పాలకొండలో పండుగ వాతావరణం

పాలకొండ (శ్రీకాకుళం జిల్లా) :

కోట దుర్గమ్మ ఉత్సవం ముందే వచ్చినట్లుగా ఉంది... తిరునాళ్లను తలపించింది... జగన్నాథ రథయాత్ర ముగిసి వారం కాకముందే జగన్నాథ రథచక్రాలు మరోసారి పురవీధుల్లో తిరుగాడినట్లైంది.. ఏజెన్సీ ముఖద్వారమైన పాలకొండలో మంగళవారం చోటుచేసుకున్న సందడి చూస్తే పైవన్నీ నిజమేనని అనిపించక మానదు. కానీ ఆ పండుగలేవీ జరగలేదు. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి తనయ‌, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల రాకతో పాలకొండలో పండుగ వాతావరణం నెలకొన్నది. శ్రీమతి షర్మిల పాదయాత్రకు, బహిరంగ సభకు తరలివచ్చిన అభిమాన జనంతో పాలకొండ నిండుకొండే అయింది. వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రభంజనంలా సాగుతున్న ప్రజాప్రస్థానం పాదయాత్ర జయజయ ధ్వానాల మధ్య పాలకొండ గజాలాఖానా వద్ద ప్రారంభమైంది. ప్రియతమ నేత ముద్దుబిడ్డ తమ గడ్డపై అడుగుపెట్టగానే పాలకొండ మురిసిపోయింది. శ్రీ జగనన్న సోదరి వెంట ప్రజానీకం వెల్లువై అడుగేసింది.

అందరికీ అభివాదం చేస్తూ, ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ ముందుకు సాగిన శ్రీమతి షర్మిల పాదయాత్రలో కోలాహలం మిన్నంటింది. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 218వ రోజు శ్రీమతి షర్మిల పాలకొండ మండలం పనుకువలస వద్ద ప్రారంభమైంది. తరలివచ్చిన అభిమానులతో ముందుకు సాగింది. తలవరం జంక్షన్‌కు చేరుకునేసరికి బారులుతీరిన ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అదే దారిలో ఆర్‌సిఎం స్కూల్ పిల్లలను‌ శ్రీమతి షర్మిల ఆత్మీయంగా ప‌లుకరించారు. బాగా చదువుకోవాలని సూచించారు. అక్కడి నుంచి అట్టలి జంక్షన్ చేరుకోగానే పెద్ద ఎత్తున మహిళలు శ్రీమతి షర్మిలను కలిసి బె‌ల్టుషాపుతో ఎదురవుతున్న ఇబ్బందులను కన్నీటితో వివరించారు. తమ గ్రామ సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని మొర పెట్టుకున్నారు.

అట్టలి జంక్షన్‌లోనే బుక్కూరు పంచాయతీకి వైయస్ఆర్‌ కాంగ్రెస్ మద్దతుతో ఏకగ్రీవ సర్పం‌చ్‌గా ఎన్నికైన పొట్నూరు లక్ష్మి తన పాలకవర్గ సభ్యులతో వచ్చి శ్రీమతి షర్మిలను కలిశారు. వారిని శ్రీమతి షర్మిల అభినందించారు. ఆ తర్వాత తుమరాడ చేరుకున్న శ్రీమతి షర్మిలను ఒక వృద్ధుడు, ఒక వికలాంగుడు, ఓ విశ్రాంత ఉద్యోగి కలిశారు. వారి భాగోగులను అడిగి తెలుసుకున్న ఆమె రానున్న రోజులు మనవే అని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి తంపటాపల్లి జంక్షన్‌కు చేరుకున్నారు. ఇక్కడ స్వయం సహాయక సంఘాల సభ్యులతో సంభాషించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. వి.పి.రాజుపేట జంక్షన్ వద్ద పొలం పనుల్లో నిమగ్నమై ఉన్న వ్యవసాయ కూలీలు తనను చూసేందుకు పరుగులెత్తుకుని వస్తుండటాన్ని చూసి ఆగారు. వారొచ్చిన తర్వాత పలకరించి ముందుకు సాగారు.

గజాలా‌ఖానా మీదుగా వెళ్తుండగా స్థానిక వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గజాలాఖానా వంతెన కుంగిపోయిన విషయాన్ని, స్థానిక అగ్నిమాపక కేంద్ర పరిస్థితిని, ఏరియా ఆసుపత్రి స్థాయి పెంపు తదితర సమస్యలపై శ్రీమతి షర్మిలకు వినతిపత్రం అందజేశారు. అనంతరం అశేష జనవాహిని మధ్య పాలకొండలోకి ప్రవేశించారు. వైయస్ఆర్ జంక్ష‌న్‌కు చేరుకుని మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అశేష జనవాహిని రాజన్న తనయ ప్రసంగానికి మంత్రముగ్ధులయ్యారు. ఆమె వాగ్ధాటి చూసి ఆశ్చర్యపోయారు. శ్రీమతి షర్మిల రాకతో పాలకొండ వీధులన్నీ జనమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో యువకులు, మహిళలు, విద్యార్థులు బారులు తీరాయి.

దారిపొడవునా శ్రీమతి షర్మిలకు నీరాజనం పట్టారు. పురవీధుల గుండా సాగిన పాదయాత్ర కోటదుర్గమ్మ ఆలయం, ఆర్టీసీ కాంప్లెక్సు మీదుగా ఏలాం జంక్షన్‌కు చేరుకుంది. మార్గమధ్యంలో మాజీ ఎమ్మెల్యే, సీనియర్ రాజకీయవేత్త, సీజీసీ సభ్యుడు పాలవలస రాజశేఖరం మాతృమూర్తి పాలవలస రుక్మిణమ్మ‌ శ్రీమతి షర్మిలను కలిసి ఆశీర్వదించారు. అనంతరం ఏలాం కూడలిలో అంబేద్కర్ విగ్రహం వద్ద మాలమహానాడు నాయకుడు బత్తిన మోహనరావు సమస్యల‌ వినతిపత్రాన్ని శ్రీమతి షర్మిలకు అందజేశారు. అక్కడి నుంచి ఆర్డీవో ఆఫీసు, కొండాపురం మీదుగా పాలకొండ నియోజకవర్గ యాత్రను పూర్తిచేసి ఆమదాలవలస నియోజకర్గంలోకి ప్రవేశించారు. బూర్జ మండలం డొంకలపర్త వద్ద శ్రీమతి షర్మిలకు అపూర్వ స్వాగతం లభించింది. అక్కడే మంగళవారం రాత్రికి బస చేశారు.

Back to Top