వైద్యం, విద్య వంటి ప్రాథమిక అవసరాల్ని తీర్చేందుకే ప్రభుత్వాల్ని ప్రజలు ఎన్నుకొంటారు. ఈ ప్రాథమిక రంగాల్లో ప్రైవేటు సంస్థలు ఎన్ని ఉన్నా, ప్రభుత్వ పరంగా అందించే సేవలు అన్నీ ఇన్నీ కావు.ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు కోట్లాది మంది పేదలకు సేవలు అందించాయి.. ఇప్పటికీ అందిస్తూనే ఉన్నాయి. అయితే, క్రమేణా ఈ వైద్య సేవల్ని ప్రైవేటుకి అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీవ్రమైన కుట్ర చేస్తోంది. ముందుగా పెద్దాసుపత్రుల్లోని వివిధ సేవల విభాగాల్ని ప్రైవేటీకరించే పని చేపట్టింది. మందుల షాపుల్ని దశల వారీగా ప్రైవేటు సంస్థలకు అప్పగించేసింది. తర్వాత వైద్య నిర్ధారణ పరీక్షలు చేసే డయాగ్నస్టిక్ విభాగాల్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టేందుకు చక చకా ఏర్పాట్లు జరిగిపోయాయి. తర్వాత ప్రధాన ఆసుపత్రుల్లోని వైద్య పరీక్షలు, వైద్య చికిత్సలకు ఉపకరించే పరికరాల నిర్వహణ, మరమ్మతుల పనుల్ని ప్రైవేటు సంస్థల చేతిలో పెట్టేసింది. మొత్తంగా పెద్దాసుపత్రుల్లో మానవ వనరులుమినహా మిగిలిన విభాగాల్ని క్రమంగా ప్రైవేటు సంస్థలకు తరలించేసింది. మరో వైపు, ప్రధాన ఆసుపత్రుల్ని కొన్నింటిని ప్రైవేటు ఆసుపత్రులకు అప్పగించేసింది. ఆయా ఆసుపత్రుల్లో మెడికల్ కాలేజీ సీట్లు తెచ్చుకొనేందుకు గాను టోకుగా ఇచ్చేసి చేతులు దులుపుకొంటోంది. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిని అపోలో గ్రూప్ కు అప్పగించటం జరిగింది. విశాఖపట్నంలోని ప్రధాన ఆసుపత్రిని ప్రైవేటు కి ఇచ్చేందుకు రంగం సిద్దం చేశారు. ఇదంతా ఒక ఎత్తయితే, పల్లె ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని ప్రైవేటు సంస్థలకు ఇచ్చేసేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. వైద్య సేవలు నాణ్యంగా అందటం లేదన్న వంకతో ఈ ఆసుపత్రుల్ని ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరగుతున్నాయి. వాస్తవానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనేవి అలనాడు ఎన్టీ రామారావు ప్రభుత్వ హయంలో ఏర్పాటు అయ్యాయి. పల్లె ప్రజలకు సైతం వైద్య సదుపాయాల్ని తీసుకొని వెళ్లేందుకు వీటిని నెలకొల్పారు. ఇందులో ప్రాథమిక వైద్య అవసరాలు తీర్చేందుకు ఒక ఫిజీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, నర్సులు మొదలైన సిబ్బంది ఉంటారు. దాదాపుగా ప్రతీ ముఖ్యమైన పల్లెటూరు లో నూ దీన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీయార్ స్ఫూర్తికి తూట్లుపొడిచేలా చంద్రబాబు ప్రభుత్వం ఉరకలు వేస్తోంది. పల్లెటూళ్లలోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రాజెక్టు రిపోర్టు తయారైంది. పైలట్ దిశగా రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్ని అప్పగిస్తున్నట్లు సమాచారం.