రైతుల‌కు ప‌న్నుపోటు

–రూ.50 వేలకు మించిన లావాదేవీలపై పన్నా...?
– నగదు రహిత లావాదేవీల అమలు కమిటీ సిఫార్సుపై రైతులు ఆగ్రహం
– చంద్రబాబు నేతృత్వంలో  రూపొందించిన మధ్యంతర నివేదికలపై అభ్యంతరాలు
 
విజయవాడ: 
మూలుగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ఉంది నగదు రహిత లావాదేవీల అమలు కమిటీ సిఫార్సులు. అసలే పెద్ద నోట్లు రద్దు చేయడంతో కుదేలైన వ్యవసాయ రంగం..కొత్తగా తీసుకోనున్న నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. నగదు లావాదేవీలు రూ.50 వేలు మించితే పన్ను విధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో రూపొందించిన నగదు రహిత లావాదేవీల అమలు కమిటీ సిఫార్సుపై రైతులు మండిపడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో నానా అగచాట్లు పడిన తమకు ఈ పన్ను విధానం అమల్లోకి తీసుకొస్తే గుదిబండ కాగలదని ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులకు ఇచ్చినట్టే గరిష్ట పరిమితిపై వెసులుబాటును ఇవ్వాలని రైతుసంఘాలు అభిప్రాయపడుతున్నాయి.  బ్యాంకుల్లో రూ.50 వేలు, ఆ పైబడి నగదు ఉపసంహరించుకున్నా, లేక అంతే మొత్తంలో లావాదేవీ జరిపినా ‘బ్యాంకింగ్‌ క్యాష్‌ ట్రాన్సాక్షన్‌ టాక్స్‌’ (బీసీటీటీ) విధించాలన్న సిఫార్సుల దస్త్రం ఇప్పుడు కేంద్రం ఎదుట ఉంది. త్వరలో దీనిపై నిర్ణయం వెలువడనుంది. చంద్రబాబునాయుడు కన్వీనరుగా గల నగదు రహిత లావాదేవీల అమలు కమిటీ సిఫార్సుల ఫలితమిది. జనవరి 24వ తేదీన నీతి అయోగ్‌లో ఈ కమిటీ సమావేశమై, పలు సిఫార్సులతో మధ్యంతర నివేదికను రూపొందించి, ప్రధానమంత్రి మోదీకి సమర్పించింది.

అసలే మద్దతు ధర లేక..
వరుస రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బోరు బావుల కింద అష్టకష్టాలు పడి పంట పండించుకున్నా..ధాన్యానికి మద్దతు ధర కరువైంది. సేద్యం గిట్టుబాటు కాని పరిస్థితుల్లో రైతులు అవస్థలు పడుతున్నారు. పెట్టుబడుల భారం అధికం కావటం, మార్కెట్లో ధరల మాయాజాలం, తగినంత ‘మద్దతు’ లేకపోవటం కారణాలని తెలిసిందే. పెద్ద నోట్ల రద్దుతో రైతులు అగచాట్లు పడ్డారు. వరిపైరు కోతల సమయంలో చేసిన ప్రకటన రైతులను అయోమయంలో ముంచింది. పొలాల్లో ఉండాల్సి రైతులు బ్యాంకుల ఎదుట క్యూలల్లో నిలబడ్డారు. వారానికి రూ.24 వేల చెల్లించినా, సమస్యలు తీరలేదు. కోతలు, నూర్పిళ్లును వాయిదా వేసుకొన్నారు. తుఫాన్‌ అదృష్టవశాత్తు తప్పిపోయింది.

డబ్బుకైతే ఓ రేటు..చెక్కులకైతే మరోరేటు
పెద్ద నోట్ల రద్దుతో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ధాన్యం అమ్ముకోవాలంటే వ్యాపారులు రకరకాలుగా చెల్లింపులు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు డబ్బుకైతే ఓ రేటు ఇస్తున్నారు, చెక్కులకైతే మరో రేటు ఇస్తున్నారు. అలాగే కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు, దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంటరుణాలు, బంగారంపై రుణాలకు 0.5–1 శాతం ప్రాసెసింగ్‌/ సర్వీసు ఛార్జీలను బ్యాంకులు వసూలుచేస్తున్నాయి.  సొసైటీల్లో పంటరుణాలు తీసుకొంటే ప్రాసెసింగ్‌/ ఇనస్పెక్షన్‌ ఛార్జీలతో పాటు రిజిస్ట్రేషను కార్యాలయంలో తనఖా రిజిస్టరు చేయిస్తారు. కాపిటల్‌ షేరు ధనం పేరుతో మరికొంత వసూలు మామూలే. తాకట్టు విడిపించంకోవటానికి మళ్లీ రూ.1500, దస్తావేజు రాసిన వ్యక్తికి చెల్లింపులు అనివార్యమని రైతులు గుర్తుచేస్తున్నారు. కొన్ని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లపై  ఏడాదిగా క్యాష్‌ హ్యాండ్లింగ్‌ ఛార్జీలను వసూలుచేస్తున్నారు. రైతులకు రూ.50 వేల లావాదేవీలంటే స్వల్పం కిందే లెక్క. కౌలు చెల్లించాలన్నా, ఎరువులు, పురుగుమందుల కొనుగోలుకు, కూలీలకు, మార్కెట్‌కు పంట చేరవేతకు ఎక్కువగా డబ్బుతోనే లావాదేవీలుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగదు రహిత లావాదేవీల అమలు కమిటీ సిఫార్సులు రైతులను నివ్వెరపోయేలా చేశాయి. 
కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచించాలి.
Back to Top