రైతుల గుండె కోత వినిపిస్తుందా..

హైదరాబాద్) ఆంధ్రప్రదేశ్ లోని పల్లె పల్లెల్లో రైతులు అల్లాడిపోతున్నారు. అప్పుల బాధ తట్టుకోలేక కొంతమంది రైతులు ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తుంటే, ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆలోచిస్తున్నామని సూక్తులు చెబుతోంది. ఈ పరిస్థితి మీద హైకోర్టు స్పందించింది. రైతు ఆత్మహత్యలు దేశానికి ఏమాత్రం శ్రేయాస్కరం కాదని స్పష్టం చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెరుగుతున్న ఆత్మహత్యల మీద హైకోర్టులో ప్రజా ప్రయోజనాల పిటీషన్ దాఖలైంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బొసాలే, జస్టిస్ ఎస్ వి భట్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్ మీద విచారణ చేపట్టింది. ఈ మొత్తం వ్యవహారం మీద ఒక నివేదిక అందించాలని రెండు తెలుగు రాష్ట్రాల్ని ఆదేశించింది.
ఈ సందర్భంగా న్యాయస్థానం సభ్య సమాజం ఆలోచించే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. పరిహారం పెంచినంత మాత్రాన ఆత్మహత్యలు ఆగవని అభిప్రాయ పడింది. మూలాల్లోకి వెళ్లి సమస్యను పరిష్కరించాలని అభిప్రాయ పడింది. రైతుల ఆత్మహత్యల మీద ప్రతీ రోజూ పత్రికల్లో కథనాలు వస్తున్నాయని పేర్కొంది. రైతుల పరిస్థితి విదారకంగా ఉందని అభిప్రాయ పడింది.
ఉన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు చాలా అర్థ వంతమైనవి. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం సారధ్య ప్రభుత్వం చెవులకు ఇటువంటి మంచి మాటలు ఎక్కేట్లుగా లేవు. రైతుల్ని గాలికి వదిలేసి పాలన సాగిస్తున్నందున రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సంగతి ఎప్పుడు గుర్తిస్తారో, రైతులకు ఎప్పటి నుంచి మంచి రోజుల వస్తాయో దేవునికే తెలియాలి.
Back to Top