గెలుపు ఖాయం.. తేలాల్సింది మెజారిటీయే

– వైయస్‌ఆర్‌సీపీకి అన్ని అనుకూలతలే
– కలిసి రానున్న కృష్ణ– మహేష్, అక్కినేని అభిమానుల మద్ధతు
– చివరి నిమిషంలో పార్టీలో చేరిన ఫరూక్‌ మేనల్లుడు
– అంతర్గత కుమ్ములాటలతో టీడీపీ అతలాకుతలం 

నంద్యాలలో వైయస్‌ఆర్‌సీపీ మెజారిటీ ఖాయమైంది. ఇక తేలాల్సింది మెజారిటీయే. గత పదమూడు రోజులుగా ప్రతిపక్ష నాయకుడు. వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ చేస్తున్న ప్రచారంతో పార్టీ కేడర్‌లో కొండంత ఉత్సాహం చేరింది. నంద్యాల్లో వైయస్‌ జగన్‌ బహిరంగ సభకు ముందు 50 వేలు మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన టీడీపీ ఆ తర్వాత ఢీలా పడిపోయింది. బహిరంగ సభలో నంద్యాల నడిబొడ్డు జన సంద్రంగా మారడంతో ఆ రోజు నుంచే టీడీపీలో వణుకు మొదలైంది. ఆ క్షణం నుంచే వారిలో అసహనం మొదలైంది. జనాన్ని ఓట్ల కోసం బెదిరించడం... ఇళ్లిస్తామని ప్రలోభ పెట్టడం.. ప్రతిపక్ష పార్టీకి చెందిన చోటా మోటా నాయకుల ఇళ్లపై పోలీసులతో దాడులు చేయించడం.. ఇలా అధికారాన్ని అడ్డంపెట్టుకుని దాడులు.. ఎంతైన ఖర్చు చేయగల డబ్బుందన్న ధీమా పచ్చ పార్టీ ఆడిన ఆటలకు జనం విసిగిపోయారు. ఇంకా చెప్పాలంటే గెలుపు కోసం ఇంత దిగజారిపోవాలా అని అసహ్యించుకున్నారని చెప్పొచ్చేమో.. 
నాయకులేమీ తక్కువ తినలా..
టీడీపీ కార్యకర్తల పరిస్థితి అలా ఉంటే చంద్రబాబు నుంచి అఖిల ప్రియ ఇతర నాయకుల వరకు అంతకన్నా ఎక్కువే చేశారు. గోస్పాడులో చంద్రబాబు మొదలెట్టిన బెదిరింపుల పర్వం జనాన్ని కిడ్నాప్‌లు చేసి బెదిరించే వరకు పోయింది. మొదటి రెండు సార్లు ప్రచారానికి వచ్చిన చంద్రబాబు ఓటుకు 5 వేలిస్తాను.. నేనేసిన రోడ్ల మీద నడవద్దు.. నేనిచ్చి పింఛన్‌ తీసుకోవద్దు అని బెదిరించాడు.. రెండోసారి వచ్చినప్పుడు మాకేం చేశావని ప్రశ్నించిన వ్యక్తిని మీ ఇంటికి కలెక్టర్‌ను పంపిస్తా.. అరెస్టు చేయిస్తా., ముఖ్యమంత్రితో పెట్టుకోవద్దంటూ రెచ్చిపోయారు. అయితే మూడోసారి ప్రచారానికి వచ్చిన చంద్రబాబుకు తత్వం బొధపడింది. ఓటమి తప్పదని తెలిసినట్టుంది.. సానుభూతి కోసం కొత్త పల్లవి అందుకున్నాడు. జగన్‌ నన్ను కాలుస్తా అన్నాడు.. నన్ను ఉరితీస్తారా.. నా బట్టలు ఊడదీయిస్తారా.. అని చేసిన ప్రచారం చూసి చంద్రబాబుకేమోగానీ నంద్యాల జనానికి సిగ్గనిపించంది. జగన్‌ అన్నదాంట్లో తప్పేముంది.. మీరు అభివృద్ధి చేసుంటే ఆయనెందుకు అలా అనేవారు.. పైగా కాల్చినా తప్పులేదన్నారు తప్ప కాలుస్తానని అనలేదే.. అని టీడీపీ నాయకులను జనమే ఎదురు ప్రశ్నించే పరిస్థితులు చంద్రబాబు తనకు తానే కల్పించుకున్నాడు. పైగా చివరి రెండు రోజులు చంద్రబాబు నిర్వహించిన రోడ్‌ షో ఎంత పేలవంగా జరిగిందంటే ఆయన ప్రచార రథం వెనుకా ముందూ జనం లేక వెలవెలబోయింది. ఆ ఫోటోలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్‌ అయ్యాయి. వీటితోపాటు చంద్రబాబు చేసిన ఒక వ్యూహాత్మక తప్పిదానికి నంద్యాల ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియకుండా రాజకీయాలకు దూరంగా ఉన్న గంగుల ప్రతాప్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా నంద్యాల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరిన చంద్రబాబుకు భూమా అఖిల ప్రియ, భూమా వర్గం నుంచి ఊహించని షాక్‌ తగిలింది. దశాబ్దాలుగా వైరంతో ఉన్న గంగుల వర్గంతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని భూమా వర్గీయులు తేల్చిపారేశారు. తనను సంప్రదించకుండా గంగులను పార్టీలోకి తీసుకోవడంపై అఖిల ప్రియ కూడా చంద్రబాబుపైనా అసహనం వ్యక్తం చేశారు. నాలుగు రోజుల్లో ఎన్నికలుండగా ఆయనిప్పుడొచ్చి ఏం చేస్తారని ఆమె చేసిన వ్యాఖ్యలు చంద్రబాబును గట్టిగానే తాకాయి. సినీగ్లామర్‌ బలం చేకూరుస్తుందని నమ్ముకున్న చంద్రబాబుకు అదనపు కష్టాలు తెచ్చిపెట్టాయి. బాలయ్య బాబును బరిలోకి దించి ప్రచారం చేయిస్తే లాభం జరగకపోగా నష్టమే ఎక్కువ జరిగింది. బహిరంగంగా నోట్లు పంచడం, అభిమానిపై చేయి చేసుకోవడంతోపాటు అవినీతి మరకలు లేని, పార్టీకి రాజీనామా చేసి వచ్చిన శిల్పా సోదరులను తల్లి పాలు తాగి రొమ్ము గుద్దాని అని బాలయ్య చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. నిజానికి ఆ వ్యాఖ్యలు చేసే సందర్భంలో ప్రచార రథంపై ఆయన పక్కన పార్టీ ఫిరాయించి మంత్రి పదవులు అనుభవిస్తున్న అమర్నాథ్‌రెడ్డి, అఖిల ప్రియలు పక్కనే ఉండటం గమనార్హం. ఇవన్నీ చూసుకోకుండా బాలయ్య సోదరులను తప్పు పట్టడం ఆ పార్టీకి మైనస్సే. తన స్థాయిని తెలుసుకోకుండా వేణుమాధవ్‌ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌పై చంద్రబాబు సమక్షంలో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇరుకున పెట్టాయి. నాలుగు దశాబ్దాల అనుభవం అని ఊదరగొట్టుకునే చంద్రబాబు ఒక కమెడియన్‌ని తెచ్చుకుని తిట్టించాల్సిన దుర్గతి పట్టిందా అని విమర్శకులు బాబు తీరుపై దుమ్మెత్తి పోశారు. మొన్నటి వరకు తన పార్టీలో ఉన్నప్పుడు శిల్పాను ఒక్క మాటా అనని చంద్రబాబు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరిన తర్వాత శిల్పా సహకార్‌లపై దాడులు చేయించి వేధించడంపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. మోసాలు జరిగి ఉంటే మమ్మల్ని అరెస్టు చేసుకోవచ్చు అని శిల్పా కుటుంబ సభ్యులు కూడా నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో తెలియజేయడం టీడీపీకి గట్టిగానే తగిలింది. అగ్రిగోల్డ్, కేశవరెడ్డి బాధితులకు చంద్రబాబు న్యాయం చేయకపోగా ఎలాంటి ఆరోపణలు లేకుండా చక్కగా నడుస్తున్న శిల్పా సహకార్‌పై చంద్రబాబు చేసిన ఆరోపణలు ఆయన స్థాయిని మరింత దిగజార్చాయి. ఒకేఒక స్థానంలో జరిగే ఎన్నిక కోసం చంద్రబాబు పతనమైపోతున్నాడని జనం చర్చించుకుంటున్నారు..

