మరో ప్రజా ప్రస్థానంలో తొలిరోజు..

నిత్యం ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతం ఆరోజున మాత్రం ఆ సంగతిని మరిచిపోయింది. కేరింతలు, చప్పట్లు, హర్షధ్వానాలతో ప్రతిధ్వనించింది. ఎటు చూసినా తండోపతండాలుగా జనం. వంద జాతరలకు ఒకేసారి ఎంతమంది హాజరవుతారో అంతమంది జనం.. ఒకేచోట చేరడంతో అక్కడ నెలకొన్న కోలాహలం అంతాఇంతా కాదు.
 
 అంతలోనే జగనన్న వదిలిన బాణం రివ్వున దూసుకొచ్చింది. దివంగత మహానేతను డాక్టర్ వైయస్‌ఆర్‌ను తలపిస్తూ ఎడమ చేయెత్తి అభివాదం చేస్తూ శ్రీమతి షర్మిల ప్రత్యక్షమయ్యేసరికి ఆ జన ప్రవాహంలో ఉత్సాహం ఉరకలెత్తింది. వైయస్‌ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ సమాధి దగ్గర అక్టోబర్ 18న ఆవిష్కృతమైన దృశ్యమిది. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకూ.. దానికి వంతపాడుతున్న టీడీపీ వైఖరిని నిరసిస్తూ శ్రీమతి షర్మిల నడక ప్రారంభించారు.
 
సందర్భం మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆరంభం. తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల, మహబూబ్‌నగర్, కోస్తాలోని తూగో, పగో, విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా.. ఇలా అన్ని ప్రాంతాలనుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రారంభ కార్యక్రమానికి విచ్చేశారు. అలా ప్రారంభమైన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ సాగింది. యాత్ర పొడుగునా అశేష సంఖ్యలో అభిమానులు జగన్నినాదాలతోనూ, రాజన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సాగింది.
 
 ప్రతి జిల్లాలోనూ దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ ప్రారంభించిన జలయజ్ఞం పథకాల పరిస్థితిని శ్రీమతి షర్మిల పరిశీలించారు. గలగల పారుతున్న నీటిని చూసి ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం వద్ద ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. రాజన్నను గుర్తుచేసుకున్నారు. 2003లో డాక్టర్ వైయస్‌ఆర్ వెంట నడిచిన అభిమానులు ఇప్పుడు కూడా షర్మిలకు తోడుగా వచ్చారు.  ఇచ్చపురంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర ముగుస్తున్న సందర్భంగా ఓ అవలోకనం.
 
 సర్వమత ప్రార్థనలు
 ఇడుపులపాయలోని డాక్టర్ వైయస్‌ఆర్ సమాధి వద్ద శ్రీమతి షర్మిల సర్వ మత ప్రార్థనలలో పాల్గొన్నారు. అనంతరం ‘నేను జగనన్న వదిలిన బాణాన్ని.. వైయస్ కూతురిగా, జగనన్న చెల్లెలిగా, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికురాలిగా ఈ ప్రస్థానాన్ని ఆరంభిస్తున్నా.. ఈ యాత్ర జగనన్న చేయాల్సింది. ఆయన రాలేని కారణంగా నన్ను పంపాడు. డాక్టర్ వైయస్‌ఆర్‌ను అభిమానించే ప్రతి గుండె, జగనన్న నాయకత్వంలో రాజన్న రాజ్యం సాధ్యమని నమ్మే ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా’నంటూ వేంపల్లెలో ఏర్పాటైన మొదటి సభలో శ్రీమతి షర్మిల తెలిపారు.

తొలిరోజు పాదయాత్ర ఇలా సాగింది...
*    ఉదయం 10.25 ఇడుపులపాయలో సమాధి వద్ద సర్వమత ప్రార్థనలు.
*    ఉదయం 10.58కి అక్కడే ఏర్పాటుచేసిన వేదికపై శ్రీమతి షర్మిల ప్రసంగం
*    ఉదయం 11.25కి శ్రీమతి వైయస్ విజయమ్మ జెండా ఊపడంతో పాదయాత్రలో తొలి అడుగు వేశారు. ట్రిపుల్ ఐటీకి వెళ్ళి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. అక్కడి నుంచి వేంపల్లె వైపు వెడుతుండగా పది కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచి పోయింది. బారులు తీరిన ప్రజలను పలకరిస్తూ.. జైత్రయాత్ర మాదిరిగా కనిపించింది.
*    మధ్యాహ్నం 2.20కి భోజన విరామానికి ఆగారు.
*   సాయంత్రం 4.30కి  యాత్రను పునః ప్రారంభించి.. సాయంత్రం 6.30కి వేంపల్లె నాలుగు రోడ్ల కూడలికి చేరారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం రాజీవ్ నగర్‌లోని రాత్రి బసకు చేరడంతో తొలి రోజు మరో ప్రజా ప్రస్థానం ముగిసింది.

Back to Top