ప్రభుత్వ నిర్లక్ష్యం..రైతన్నను కాటేసిన కరువు

()ఏపీలో తీవ్ర వర్షాభావం...ఎండుతున్న పైర్లు
()రెయిన్‌గన్ల జపం చేస్తున్న టీడీపీ సర్కార్‌
()ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సురెన్స్‌ ఎగ్గొట్టేందుకు కుట్ర
()అసెంబ్లీ సమావేశాల్లో పోరుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షం
()అన్నదాతలకు అండగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తుండడంతో  రైతున్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కళ్లముందే పంటలు ఎండిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.  ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుండడంతో రైతన్నకు కన్నీరే మిగిలింది. నెల రోజుల కింద పచ్చదనంతో కళకళలాడిన పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితులను చూసి తట్టుకోలేక రైతులు పొలాలను తగులబెడుతున్నారు. ఏకంగా 303 మండలాల్లో వర్షాభావం నెలకొంది.  సకాలంలో వర్షాలు కురియకపోవడంతో పైర్లన్నీ ఎండిపోతున్నాయి. ఇప్పటికే సగానికి పైగా పంటలు చేతికందకుండా పోయాయి. మరో 10 రోజుల పాటు వర్షం కురవకపోతే ఉన్న కొద్దిపాటి పంటలు కూడా చేతికందడం కష్టంగా మారింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు కృష్ణా, గోదావరి డెల్టాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.  ఇప్పటికే లక్షలాది ఎకరాల్లో పంటలు వాడుముఖం పట్టాయి. పురాతన ఆయకట్టు అయిన కృష్ణాడెల్టాలో ఆయకట్టుకు నీరందకపోవడంతో వరిపైరు ఎండిపోయింది. రాయలసీమలో వందలాది హెక్టార్లలో వేరుశనగ పంట ఎండిపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కిరాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ పంటనంతా వర్షాభావం కాటేయడంతో రైతన్నకు కన్నీళ్లే మిగులుతున్నాయి. 

ఎండుతున్న పంటలు
రాష్ట్రంలోని 70 లక్షల ఎకరాల్లో ఇప్పటికే పంటలు సాగయ్యాయి. 8.77 లక్షల హెక్టార్లలో వరి పడింది. మరికొన్ని జిల్లాల్లో వరి నారుమళ్లు పోశారు. ఆగస్టులో ఒక్క తడి తగిలితే పరవశంతో పంట ఊగుతుంది. ఇలాంటి కీలక సమయంలో వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే కొన్ని చోట్ల వరి నారుమళ్లు ఎండుముఖం పట్టాయి. కంది, మినుము, పెసర వంటి పప్పుధాన్యాలకు ధర అధికంగా ఉండటంతో రైతులు ఆ పంటలను అధికంగా సాగు చేశారు. రాష్ట్రంలో 20.83 లక్షల హెక్టార్లలో ఆహార ధాన్యాలు సాగవుతుండగా, ఇప్పటికే 13.32 లక్షల హెక్టార్లలో పంట పడింది. మే, జూన్‌ వానలు ఇచ్చిన భరోసాతో పంట వేసిన రైతులు పూత, పిందె మీద ఉన్న పైర్లు వాడిపోవడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో జొన్న, సజ్జ, రాగి వంటి చిరుధాన్యాల పంటలూ ఎండిపోయాయి. రైతులు వాటిని పూర్తిగా కోసేసి పశువుల మేతగా ఉపయోగిస్తున్నారు. ఇక నూనెగింజలదీ ఇదే పరిస్ధితి కనిపిస్తోంది. రాష్ట్రంలో 3.75 లక్షల హెక్టార్లలో రైతులు పత్తి సాగు చేశారు. గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఈ పంట అధికంగా సాగయింది. ప్రస్తుతం పత్తి 40 నుంచి 50 రోజుల దశలో ఉంది. కాయ, పూత దశలో ఉన్న పంటని ఎలా కాపాడుకోవాలో తెలియక అన్నదాత ఆవేదన చెందుతున్నాడు. ముఖ్యంగా పత్తికి దిగుబడి దిగులు పట్టేసింది. ఒక్క వర్షం పడితే పైర్లు తెప్పరిల్లుకుంటాయన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. 

