మోసపూరిత ప్రభుత్వం

హైదరాబాద్ః టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్య పాలనపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభలో మండిపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా...ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ మోసపూరిత పాలనను ఎండగట్టారు.


ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
మ‌హిళ‌లు సామాజికంగా, ఆర్థికంగా, అన్నిరంగాల్లో బ‌లోపేతం అయినప్పుడే ..మహిళా సాధికారిత సార్థకమవుతుందని  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి అన్నారు. డ్వాక్వా రుణాలు మాపీ చేస్తామని ప్రమాణస్వీకారం సాక్షిగా ముఖ్యమంత్రి చేసిన సంతకానికి విలువ లేకుండా పోయిందని ఈశ్వరి విమర్శించారు.  సంత‌కం చేసి, క‌మిటీ అంటారు. క‌మిటీ వేయ‌డానికే సంత‌కం అంటారు. ఇలా సంతకాలు తీసివేత‌ల‌కే త‌ప్ప అవి ఎక్కడా కూడా మహిళా సాధికార‌త‌కు ఉప‌యోగ‌పడడం లేదన్నారు.  మ‌హిళ‌ల సాధికారత కోసం ఎంతో చేస్తున్నామ‌ని చెబుతున్న చంద్ర‌బాబు... మెప్మా పేరిట మ‌హిళా రుణాల‌ను పూర్తిగా వ‌సూళ్లు చేయాల‌ని ఆదేశాలు జారీ చేయ‌డ‌మే కాకుండా ఆ సంస్థ ఉద్యోగుల‌పై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ధ్వజమెత్తారు. వసూల్ చేయనందువల్లే వారి వేత‌నాల‌ను పెంచ‌డం లేద‌న్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

ఉద్యోగులకు 43 శాతం  ఫిట్‌మెంట్ ఇచ్చి మెప్మా వారికి మాత్రం ఇవ్వ‌క‌పోవ‌డంతో వారు ఉద్య‌మాలు చేసిన సంఘ‌ట‌న‌లు కొక్కొల్ల‌లు. ప్ర‌స్తుతం ఉన్న ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు 58 నుంచి 60 సంవ‌త్స‌రాల‌కు పెంచారని... కానీ  కార్పొరేష‌న్‌లో ఉన్న మ‌హిళా ఉద్యోగులు, మిగ‌తా సంస్థ‌ల్లో ఉన్న మ‌హిళా ఉద్యోగుల‌కు మాత్రం రిటైర్‌మెంట్ వ‌య‌స్సు పెంచ‌క‌పోవ‌డం బాధ‌క‌ర‌మ‌న్నారు. బాలిక‌ల కోసం సంక్షేమ వ‌స‌తి గృహాలు, వ‌ర్కింగ్ ఉమెన్స్‌హాస్ట‌ల్స్ ఎక్క‌డ ఏర్పాటు చేశార‌ని ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించారు. 

ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
కురుపాం నియోజ‌క‌వ‌ర్గంలోని గర్భిణీ స్ర్తీల కష్టాలను వివరిస్తూ  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. గర్భిణులను విజ‌య‌న‌గ‌రం జిల్లా ఆస్ప‌త్రికి రిఫ‌ర్ చేయ‌డం వ‌ల్ల ...అక్క‌డి వైద్యుల నిర్ల‌క్ష్యంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నార‌ని ఆవేదన వ్యక్తం చేశారు.   ఓ త‌ల్లీ, బిడ్డ చ‌నిపోయిన విష‌యాన్ని సైతం జిల్లా మంత్రి దృష్టికి జిల్లా ప‌రిష‌త్ స‌మావేశంలో తీసుకెళ్లాన‌ని, దానిపై విచార‌ణ‌కు ఆదేశించారే త‌ప్ప ఎటువంటి నివేదిక లేదన్నారు.  గిరిజ‌న ప్రాంతాల్లోని ఐసీడీఎస్‌లో గిరిగోరుముద్దులు అనే ప్రాజెక్టును ప్ర‌వేశ‌పెట్టిన ప్రభుత్వం..దాన్ని స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌డం లేదన్నారు.  గర్భిణులు, చిన్న‌పిల్ల‌ల‌కు కుళ్లిపోయిన గుడ్లు, పాడైపోయిన పాలు ఇస్తుండడంతో  అనారోగ్యం పాల‌వుతున్నార‌ని ఆరోపించారు. ఇప్ప‌టికైనా ఆరోగ్య‌శాఖ మంత్రి కామినేని శ్రీ‌నివాస‌రావు ....గిరిజ‌న ప్రాంతాల్లోని శిశుమ‌ర‌ణాల్లో ప్ర‌త్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. 

ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి
ప్ర‌భుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఏపీ రివైండ్ పెన్షన్ రూల్స్1980 నుంచి అమలులో ఉంద‌ని, ఆ రూల్ ను 1-9-2004లో కాంట్రిబ్యూట‌రీ ఫెన్ష‌న్ విధానం తీసుకువ‌చ్చారని... ఈ రూల్ వ‌ల్ల 30 సంవ‌త్స‌రాల పాటు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయితే, వారికి రావాల్సిన పీఎఫ్‌, కుటుంబపెన్ష‌న్ త‌దిత‌ర సౌక‌ర్యాలు ర‌ద్ద‌వుతున్నాయ‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గౌరు చ‌రిత‌రెడ్డి అన్నారు.  పాత పెన్ష‌న్ పద్ధతిని కొన‌సాగించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాల‌ని సూచించారు. 

ఎమ్మెల్యే రాజేశ్వరి
త‌న నియోజక‌వ‌ర్గంలో తీవ్ర త్రాగునీటి స‌మ‌స్య నెల‌కొందని ఎమ్మెల్యే రాజేశ్వరి ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు. దేవీప‌ట్నం మండ‌లంలోని 42 గ్రామాల‌కు గాను కేవలం ఏడు గ్రామాలకు మాత్రమే పంట‌న‌ష్ట ప‌రిహారాన్ని ఇచ్చార‌ని, అదికూడా పూర్తిగా అందించ‌లేద‌ని వివ‌రించారు. పోల‌వ‌రంలో గిరిజ‌నులు, గిర‌జ‌నేత‌రుల‌కు ఇళ్ల స్థ‌లాలు కేటాయిస్తున్నార‌ని, దేవీప‌ట్నం మండ‌లంలో మాత్రం ఇళ్ల‌స్థ‌లాలు కేటాయించ‌డం లేద‌ని ఆరోపించారు. మినీ ఐటీడీఏ ఏర్పాటు చేశామ‌ని జీవో జారీ చేశారే త‌ప్ప.... అధికారుల‌ను నామామాత్రంగా నియ‌మించారన్నారు.  హౌసింగ్‌కాల‌నీ బిల్స్‌సైతం ఇప్ప‌టి వ‌ర‌కు ఇవ్వ‌లేదన్నారు. 


Back to Top