మైనారిటీలపై ప్రభుత్వం నిర్లక్ష్యం

మైనారిటీ నిధుల కేటాయింపులపై..
ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపిన వైఎస్సార్సీపీ
ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని మండిపాటు

హైదరాబాద్ః మైనారిటీల సంక్షేమం నిధుల విషయంలో అధికారపక్షం ఇరుకున పడిపోయింది. మైనారిటీలకు కేటాయింపులకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ తప్పిదాలను సభలో ఎండగట్టారు. మైనారిటీలకు నిధుల కేటాయింపులపై ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ వాకౌట్ చేసేందుకు కూడా ప్రభుత్వం అనుమతివ్వకపోవడంపై వైఎస్సార్సీపీ ఆందోళనకు దిగింది. స్పీకర్ పోడియం వద్ద కింద కూర్చొని ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. 

2014-15 ఆర్థిక సంవ‌త్స‌రంలో మైనార్టీల సంక్షేమం కోసం 60 శాతం నిధులు ఖ‌ర్చు చేశామ‌ని చెబుతున్న ప్ర‌భుత్వం... కేవలం రూ. 60 కోట్లు కేటాయించి అందులో రూ. 20 కోట్ల‌ను మాత్ర‌మే ఖ‌ర్చు చేశార‌న్నారు.  మిగ‌తా రూ. 40 కోట్ల ప‌రిస్థితి ఏంటని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంజాద్‌ బాషా ప్ర‌భుత్వాన్ని మీడియా పాయింట్ వ‌ద్ద నిల‌దీశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం మైనార్టీల‌కు తీర‌ని అన్యాయం చేస్తుంద‌ని మండిపడ్డారు. ఎన్నిక‌ల‌కు ముందు నిరుద్యోగులకు రూ. 5 లక్షల వరకు వ‌డ్డీలేని రుణాలు మంజూరు చేస్తామ‌ని హామీ ఇచ్చిన టీడీపీ.. ఇప్పుడు ఆరుణాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్ర‌శ్నించారు. వైఎస్సార్‌ జిల్లాలో ముస్లింల‌కు రూ. 5.5 కోట్లు కేటాయింపులు చేసినా.. అందులో కేవ‌లం రూ. 2 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చు చేశార‌ని, మిగ‌తా నిధులు ఏమయ్యాయ‌ని కడిగిపారేశారు.  

మైనార్టీ మ‌హిళ‌ల‌కు స్వ‌యం స‌హాయ‌క గ్రూపుల‌కు ఒక్కొక్క‌రికి రూ.5 వేల స‌హాయం అందిస్తామ‌ని చెప్పార‌ని, మైనార్టీ ఆడ పిల్ల‌ల పెళ్లికి రూ. 50 వేలు అందిస్తామ‌ని చెప్పి వాటిని నీరుగారుస్తున్నారని మండిప‌డ్డారు. ఫ్రీ మెట్రిక్ స్కాల‌ర్‌షిప్ లు రూ. 40కోట్లు కేటాయిస్తే అందులో ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు చేయ‌లేద‌ని ఆరోపించారు. ముస్లిం యువ‌త‌కు రూ. 5ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలు అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చిన ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రికి కూడా రుణాలు అందించిన పాపాన పోలేదన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో మైనార్టీలు వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసినందుకే ప్ర‌భుత్వం ఇలా క‌క్షపూరితంగా వ్య‌వ‌హారిస్తుంద‌ని అమ్జద్ బాషా అన్నారు. 

ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్, ఇతర మైనార్టీ వర్గాలపైనా ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్‌రెడ్డి అన్నారు.  మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ 15 పాయింట్ల పథకం ప్రవేశపెట్టారని, దీనిపై కనీసం కమిటి వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ఎస్సీల మాదిరి మైనార్టీలకు ఓ సెల్, కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. బీజేపీ, టీడీపీలు కలిసి మైనార్టీల గొంతు నొక్కుతున్నాయని ఎస్వీ మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల బాధను పట్టించుకోవడం లేద‌నే  తాము స్పీకర్ పై అవిశ్వాసం పెట్టామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. మైనార్టీలు అనగానే మాట్లాడటానికి కేవలం రెండు నిమిషాలు కూడా సమయం ఇవ్వడం లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

అంతకుముందు సభలో కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. చంద్రన్న రంజాన్ కానుక పేరుతో  వారికి సాయం అందిస్తున్నామని మంత్రి రఘునాథరెడ్డి చెప్పడాన్ని...చాంద్‌బాషా అభ్యంతరం తెలిపారు. మంత్రి చెబుతున్నదంతా  అవాస్తవాలని అన్నారు.  2015-16 బడ్జెట్‌లో రూ. 376 కోట్లు మైనారిటీల సంక్షేమానికి కేటాయించారని, కానీ బడ్జెట్‌ నివేదికలో మాత్రం రూ. 215 కోట్లు ఇచ్చినట్లు చెప్పారని అన్నారు. ఇలా బడ్జెట్ కేటాయింపుల కంటే అదనంగా ఖర్చుపెట్టినట్లు చెప్పడం ఏంటని మండిపడ్డారు.

అయితే చాంద్‌ బాషా ఇలా వివరిస్తుండగానే.. స్పీకర్ కలగజేసుకుని, సబ్జెక్టుల వారీగా వివరంగా అక్కర్లేదని, తక్కువగా ఖర్చు పెట్టారని చెబితే సరిపోతుందని అన్నారు. అయితే గతంలో ఒకో ప్రశ్నకు 20-40 నిమిషాలు కూడా కేటాయించేవారని, ఇప్పుడు మైనారిటీలకు సంబంధించిన అంశానికి కనీసం 5 నిమిషాలైనా ఇవ్వకపోతే ఎలాగని చాంద్ బాషా ప్రశ్నించారు.  


Back to Top