సాగు సాగదు.. రైతు చింత తీరదు

రాజధాని ప్రాంతంలో కనుమరుగవనున్న వ్యవసాయం
ఈ రబీకి మాత్రమే అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం
29 గ్రామాల్లోని 34 వేల ఎకరాల్లో ఇవే చివరి పంటలు
 
హైదరాబాద్: కృష్ణా నదీ పరివాహక రైతుల నెత్తిపై పిడుగులాంటి వార్త.. రాజధాని ఏర్పాటు చేయనున్న 3 మండలాల్లో ఇక ఇవే చివరి పంటలు అని ప్రభుత్వం స్పష్టం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఏళ్లుగా సాగునే నమ్ముకుని.. తమ శ్రమతో సిరులు పండిస్తున్నరైతులకు ఈ ప్రకటనతో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ఏడాదికి మూడు పంటలు పండే ఈ భూముల్లో ఇకపై సాగుకు అనుమతించవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తరాతరాలుగా సాగునే నమ్ముకుని జీవిస్తున్న వేలాది మంది రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రాజధాని ప్రాంతంలో ఈ రబీ సీజన్ వరకే పంటలు పండించడానికి అనుమతి ఉందని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ బుధవారం ప్రకటించడంతో 29 గ్రామాల్లోని రైతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో భూసేకరణ సంక్లిష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ప్రక్రియ కొలిక్కి రాకముందే ప్రభుత్వం ఇలాంటి ప్రకటన చేయడం రైతులను విస్మయానికి గురిచేసింది. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం 29 గ్రామాలను గుర్తించింది. ఇక్కడ ఉన్న పట్టా, అసైన్డ్, పోరంబోకు, దేవాదాయ, అటవీ భూములన్నీ కలిపి 51,788 ఉన్నట్లుగా అప్పట్లో నివేదికలు సిద్ధం చేసింది. వీటిలో రైతులు సాగుచేస్తున్న భూములు 41,750 ఎకరాలు. ఈ గ్రామాల్లో 34 వేల ఎకరాల భూములను సేకరించేందుకు ప్రభత్వుం ఈ నెల 2 నుంచి విడతల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేసింది.

రైతుల పరిస్థితి దయనీయం
ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసిన తరువాత ఆ భూముల్లో పంటలు వేసుకునే వీలు ఉండదు. దీంతో ఆయా భూముల్లో పంటలు వేసుకునేందుకు బ్యాంకుల నుంచి ఎలాంటి రుణాలు అందకుండా పోయాయి. ఈ ప్రాంతంలోని రైతులకు రుణాలు మంజూరు చేయకూడదని ప్రభుత్వం ఇప్పటికే మౌఖికంగా తెలియజేసింది. భూసేకరణ చేయనున్న 29 గ్రామాల్లో ప్రతి రైతు ఏటా 3 పంటలు పండిస్తున్నాడు. అరటి, పసుపు, కంద, మొక్కజొన్న, అన్ని రకాల పూలతోటలు, కూరగాయలు పండిస్తున్నారు. మార్కెట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉండటంతో నికరంగా లాభం కూడా ఆర్జిస్తున్నారు.  అరటి, పసుపు, కంద సాగుతో పంటకు రూ.90 వేలు సంపాదిస్తున్నారు. కేవలం కౌలు రేట్లే ఏడాదికి ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేల దాకా ఆదాయం వస్తున్నట్లు అంచనా. అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడున్న 12 వేల మంది కౌలు రైతులు జరీబు భూముల్ని సాగుచేసి నికర లాభాన్ని పొందుతున్నారు.
 
పరిహారం ఊసెత్తని ప్రభుత్వం
రాజధాని నిర్మాణానికి భూములిచ్చే రైతులకు పరిహారంగా ఎకరాకు మెట్టభూములైతే రూ.30 వేలు, జరీబు భూములకు రూ.50 వేలు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అదీ పదేళ్లపాటు మాత్రమే. మధ్యలో అభివృద్ధి చేసిన భూముల్ని అమ్మితే దాంట్లో పరిహారం ఇవ్వరు. ఇక్కడ పరిహారం ఎప్పుడు ఇస్తారన్నదానిపై స్పష్టత లేదు. తాజాగా చేసిన ప్రకటనలోనూ పంటల సాగుచేయవద్దని చెప్పారు కానీ, పరిహారం విషయం ప్రస్తావించకపోవడం గమనార్హం. తాము పంటలు సాగుచేస్తే వస్తున్న ఆదాయంలో ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏమూలకు సరిపోతుంది అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఇకపై రాజధాని ప్రాంతంలో పంటలకు అనుమతి లేదు
సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్

విజయవాడ: రాజధాని ప్రాంతంలో పంటల సాగుకు ఈ రబీ సీజన్ చివరి అవకాశమని, ఇకపై ఆ భూముల్లో పంటల సాగుకు ప్రభుత్వం అనుమతించదని సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్ స్పష్టం చేశారు. కృష్ణానది కరకట్ట లోపలి భూములు కూడా భూసేకరణ పరిధిలో ఉన్నాయని, వాటి సర్వే నంబర్లతో నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. సింగపూర్‌లో జరిపిన ఆరురోజుల పర్యటన వివరాలను ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. భూ సేకరణకు రైతులు అనుకూలంగానే ఉన్నారని, ఈ నెలాఖరు కల్లా 10 వేల ఎకరాల భూమిని సేకరిస్తామన్నారు. కృష్ణా కరకట్ట లోపల ఉన్న భూములపై గుంటూరు కలెక్టర్ నివేదిక తయారు చేస్తున్నారని, వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సింగపూర్ పర్యటన తరువాత రాజధాని నిర్మాణం స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. ఒక మహా నగరాన్ని నిర్మించాలంటే ప్రభుత్వ విధానం, ప్రణాళిక పక్కాగా ఉండాలన్నారు. ఉన్న వనరులతో మౌలిక సదుపాయాల కల్పన తెలిసి ఉండాలన్నారు. సింగపూర్ పర్యటనతో ఈ విషయాలన్నింటిపైనా అవగాహన వచ్చిందని వివరించారు. రాజధాని నిర్మాణం ప్రాంతంలో 81 శాతం వ్యవసాయ భూములే ఉన్నాయని వాటిని పరిరక్షిస్తూ రాజధానిని నిర్మించాలని చెప్పారు. ‘‘రాజధాని నగరం నాలుగు భాగాలు ఉంటుంది. ఒకభాగంలో నివాస ప్రాంతాలు, మరో ప్రాంతంలో పనిచేసే ప్రాంతాలు, మూడో ప్రాంతంలో పార్కులు, రిక్రియేషన్ సెంటర్లు, నాలుగో ప్రాంతంలో విద్యాకేంద్రాలు ఉంటాయని తెలిపారు. నగరం ఎక్కువ భాగం అడ్డంగా ఎత్తై భవనాలతో ఉంటుందన్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు మెట్రో రైలు ఏర్పాటు చేసి, ప్రైవేటు వాహనాలు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాజధాని రీజియన్‌లోని కృష్ణా, గుంటూరు, తెనాలి ఇతర నగరాల్లో ఆకాశహర్మ్యాలను నిర్మించే విషయంపై చర్చలు జరిపామన్నారు. సీఆర్‌డీఏ స్వరూపం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి..? అన్న విషయాలపై చర్చించేందుకు సింగపూర్ నుంచి వచ్చే నెల 2 నుంచి 4 వరకు ఇద్దరు సీనియర్ అధికారులు రాష్ట్రంలో పర్యటించనున్నారని వెల్లడించారు.

Back to Top