వైయస్‌ఆర్‌సీపీ బలాలు..

ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించమని జగన్‌ సహా వైయస్‌ఆర్‌సీపీ నాయకులు చేసిన డిమాండ్‌కు అధికార పార్టీ నుంచి సమాధానమే లేదు. మూడేళ్లుగా చేయని అభివృద్ధి మేం అభ్యర్థిని నిలబెట్టడం ద్వారానే మొదలైందని చెప్పుకోవడంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు సక్సెస్‌ అయ్యారు. టీడీపీ గెలవకపోతే అభివృద్ధి ఆగిపోతుందని టీడీపీ పదే పదే చేసుకుంటున్న ప్రచారం వారికే మైనస్‌ అయ్యింది. గెలిచినా గెలవకపోయినా రాబోయే 2019 ఎన్నికల కోసమైనా చంద్రబాబు నంద్యాలను అభివృద్ధి చేసి తీరాల్సిందేనని.. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఓడిస్తేనే 2019 కోసమైనా అభివృద్ధి చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు జనంలోకి తీసుకెళ్లారు. పైగా నంద్యాలలో జరిగిన పూర్వపు ఎన్నికలను పరిశీలిస్తే ఈ స్థానంలో ఎన్నికలు ఎప్పటికీ ప్రతిష్టాత్మకమే... అదే సమయంలో ఫలితాలు కూడా ఆశ్చర్యకంగా సంచలనంగా ఉంటాయి. మొన్నటి ఎన్నికలను పరిశీలిస్తే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి 3600 ఓట్లతో విజయం సాధిస్తే.. ఎంపీకి మాత్రం ఎస్పీవై రెడ్డి 16వేల మెజారిటీ సాధించారు. అంటే ఇదంతా శిల్పా ఇచ్చిన పోటీనే. అన్నింటికీ మించి వైయస్‌ఆర్‌ కుటుంబం నిలబెట్టిన అభ్యర్థులెవరూ ఆ స్థానంలో ఓడిపోయిన చరిత్ర లేదు. టీడీపీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు కూడా వైయస్‌ఆర్‌సీపీ విజయానికి దోహదం చేస్తాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలో చేరికలో ఊపందుకున్నాయి. మద్దతు తెలిపే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇప్పటికే అక్కినేని అభిమానులు, కృష్ణ– మహేష్‌ అభిమానుల సంఘాలు వైయస్‌ఆర్‌సీపీకి మద్దతు ప్రకటించాయి. ఎన్నికలకు ఒకరోజు ముందు స్థానిక టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఫరూక్‌ మేనల్లుడు కూడా వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఏ విధంగ చూసినా వైయస్‌ఆర్‌సీపీ గెలుపు తథ్యమనే విషయం తెలుస్తుంది. 
 

Back to Top