రాజ‌ధాని లో తిర‌గ‌బ‌డ్డ తెలుగుబిడ్డ‌

() ప్ర‌భుత్వం పై తిర‌గ‌బ‌డుతున్న రైతులు
() ప్ర‌భుత్వ తీరుపై నిర‌స‌న‌లు
() మంత్రికి అస‌మ్మ‌తి తెలిపిన రైతులు
() స‌ర్వేల‌పై ఆందోళ‌న‌
అమ‌రావతి) రాజ‌ధాని ప్రాంత రైతుల్లో ఆందోళ‌న అంత‌కంత‌కూ పెరుగుతోంది. ముఖ్యంగా ప్లాట్లు విష‌యంపై ప్ర‌భుత్వం ఆడుతున్న దొంగాట‌కు నిర‌స‌న వెల్లువెత్తుతోంది. ప్లాట్ల సంగ‌తి తేల్చాల్సిందేనంటూ ప‌ట్టు బ‌డుతున్నారు. 
న‌మ్మించి ద్రోహం చేయ‌టం
రైతుల నుంచి పొలాలు లాక్కొనేట‌ప్పుడు మంత్రులు, టీడీపీనాయ‌కులు చాలా మాయ మాట‌లు చెప్పారు. అర‌చేతిలో స్వ‌ర్గాన్ని చూపించారు. భూములు ఇచ్చిన రైతుల‌కు కోరుకొన్న చోట ప్లాట్లు ఇస్తామ‌ని, దీంతో రాజ‌ధానిని ఆనుకొని కోట్ల రూపాయిల సంప‌ద సొంతం అవుతుంద‌ని న‌మ్మ‌బ‌లికారు. దీన్ని న‌మ్మిన రైతులు గుడ్డిగా పొలాల్ని క‌ట్ట‌బెట్టారు. దాదాపు రెండు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నా ప్లాట్ల సంగ‌తి తేల్చ‌టం లేదు. ఒక‌వైపు టీడీపీ నేత‌ల రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగుతోంది. కానీ రైతుల ప‌ర‌స్థితి అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క మాదిరిగా మారింది.
మంత్రుల‌కే సెగ‌లు
తాజాగా గురువారం జ‌రిగిన సీఆర్డీఏ అవ‌గాహ‌న స‌ద‌స్సుకి వ్య‌వ‌సాయ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు హాజ‌ర‌య్యారు. ప్లాట్ల సంగ‌తి ఏమిట‌ని రైతులు ప్ర‌శ్నించేస‌రికి ఆయ‌న నీళ్లు న‌మిలారు. భూములు లాక్కొన్నాక ప్ర‌భుత్వ అధికారులు ఏమాత్రం స‌రిగ్గా స్పందించ‌టం లేద‌ని నిల‌దీశారు. ఇది న‌మ్మించి ద్రోహం చేయ‌టమే అని తేల్చి చెప్పారు. మ‌రో మంత్రి నారాయ‌ణ రాజ‌ధాని విష‌యంలో ప్రెస్ మీట్లు పెట్ట‌డం త‌ప్ప ఆ ప్రాంతానికి వెళ్ల‌టం మానుకొన్నారు. 
స‌ర్వే మాయాజాలం
 భూసమీకరణకు భూములు ఇవ్వని రైతులను భ‌య‌పెట్టేందుకు స‌ర్వేయ‌ర్ల‌ను రంగంలోకి దింపారు.  కొత్తగా మళ్లీ ప్రైవేటు సర్వేయర్లను ఏర్పాటు చేసి సర్వే చేయించి కర్రలు పాతారు. ఈ తంతు అంతా రైతులు పొలాల్లో లేనప్పుడు మాత్రమే చేస్తున్నారు. దీని మీద స్థానిక ఉద్యోగులను  ప్రశ్నిస్తే తమకేమీ తెలియదని వారు సమాధానం ఇస్తున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు తమ పొలాల్లో ఏర్పాటు చేసిన సర్వే పుల్లలను పీకేస్తున్నారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని సుమారు 80 ఎకరాలకు సర్వే నిర్వహించి, కర్రలు పాతారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు వాటిని పీకేశారు. దీంతో ప్ర‌భుత్వం చేస్తున్న దొంగ‌చాటు ప్ర‌య‌త్నాల మీద ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. 
Back to Top