విద్యార్థులకో న్యాయం.. కొడుక్కి ఒక న్యాయమా

– మూడేళ్లు ఆగడం దేనికని లోకేష్‌ను అడ్డదారిన ముఖ్యమంత్రి చేశాడు
– విద్యార్థులను మాత్రం మళ్లీ కొచింగ్‌ తీసుకోమని ఉచిత సలహా
– బాధతో వస్తే కనీసం కూర్చోమనకుండా వారిపై విసుర్లు 


ఏరు దాటక ముందు ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య..., చంద్రబాబు వ్యవహారం అచ్చం అలాగే ఉంది. ఎన్నికల్లో గెలవడం కోసం అడక్కుండానే హామీలు గుప్పించిన చంద్రబాబు తీరా గెలిచాక ఇచ్చిన హామీలనే మర్చిపోయిన పరిస్థితి నెల‌కొంది. వారూ వీరూ అని లేకుండా అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనత చంద్రబాబుది. గెలిచి తీరాలన్న విజయ కాంక్షతో సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా కులాల వారీగా, వర్గాల వారీగా, ప్రాంతాల వారీగా హామీలు గుప్పించి ఓట్లు దండుకున్నాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చమని ఇప్పుడు ప్రజలు నిలదీస్తుంటే ఆశకైనా హద్దుండాలని ఒక సారి.. ఆల్రెడీ చేసేశామని ఒకసారి.. అప్పుల్లో ఉన్నామని మరోసారి.. కమిటీలు వేశాం పరిశీలిస్తున్నామని ఇంకోసారి..., ఇలా రోజుకో మాటతో మభ పెట్టడమే తప్ప జనాలకు చేకూర్చిన ప్రయోజనం ఇసుమంత కూడా లేదు. 

అల్లాడిపోతున్న ఫాతిమా కాలేజీ విద్యార్థులు
చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థులు అల్లాడిపోతున్నారు. యాజమాన్యం చేసిన మోసాన్ని వివరించి న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కలిస్తే రోజుకో మాటతో కాలక్షేపం చేస్తున్నారు తప్పించి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. తమ నాలుగేళ్ల విద్యా సంవత్సరం వృథా అయ్యిందని కొందరు.. ఇప్పటికే నీట్‌లో ర్యాంకులొచ్చాయని అడ్మిషన్లు రద్దు చేస్తే చదివిన చదువంతా ఏమైపోవాలని విద్యార్థులు కోర్టుల చుట్టూ తల్లిదండ్రులను వెంటబెట్టుకుని పోరాడుతున్నారు. న్యాయం చేయాలని ఢిల్లీలో దీక్షలు చేశారు. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు మొరపెట్టుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, వైద్యారోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కలిసినప్పుడు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు తర్వాత ఆ సంగతే వదిలేశారు. 

న్యాయం చేశామని నంద్యాల్లో  అసత్య ప్రకటన
అవసరమైనప్పుడు అలవోకగా అబద్ధాలు చెప్పడం బాబు చేతనైనంతగా ఎవరికీ తెలియదనడంలో అతిశయోక్తి కాదు. ఇటీవల ముగిసిన నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఫాతిమా కాలేజీ విద్యార్థులు తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రిని కలిశారు. అందుకు ఆయన సుముఖుత వ్యక్తం చేశారు. అయితే విద్యార్థులకు చేసిందేం లేదు కానీ బహిరంగ సభలో మాత్రం అన్నీ చేసేశానని తప్పుడు ప్రచారం చేసుకున్నారు. ఓట్ల కోసం విద్యార్థుల కష్టాన్ని కూడా ఎరగా వేసి లాభం పొందాడు. 

