ఇంటికో ఉద్యోగంపై ప్రభుత్వం దొంగాట

రాజధానిలో భూములిచ్చిన రైతులకు ఇచ్చిన వాగ్దానంపై..
అసెంబ్లీలో మాట మార్చిన ప్రభుత్వం 
ఉద్యోగం ఇస్తామని చెప్పలేదంటూ మంత్రి నారాయణ వ్యాఖ్యలు
అన్యాయమని మండిపడ్డ ఆర్కే
ఇప్పటికైనా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని హెచ్చరిక

హైదరాబాద్ః ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ..ప్రశ్నోత్తరాల సమయంలో రాజధానిలో ఇంటికో ఉద్యోగం అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం...అసెంబ్లీలో మాట మార్చింది. తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న వాగ్దానం చేయలేదని అసెంబ్లీ సాక్షిగా పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పడం దుమారం రేపింది. 

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా  ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లేవనెత్తారు. సీఆర్‌డీఏ చట్టంలో ఏవేం వాగ్దానాలు చేశారో చూడాలని, వాటిలో ఏ ఒక్కటీ ఈరోజు వరకు నెరవేర్చలేదని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ముందు చెప్పి, ఇప్పుడు ఆ వాగ్దానం ఇవ్వలేదని చెప్పడం అన్యాయమని ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. 

రాజధానికి  భూములిచ్చిన రైతులందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తానన్న ముఖ్యమంత్రి...ఇవాళ వాళ్ల కాళ్లు లాగుతున్నారని ఆర్కే మండిపడ్డారు. రాజధానిలో భూములిచ్చిన పేదలకు ఉచిత విద్య అందిస్తాం, పెన్షన్లు ఇస్తాం, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం...  ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చడం లేదని ఆర్కే ఫైరయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో అక్కడి యువత అంతా ఆందోళనతో ఉందన్నారు. 

రైతులు పొలాలు పోయి, వ్యవసాయం గానీ ఉపాధి గానీ లేక... ఇబ్బంది పడుతున్న తరుణంలో మీరు చెప్పిన ఇంటికో ఉద్యోగం ఇప్పుడు ఇవ్వలేకపోతున్నామని  చెప్పడం అన్యాయమని ప్రభుత్వంపై ఆర్కే మండిపడ్డారు. రాజధాని ప్రాంతంలో 50 వేల మందికి పైగా అర్హులైన యువతీ యువకులు ఉంటే వాళ్లలోంచి తొలి దశ కింద 113 మందిని మాత్రమే ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చారని.. కానీ రూపాయి కూడా స్టైపండ్ ఇవ్వలేదు, కనీసం బస్సు చార్జీలు కూడా ఇవ్వలేదని అన్నారు. 

తాము బయట ఉద్యోగాలు కూడా వదులుకుని వచ్చామని, ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరని యువకులు సీఆర్డీఏ ఆఫీసు వద్ద అధికారులను నిలదీస్తే...పోలీసులతో బలవంతంగా కొట్టించి, కేసులు పెట్టి హింసించారని ఆర్కే తెలిపారు. ఉద్యోగాలివ్వకపోవడం అన్యాయమని చెప్పి  అక్కడ ఓ డైరెక్టర్ రాజీనామా కూడా చేశారన్నారు.  ఇదంతా ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్తిపాటి, నారాయణలకు కనపడడం లేదా అని నిలదీశారు.  అసలు వాగ్దానమే చేయలేదని మంత్రి నారాయణ సభలో చెప్పడం దారుణమన్నారు. ఇప్పటికైనా  ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని హెచ్చరించారు. పొలాలు ఇచ్చిన రైతుల కుటుంబాల్లో ఒకరికైనా ఉద్యోగం ఇవ్వాలని.. లేనిపక్షంలో  నెలకు రూ. 2వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
Back to Top