ఇన్ పుట్ సబ్సిడీ ఎగ్గొట్టేందుకే ఈ ఎత్తుగడ
వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు సాగుచేసిన పంటలన్నీ ఎండిపోయాక ప్రభుత్వం రెయిన్ గన్ లను తీసుకొచ్చి పంటలను బతికించామని గొప్పలు చెప్పుకోవడం దారుణం. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం రెయిన్ గన్ లను తీసుకొచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రభుత్వం జిల్లాకు వంద, రెండు వందల రెయిన్‌గన్ల ఇచ్చి చేతులు దులుపుకోంది. అనంతపురం జిల్లాలో ఈ ఖరీఫ్‌లో దాదాపు 50 వేల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేశారు. ఇందులో దాదాపు 40 వేల హెక్టార్లలో పంట ఎండిపోయింది. ప్రభుత్వం మాత్రం 200 రెయిన్‌గన్లను పంపిణీ చేసి రైతులను ఆదుకున్నామని గొప్పులు చెబుతోంది. ఒక్కో రెయిన్‌గన్‌తో నిరంతరాయంగా ఏడు గంటల పాటు రెండు ఎకరాల పొలాన్ని తడపవచ్చు. ఈ లెక్కన 50 వేల హెక్టార్ల పంటను ఎప్పటిలోగా తడపాలో అర్థంకాని పరిస్థితి. ఈ రెయిన్‌గన్ల వ్యవస్థ దాదాపు 12 ఏళ్ల నుంచి అందుబాటులో ఉండగా..తానే కనిపెట్టినట్లు చంద్రబాబు ప్రగల్భాలు పలుకుతున్నారు. సాధారణంగా వేరుశనగ పంటను తడపాలంటే 10 నుంచి 15 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరం. ఈ రెయిన్‌గన్లతో నీరు పెడితే కేవలం 5 మిల్లీ మీటర్లే తడుస్తోంది. ఈ లెక్కన పైరు పచ్చబడిన దిగుబడులు ఆశించిన స్థాయిలో వచ్చే అవకాశం లేదు.

 వర్షాలు పడుతాయన్న ఆశతో అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టిన అన్నదాత మరింత అప్పుల ఊబిలో చిక్కుకునిపోతున్నాడు. ఓ వైపు రుణాలు మాఫీ గాక, మరోవైపు పంటలు ఎండిపోవడంతో చేసిన అప్పులు తీర్చేదారిలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏపీలో జూన్‌ నుంచి ఇప్పటి వరకు 72 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి కరువు పరిస్థితులు ఎప్పుడు చూడలేదని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వానికి ముందు చూపు కొరవడడం వల్లే రైతులకు ఈదుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  కరువు వచ్చినప్పుడు పంటపొలాల్లోకి వెళ్లి పరిశీలించాల్సిన ముఖ్యమంత్రి హెలికాప్టర్లలో ఏరియల్ సర్వే చేయడం విడ్డూరమని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం కరువుపై దుమ్మెత్తిపోస్తుందనే  చంద్రబాబు ఇటీవల కడప, అనంతపురం జిల్లాల్లో ఏరియల్ సర్వే పేరుతో హెలికాప్టర్ లో చక్కర్లు కొట్టారని పలువురు విమర్శిస్తున్నారు.   

ఎకరాకు రూ.10 వేల పరిహారం చెల్లించాలి
కరువు కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఈ నెల 3న కడప కలెక్టరేట్‌ ఎదుట రైతు మహాధర్నా చేపట్టారు. కరువును నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు. ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదని, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించడంలో సర్కార్‌ విఫలమైందని మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం, శ్రీశైలం ప్రాజెక్టులో 150 టీఎంసీల నీరు ఉన్నా..రాయలసీమకు అందించడంలో చంద్రబాబు పక్షపాత వైఖరి చూపారు. పుష్కరాలు, విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో శ్రీశైలం నుంచి దిగువకు నీటిని వదిలిన టీడీపీ సర్కార్‌ ఆయకట్టును విస్మరించింది. కరువు కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వైయస్‌ఆర్‌సీపీ డిమాండ్‌ చేస్తొంది. ఇదే అంశంపై ఈ నెల 8 నుంచి జరుగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ పోరాడనుంది. 
Back to Top