నాసిరకం వస్త్రాల పంపిణీపై ఆగ్రహం..!చీర,ధోవతులను తిరస్కరించిన రైతులు..!
తుళ్లూరుః రాజధాని ప్రాంతంలో రైతుల పట్ల పచ్చప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో బలవంతంగా భూములు లాక్కోవడం మొదలు వారిని ప్రతిసారీ చంద్రబాబు నయవంచనకు గురిచేస్తూనే ఉన్నాడు. తాజాగా శంకుస్థాన కార్యక్రమం పేరుతో మరోసారి రైతులను మోసం చేసి అవమానపర్చాడు. అమరావతి నిర్మాణానికి పంటభూములిచ్చిన రైతులకు చీర, ధోవతులు అందించే విషయంలో అపహాస్యం పాలు చేశారు.
పనికిరాని వస్త్రాలిచ్చి అవమానం..!తెలుగుతమ్ముళ్లు పంచిన నాణ్యతలేని చీర, ధోవతులు చూసి రైతులు ఖంగుతిన్నారు. వడియాలు కూడా పెట్టుకోవడానికి పనికిరాని దుస్తులు ఇచ్చి అవమానపర్చారంటూ తుళ్లూరు మండల రైతులు అసహనం వ్యక్తం చేశారు. రూ.300, రూ.500 కూడా విలువ చేయని చీర,ధోవతలు తీసుకొచ్చి మంత్రులు రూ. 2 వేల రూపాయలుగా ప్రచారం చేయడంపై మండిపడుతున్నారు. అనంతవరం, అబ్బురాజుపాలెం. బోరుపాలెం, రాయపూడి తదితర గ్రామాల్లో అధికారులు పంచిన నాసిరకం వస్త్రాలను రైతులు సీఆర్డీఏ అధికారులకు తిరిగి ఇచ్చేశారు.
అన్నదాత కన్నెర్ర..!అంతేకాదు మొక్కుబడిగా తొలి రెండ్రోజుల పాటు వస్త్రాలతో పాటు స్వీట్ బాక్స్ ఇచ్చి ఆతర్వాత విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటితో పాటు మొదట్లో ఆహ్వాన పత్రికల్లో రెండు పాసులు పెట్టిన పచ్చనేతలు, ఇప్పుడు ఒకే పాస్ ఇవ్వడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . వీఐపీల మోజులో చంద్రబాబు రైతులను కించపరుస్తున్నారంటూ అన్నదాతలు నిప్పులు చెరుగుతున్నారు. వంటకాల విషయంలోనూ చంద్రబాబు రైతులను చిన్నచూపు చూస్తున్నాడు. వీఐపీల కోసం ఒక్కో భోజనానికి వేలల్లో ఖర్చు చేస్తూ రైతులకు రూ.100,150లతో సరిపుచ్చేందుకు సిద్ధమయ్యాడు.