అవినీతి సామ్రాట్టుపై తిరుగుబాటు చేద్దాం


ప్రజా సంకల్ప పాదయాత్ర గుంటూరు జిల్లా గుండా సాగుతోంది. పాదయాత్రలో ప్రత్యేక హోదా నినాదం ఉవ్వెత్తున ఎగిసి పడుతోంది. హోదా కోసం రహదారుల దిగ్భంధానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ పిలుపునందుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు రహదారులపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసారు. ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రజల ఊపిరి, దాన్ని సాధించడమే లక్ష్యం. అందుకు జరిగే పోరాటంలో వైఎస్ జగన్ వెంటే నడుస్తాం, యువనేత సంకల్పానికి అండగా నిలుస్తాం అంటూ యువతరం అడుగులో అడుగు కలిపింది. 
ఓపక్క ఉధృతంగా హోదా కోసం పోరాటం సాగుతుంటే చంద్రబాబు కుటిల నీతి, ప్యాకేజీ కోసం రహస్య లాలూచీలకు తెరతీసింది. పార్లమెంట్ లో లోపాయికారీ రాజకీయాలను మొదలెట్టింది. చీకట్లో హోదా ఉద్యమానికి ఉరివేసే ప్రణాళికలు రచించింది. వీటన్నిటినీ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల ముందుకు తెచ్చి, ప్రభుత్వ ద్వంద వైఖరికి పాడె కట్టారు వైఎస్ జగన్. పగలు హోదా ఉద్యమం అంటూ, రాత్రి ప్యాకేజీకి సిద్ధమంటూ ప్రదర్శించే బాబూ రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఎప్పిటకప్పుడు ప్రజల ముందుచుతున్నారు. 

బహిరంగ సభల్లో ప్రజావెల్లువ

గుంటూరు జిల్లా నరసరావు పేటలో జరిగిన బహిరంగ సభలో హోదాను తాకట్టు పెట్టమని ప్రజలు చెప్పారా అంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు ప్రతిపక్షనేత. జీఎస్టీ, టిఎస్టీలాగా కాంట్రాక్టర్లకు కెఎస్టీ కట్టుకోవాల్సిన దుస్థితి రాష్ట్రానికి దాపురించిందని మండిపడ్డారు. లంచాలూ అవినీతిలో మూడంకెల అభివృద్ధిని చంద్రబాబు సాధించాడని, టిడిపి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు కేంద్రం అయ్యిందని దుయ్యబట్టారు. ఈ పరిస్థితిని మార్చేందుకు, విశ్వసనీయ పాలనను అందించేందుకు ఈ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టానంటూ అశేష జన వాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఎప్పటిలాగే యువనేత బహిరంగ సభకు పోటెత్తిన ప్రజలు, వైఎస్ జగన్ సిఎమ్ కావాలంటూ నినదించారు. చంద్రబాబును ఎప్పటికీ నమ్మమని ప్రమాణం చేసారు. హోదా కోసం వైఎస్ జగన్ జరిపే పోరులో తమ మద్దతు యువనేతకే అని తెలియజెప్పారు సత్తెన పల్లి సభలోనూ భారీగా తరలి వచ్చిన తెలుగు ప్రజలకు బాబు కుట్రలను బద్దలకొట్టాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్. అఖిలపక్షం అంటూ హోదాను నీరుగార్చేందుకు చంద్రబాబు కుతంత్రాలు చేస్తున్నాడని అన్నారు. వెన్నుపోటు చంద్రబాబును, హోదాపై పూటకో మాట మాట్లాడే ముఖ్యమంత్రిని నమ్మలేమని, ప్రజలు కూడా అఖిలపక్షాన్ని నమ్మబోరని ప్రకటించారు. పెద కూరపాడు కూడలిలోని బహరంగ సభ నేల ఈనినట్టు వచ్చిన జన ప్రవాహాన్ని చూసింది. అసెంబ్లీలో ఉన్న టిడిపి ప్రభుత్వ నేతలంతా దోపిడీ కోరులు, దొంగలే అని, ఆర్థిక నేరగాళ్లు చట్టాన్ని తప్పించుకునేందుకు, చట్టసభలను, అధికారాలను అడ్డు పెట్టుకుంటున్నారని పెదకూరపాడు బహిరంగ సభలో బాబుపై నిప్పులు చెరిగారు వైఎస్ జగన్. గజదొంగలే అసెంబ్లీని నడుపుతున్నట్టుందంటూ విమర్శించారు. 

బిసిలకు ప్రతిపక్ష నేత వరాలు

నందిగామ గుడిపూడిలో బిసిలతో ఆత్మీయ సమ్మేళజనం జరిపారు వైఎస్ జగన్. ఇస్త్రీ పెట్టెలు, కత్తెర్లు ఇవ్వడమే చంద్రబాబు ప్రేమ అన్నారు యువనేత. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బిసిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బార్బర్ షాపులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. ప్రధాన దేవాలయాల్లో క్షురకులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత ఉండేలా చూస్తామని మాటిచ్చారు. జీవనాధారమైన గొర్రె, మేక చనిపోతే 6000 పరిహారం అందిస్తామన్నారు.  బిసిలను అన్ని విధాలుగా ఆదుకకుంటామని, పేదవాడి ముఖాన చిరునవ్వును నిలుపుతామని ప్రజా సంకల్ప యాత్ర సాక్షిగా ప్రజలకు హామీ ఇచ్చారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. 

రామరాజ్యం కావాలని

శ్రీరామనవమి వేడుకలు జరిగేవేళ వైఎస్ జగన్ అడుగు పెట్టిన ప్రతి చోటా ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. వైఎస్ జగన్ తోనే రామరాజ్యం సాధ్యమని, హోదా కోసం జగన్ వదిలిన రామబాణం లక్ష్యాన్ని సాధించాలని మనసారా కోరుకుంటున్నామన్నారు గుంటూరు జిల్లా వాసులు. అడుగడుగునా ఎదురేగి హారతులు పట్టిన అక్కచెల్లెమ్మలు జగనన్న మా ఊరికి రావడంతో రెండు పండగల్లా ఉందని మురిసిపోయారు. హోదాను సాధించి తమ వేదనలు తీర్చమంటూ యువత వైఎస్ జగన్ ను కోరుకున్నారు. కలతలన్నీ తీరిపోయే రోజు దగ్గర్లోనే ఉందని, అరణ్యవాసం చేసే రాముని కోసం నిరీక్షించిన అయోధ్యవాసుల్లా వైఎస్ జగన్ సిఎమ్ అవడం కోసం ఎదురుచూస్తున్నామన్నారు అభిమానులు. 

Back to Top