టీపై వారి వైఖరేమిటో స్పష్టం అయ్యింది.

పట్టభద్రుల్లో వైయస్‌ఆర్‌సీపీ హవా..
ఇక పట్టభద్రుల ఎన్నిక విషయానికి వస్తే.. తాము పోటీ పెట్టిన చోట వైయస్ఆర్సీపీ జయకేతనం ఎగరేసే దిశగా వెళ్తోంది. పశ్చిమ రాయలసీమలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌ రెడ్డి విజయం దిశగా ముందుకు వెళ్తున్నాడు. దాదాపు నాలుగువేల ఓట్ల మెజారిటీని సాధించిన ఆయన గెలవడం ఖాయమే అని పోలింగ్‌ ట్రెండ్స్‌ స్పష్టం చేస్తున్నాయి. బ్యాలెట్‌ పేపర్లపై జరిగిన ఎన్నిక కావడంతో కౌంటింగ్‌ లేట్‌ అవుతోంది.
ప్రజాతీర్పు అంటే.. అమ్ముడుపోయే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇచ్చేది కాదు. అలాగని టీచర్ల, పట్టభద్రులు ఇచ్చింది కూడా వందశాతం ప్రజాతీర్పు కాకపోవచ్చు. అయితే.. టీచర్ల, పట్టభద్రుల ఓట్లను మాత్రం ర్యాండమ్‌ శాంపిల్స్‌గా తీసుకోవచ్చు. 

బాబు ఇప్పుడేమంటాడో..?
గాలివాటు విజయాన్ని చూసి జొబ్బలు చరుచుకున్న చంద్రబాబు ఇప్పుడు సమాధానం చెప్పగలడా. రెండు వేల మందినైతే పది పదిహేను లక్షలు ఖర్చు చేసి కొనగలిగాడు. కుటుంబాల్లో చిచ్చు రేపి విజయం సాధించి చంకలెగరేశాడు. కానీ స్పష్టంగా సమాజంలోని ఒక వర్గం పోటీ చేసిన ఎన్నికల్లో మొహం వాచిపోయేలా ఇచ్చిన తీర్పుకు కనబడకుండా పోయాడు. నిన్న అసెంబ్లీలో వైయస్‌ జగన్‌తో సహా ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా పోటీ చేసి గెలవాలని డిమాండ్‌ చేశాడు. అప్పుడే ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. మా పార్టీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన 21 మందితో ముందుగా రాజీనామా చేయించి గెలవమని సవాల్‌ విసిరితే ఇంతవరకు సమాధానం లేదు. పార్టీ ఫిరాయించి సంవత్సరం దాటినా వారితో రాజీనామా చేయించే దమ్ములేని బాబుకు వైయస్‌ఆర్‌సీపీని రాజీనామా చెయ్యమనే అర్హత ఉందా.. నిజానికి ఎవరు రాజీనామా చేయాలి. అనైతికంగా, అశాస్త్రియంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని రాజకీయాలు చేస్తున్న బాబు రాజీనామా చేయాలి. న్యాయం కోసం అధికార పక్షంపై పోరాడుతున్న వైయస్‌ జగన్‌ ను రాజీనామా చేయమనడం సిగ్గుచేటు....? తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించినప్పుడు గొంతు చించుకుని నీతి న్యాయాల గురించి మాట్లాడిన బాబుకు ఆంధ్రాలో మాత్రం చేర్చుకోవడం కరక్టేనా.. డబ్బులు వెదజల్లి గెలిచిన విజయాన్ని గొప్పగా ప్రచారం చేసిన పచ్చ మీడియా ఇదంతా చూస్తూనే ఉంది తప్ప బాబు అవినీతిని ప్రశ్నించే ధైర్యం మాత్రం చేయదు. ఇదీ చంద్రనీతి ...
Back to Top