జననేతను కలవడంతో బాబులో కలవరం
తమ సీటు కోసం ఎన్నాళ్లుగానో న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థులు చివరికి ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఫాతింమా కాలేజీ యాజమాన్యంతో కుమ్మక్కై తమకు అన్యాయం చేసిందని బావురు మన్నారు. విద్యార్థులకు వ్యతిరేకంగా కాలేజీ యాజమాన్యంతో చంద్రబాబు లాలూచీ పడ్డారని మీరైనా మా పక్షాన నిలవాలని ప్రతిపక్ష నేతను వేడుకున్నారు. చలించిన వైయస్‌ జగన్‌ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారి తరఫున మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల దీక్షలకు సహకరించాలని పార్టీ నాయకులకు ఆదేశాలిచ్చారు. స్వయంగా ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు. విద్యార్థుల సమస్యలను ప్రస్తావిçస్తూ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి కూడా కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ను కలిసి 100 మంది విద్యార్థులను సమస్యలను వివరించారు. వారికి న్యాయం చేసేలా రీలొకేట్‌ చేయాలని లేఖ ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల తరఫున అభ్యర్థించారు. 
విద్యార్థులపై ఆగ్రహం 
తమ సమస్యలను విన్నవిస్తూ న్యాయం చేయాలని కోరిన విద్యార్థులపై చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో సెల్‌టవర్‌ ఎక్కిన విద్యార్థులతో మాట్లాడతామని పిలిపించి వారి మీద కారాలు మిరియాలు నూరారు. ప్రతిపక్ష నాయకుడిని కలిశారనే అక్కసుతో వారిని కనీసం కూర్చోమని కూడా చెప్పకుండా నిలబెట్టే కడిగేశారు. మంత్రులు, ఇతర నాయకుల సమక్షంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు తన కాళ్లు బార్లా చాపి నిస్సహాయంగా ఉన్న విద్యార్థులపై రుసరుసలాడిపోయారు. సమస్యలు చెప్పుకునేదానికొస్తే నిలబెట్టి తిట్టారని బయటకొచ్చిన విద్యార్థులు బోరుమన్నారు. 
కోచింగ్‌కు వెళ్లాలని ఉచిత సలహా
తమను కలిసేందుకు వచ్చిన విద్యార్థులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండా చంద్రబాబు ఉచిత సలహా ఇచ్చి మెడికోలను తిట్టి బయటకు పంపారు. ధర్నాలు చేస్తే కోల్పోయిన సీట్లు రావని, ఇలాంటి ధర్నాలు, ఆందోళనలను తాను చాలా చూశానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్నది తాము అని, ఎవరిలో కలిస్తే వాళ్లు మీకు సీట్లు ఇప్పించలేరని చంద్రబాబు అన్నట్లు విద్యార్థులు తెలిపారు. తమకు సీట్ల విషయంలో సీఎం ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని వాపోయారు. ఇప్పటికైనా ధర్నాలు చేయడం, టవర్లు ఎక్కడం, ప్రతిపక్ష నేతలను కలవడం వంటివి మానుకోవాలని చంద్రబాబు హితబోధ చేశారు. ఈ నెల 29న ఢిల్లీకి వెళ్తున్నామని, విద్యార్థుల్లో ఐదుగురు కమిటీగా ఏర్పడి వస్తే వారిని కూడా తీసుకెళ్తామని అన్నారు. అయితే, ఈ ఏడాది (2017–18) నీట్‌లో అర్హత పొందిన విద్యార్థులకైనా సీట్లు ఇస్తారా? అని అడగ్గా ఈ ఏడాది సాధ్యం కాకపోవచ్చని చెప్పారు. కావాలంటే లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌కు వెళ్లాలని, అందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తుందని ఉచిత సలహా ఇచ్చారు. కోచింగ్‌ కోసం డబ్బులిచ్చి చేతులు దులిపేసుకోవాలని చూసే చంద్రబాబు అంతకంటే విలువైన సమయం గురించి మరిచిపోవడం దారుణం.  కొడుకు నారా లోకేష్‌ని మంత్రిని చేసేందుకు వీలు కాలేదని చంద్రబాబు ఊరుకోలేదుగా.. ఎమ్మెల్సీగా చేసేసి అడ్డదారిలో మంత్రిని చేశాడు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే మరో మూడేళ్లు ఆగాలని.. గెలుస్తాడో లేదోనని భయంతో అడ్డదారిలో కొడుక్కి మంత్రి పదవి కట్టబెట్టిన చంద్రబాబు విద్యార్థుల విషయానికొచ్చేసరికి డబ్బుకు విలువనిచ్చి మాట్లాడటం ముఖ్యమంత్రికి తగదు. 

తాజా వీడియోలు

Back to Top