భూముల్ని వెనక్కు తీసుకొనే ఆలోచనలో రైతులు

రాజధాని నిర్మాణం పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సహచర మంత్రులు నడుపుతున్న మంత్రాంగం ఆ ప్రాంత రైతులను తీవ్ర గందరగోళ పరుస్తున్నది. ఇప్పటికే భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలను ఇచ్చిన రైతులు పునరాలోచనలో పడినట్లు వార్తలొస్తున్నాయి. ఎందుకంటే మొదటినుంచీ భూ సమీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు నడిపిన మంగళగిరి, తాడేపల్లి రైతులకు పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయి. భూములు ఇచ్చిన తుళ్లూరు రైతులకు పరిస్థితి ప్రతికూలంగా మారింది. భూములు ఇచ్చేందుకు అంగీకార పత్రాలను ఇచ్చిన తుళ్లూరు రైతుల పొలాల్లో సాగును ప్రభుత్వం నిషేధించింది. దీంతో వారు రబీలో సాగు చేసుకునేందుకు వీల్లేకుండా పోయింది. అభ్యంతర పత్రాలను ఇచ్చిన తాడేపల్లి, మంగళగిరి రైతులకు మాత్రం సాగుకు అనుమతి లభించడంతో వారు రబీ పనుల్లో నిమగ్నమయ్యారు. అంతేకాదు ప్రభుత్వం మాటపై నిలబడుతుందా... తమకు ఎప్పటికి భూమి వస్తుంది.... దాని ధర ఎంత ఉండే అవకాశముంది... అప్పటికి అసలు పరిస్థితులు ఎలా ఉంటాయో... వంటి సందేహాలు రైతులను వేధిస్తున్నాయి...
  • ముఖ్యమంత్రి, మంత్రులు ఇచ్చిన హామీలు నెరవేరే సూచనలు కనిపించకపోవడం, రాజధాని నిర్మాణం ప్రారంభం కాకుండానే ప్రభుత్వం తమ భూముల అమ్మకాలు, లీజులు ప్రారంభిస్తుందేమోనన్న ఆందోళనతో భూములిచ్చిన రైతులు పునరాలోచనలో పడ్డారు.
  • అందుకే చాలామంది రైతులు అంగీకార పత్రాలను ఉపసంహరించుకునే అవకాశాల కోసం న్యాయవాదులను సంప్రదిస్తున్నారు.
  • చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తిగా జరిగితే ప్రభుత్వం ఇవ్వనున్న 1000 గజాల స్థలానికి (చదరపు గజం రు.30 వేల చొప్పున) రు.3 కోట్లు వస్తాయనుకున్నా ఇప్పటి పరిస్థితులు అందుకు సానుకూలంగా లేవనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
  • ఎకరా భూమికి ప్రభుత్వం ఇవ్వనున్న 1,000 చదరపు గజాల స్థలానికి ఎన్నేళ్లకు మంచి ధర వస్తుందో, అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయోనని రైతులు తర్జనభర్జనలు పడుతున్నారు.
  • కేంద్రం నుంచి సహకారం పూర్తిగా లేకపోవడంతో రాజధాని నిర్మాణం మూడేళ్లలో పూర్తి కాదనే సందేహమూ వారిని వెన్నాడుతోంది.
  • చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు రైతుల్లో సందేహాలను పెంచుతున్నాయి. తాత్కాలిక రాజధాని నిర్మాణానికి ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి సమీకరిస్తున్న భూమికి గాను ఎకరాకు ఎకరా ఇస్తూ నిర్ణయం తీసుకుంది.
  • తమకు మ్రాతం ఎకరాకు 1,000 చదరపు గజాల స్థలం మాత్రమే ఇవ్వడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
  • ఇంకోవైపు ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించలేక తాము ఇచ్చిన భూములు విక్రయించే దిశగా చర్యలు తీసుకుంటుందేమోనన్న అనుమానాలు రైతులను వెంటాడుతున్నాయి.
  • ఈ పరిస్థితుల్లోనే అంగీకార పత్రాలు వెనక్తి తీసుకునే దిశగా రైతులు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు.
Back to Top