హారతులు... అఖండ స్వాగతాలు!

మహానేత రాజన్న తనయ, జననేత జగనన్న సోదరి శ్రీమతి షర్మిలకు సత్తుపల్లి జనం నీరాజనం పట్టారు. వరదగోదారిలా పోటెత్తిన జనంతో పట్టణం రోడ్లన్నీ ఇసుక వేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయాయి. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చీమలదండును తలపించింది. బహిరంగ సభ జరిగిన బస్టాండ్ సెంట‌ర్ జనవరదే ‌వెల్లువెత్తింది. సత్తుపల్లి పట్టణంలోకి ప్రవేశించిన మరో ప్రజాప్రస్థానానికి స్థానికులు అఖండ స్వాగతం పలికారు. మేము సైతం... అంటూ శ్రీమతి షర్మిల అడుగులో అడుగు కలిపి కదిలారు. బస్టాండ్‌సెంటర్‌లో జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. మహానేత రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్న వైనాన్ని గుర్తుచేశారు.‌ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, ప్రతిపక్ష టిడిపి వైఖరిని ఎండగట్టారు. షర్మిల ప్రసంగాన్ని ఆసాంతం శ్రద్ధగా విన్న ప్రజలు ఆమెకు మద్దతుగా ‌'జై జగ'న్నినాదాలు చేశారు.

సత్తుపల్లి (ఖమ్మం జిల్లా) : మరో ప్రజాస్థానం పాదయాత్రగా శనివారం సత్తుపల్లి చేరుకున్న శ్రీమతి షర్మిలకు స్థానిక ప్రజలు అఖండ స్వాగతం చెప్పారు. మహిళలు ఆమె మంగళహారతులు పట్టారు. యువకులు, వృద్ధులు, చిన్నా, పెద్దలు తేడా లేకుండా పాదయాత్రకు ఎదురేగి స్వాగతించారు. మేము సైతం.. అంటూ పాదయాత్రలో పాల్గొన్నారు.

సత్తుపల్లి మండలంలోని కిష్టారం సమీపంలో ఏర్పాటు చేసిన శిబిరానికి శనివారం ఉదయమే ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడ అందరికీ అభివాదం చేస్తూ శ్రీమతి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్ర కిష్టారానికి చేరుకోగానే పెద్ద ఎత్తున ఆ గ్రామ ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. ఓపెన్‌ కాస్టు కారణంగా తమకు జరుగుతున్న అన్యాయం గురించి శ్రీమతి షర్మిలకు గ్రామస్థులు వివరించారు. వారికి భరోసా ఇచ్చిన శ్రీమతి షర్మిల వెంగళరావునగర్‌ వైపు పాదయాత్ర సాగించారు.

వెంగళరావునగర్‌ మహిళలు భారీ సంఖ్యలో రోడ్డుపైకి వచ్చి శ్రీమతి షర్మిలకు హార్దికంగా స్వాగతం పలికారు. భోజన విరామం అనంతరం పాదయాత్ర సత్తుపల్లి పట్టణానికి చేరింది. సత్తుపల్లిలో సుమారు మూడు కిలోమీటర్ల మేర రోడ్డు మొత్తం జనంతో నిండిపోయింది. ద్వారకాపురి కాలనీ, గాంధీనగరం, బస్టాండ్ సెంట‌ర్ వరకు పాదయాత్ర సాగింది. సత్తుపల్లి టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ సెంట‌ర్ ఎదురుగా ఉన్న వై‌యస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. రోడ్డు‌కు ఇరువైపులా విశేష సంఖ్యలో మహిళలు బారులుతీరి శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. భవనాలపైన కూడా ఎక్కిన ప్రజలు శ్రీమతి షర్మిలను చూసేందుకు ఉత్సాహం చూపారు. దారిపొడవునా ఎదురువచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ శ్రీమతి షర్మిల ముందుకు సాగారు.

జన ప్రభంజనంగా మారిన బస్టాండ్ సెంట‌ర్‌ : 
‌సత్తుపల్లి బస్టాండ్ సెంట‌ర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. మధ్యాహ్నం నుంచే ప్రజలు బస్టాండ్ సెంట‌ర్‌కు చేరుకున్నారు. దీనితో సత్తుపల్లి - ఖమ్మం, సత్తుపల్లి - అశ్వారావుపేట, సత్తుపల్లి నుంచి విజయవాడకు వెళ్లే కూడలి జనంతో నిండిపోయింది. సుమారు రెండు కిలోమీటర్ల మేరకు జనంతో రోడ్డు నిండిపోయింది. శ్రీమతి షర్మిల ప్రసంగిస్తున్నంత సేపు ‘జై జగన్’‌, ‘వైయస్‌ఆర్‌ అమర్‌ రహే’ నినాదాలతో మార్మోగింది. అక్కడి నుంచి పాదయాత్ర హనుమాన్‌నగర్ వైపు ‌కొనసాగింది. జలగం వెంగళరావు పార్కు వద్ద ఉన్న మాజీ సీఎం జలగం వెంగళరావు విగ్రహానికి శ్రీమతి షర్మిల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాదయాత్ర పెద్దవంతెన మీదుగా తలమడ శివారులో ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరింది. శ్రీమతి షర్మిల ఖమ్మం జిల్లాలో 18వ రోజు శనివారంనాడు 11 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.
Back to Top