చాదస్తమా...? చేతకాని తనమా..?


– హద్దులు దాటుతున్న చంద్రబాబు వెటకారం
– అభివృద్ధి పేరుతో పంట పొలాలను నాశనం చేసేందెవరు
– వేలాది ఎకరాల్లో నాశనమైన పంట పొలాలు 
– చేసిందంతా చేసి ఉష్ణోగ్రతలు తగ్గించాలని ఇప్పుడు అధికారులకు హుకుం 

వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే చాదస్తమో.. అధికారం ఉంది కదా ఏం మాట్లాడినా చెల్లుతుందన్న గర్వమో.. అనుకూల మీడియా ఉండగా మనం చెప్పిన ప్రతిదీ గొప్పగానే చూపిస్తారని ధీమానో తెలియదు కానీ.. చంద్రబాబు ఈ నాలుగేళ్లుగా చెప్పేవి.. చేసేవన్నీ వెటకారంగా ఉన్నాయి. 

తన గురించి స్వయంగా గొప్పలు చెప్పుకునే అలవాటున్న బాబు.. మరో అడుగు ముందుకేసి ఉష్ణోగత్రలు 10 డిగ్రీలు తగ్గించాలని అధికారులను ఆదేశించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. చంద్రబాబు ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశాడో తెలియదు కానీ.. ఈ విషయం చర్చకు రావడం ఒకరకంగా మంచిదే. అమరావతిలో నీరు– ప్రగతి కార్యక్రమంపై అధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించిన చంద్రబాబు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఎండ తీవ్రతను భరించలేకపోతున్నామంటూ కనీసం పది డిగ్రీల ఉష్ణోగత్రలు తగ్గించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. దీంతో అక్కడున్న అధికారులంతా నివ్వెరపోయారు. 

చంద్రబాబు చెప్పిన ఈ విషయాన్ని గమనిస్తే ఒక సామెత గుర్తుకొస్తుంది. అడుసు తొక్కనేల కాలు కడుగుటేల అని. అసలు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం ఎవరు చంద్రబాబు కాదా..?. ముమ్మాటికీ ఆయనే. ఎందుకంటే.. పచ్చని పంటలతో అలరారే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజధానిని నిర్మించాలని సంకల్పించడమే సరైన నిర్ణయం కాదని ఆనాడే ఎంతోమంది పర్యావరణ వేత్తలు అభిప్రాయపడ్డారు. ఖాళీగా పడి ఉన్న బంజరు భూములను కాదని.. మూడు పంటలు పండే సారవంతమైన పొలాలను రాజధానికి ఉపయోగించాలనుకోవడంపై ప్రజలు, పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత వచ్చినా చంద్రబాబు లెక్కచేయలేదు. రాజధానిపై శివరామకృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం అమరావతి నగరం రాజధానికి అనువైన ప్రాంతం కాదని.. భౌగోళికంగా సమస్యలుంటాయని, కొండవీడు వాగు పొంగితే నగరం మొత్తం మునిగిపోయే ప్రమాదముందని హెచ్చరించింది కూడా. అయినా చంద్రబాబు లెక్క చేయలేదు. అలాంటి పరిస్థితే వస్తే హై పవర్‌ మోటార్లతో నీరు తోడతానని బీరాలు పలికాడు. చివరకు అన్నంత పనే జరిగింది. మూడున్నరేళ్లకు ముక్కుతూ మూలుగుతూ రెండు బిల్డింగులు కడితే సెంటీ మీటర్‌ వర్షానికే కారిపోయి కార్యాలయం మొత్తం చిత్తడి చిత్తడిగా మారింది. మొదటిసారి ప్రతిపక్ష నాయకుడి క్యాబిన్‌లో నీరు కారినప్పుడు సీఐడీ విచారణ పేరుతో స్పీకర్‌ సహా హడావుడి చేసిన అధికార పార్టీ నాయకులు.. ఆ తర్వాత ఆ సంగతే మరిచిపోయారు. మొన్నీమధ్యనే మరోసారి వరదలై పొంగినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ఉష్ణోగ్రతలు తగ్గించే  ఆలోచన చంద్రబాబుకు ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. సంవత్సరానికి ఒకసారి కొత్త ఆలోచనలు చేస్తుంటాడాయన. గతేడాది ఇదే చంద్రబాబు అమరావతిలో ఎండల తీవ్రతను తగ్గించడానికి రోడ్ల వెంట ఏసీలు, కూలర్లు పెడతానని చెప్పిన ముచ్చట జనం ఇంకా మర్చిపోలేదు. అయితే ఖర్చులకు భయపడి అధికారుల మీద భారం వేసేశాడు. బీజేపీతో తెగతెంపులు చేసుకోకపోయుంటే కావాల్సినన్ని నిధులు సమకూర్చుకుని అన్నంత పనీ చేసేవాడేమో? 
Back to Top