అబద్ధాల పునాదిపై అసత్యపు నిర్మాణం

  • రాజధాని నిర్మాణం పేరుతో రైతులకు వెన్నుపోటు
  • ఏడాదికాలంగా ప్రజలను మభ్యపెడుతూ మోసం చేసిన బాబు
  • శంకుస్థాపన చేసిన ప్రాంతంలో దర్శనమిస్తున్న పిచ్చిమొక్కలు 
  • రైతుల భూములు స్వాహాచేసి రాజభోగం అనుభవిస్తున్న పచ్చనేతలు
  • భూములు తీసుకొని మోసం చేశారంటూ రైతన్న ఆవేదన
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు అక్టోబర్‌ 23, 2015న దసరా  పర్వదినం సందర్భంగా రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని బాబు అట్టహాసంగా నిర్వహించారు.  ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తున్నామంటూ తెలుగు ప్రజల సాక్షిగా గొప్పలు పలికారు.  హైదరాబాద్‌ నగరాన్ని ఎలాగూ త్యాగం చేశాం ఇప్పుడు మనకు అంతకంటే ఉన్నతమైన నగరం కావాలంటూ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, విదేశీ ప్రముఖులు సాక్షిగా ప్రకటించాడు. రాజధాని నిర్మాణం కోసం మొదటి కూలీని నేనేనని చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానని రెండో ప్రపంచ యుద్ధంలో విన్‌స్టన్‌ చర్చిల్‌లా రోమాలు నిక్కబొడిచే విధంగా చేసిన ప్రసంగంతో  ఆంధ్రా ప్రజలు మురిసి పోయారు. అమరావాతి పూర్తయ్యే వరకు నిద్రాహారాలు మాని పనిచేస్తానని చెప్పడంతో పాపం చంద్రబాబు ఆరోగ్యం ఏం కానూ అని తెలుగు తమ్ముళ్లు వాపోయారు.. కానీ ఏం జరిగింది. సీన్ రివర్స్. ఈ ఏడాది కాలంగా జరిగిన ప్రతి సంఘటనను ప్రజలు పరిశీలిస్తూనే ఉన్నారు.  రాజధాని కోసం సేకరించిన 33 వేల ఎకరాల్లో ఇప్పుడు రెండు మూడు షెడ్లు మినహా ఏమీ కనిపించడం లేదు. ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనూ ఇప్పుడు పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి దర్శమిస్తున్నాయి. ఇదొక్క చిత్రమే చాలు చంద్రబాబు మోసపూరిత విధానాల గురించి తెలుసుకోవడానికి. 

రైతుల భూములతో ప్లాట్ల వ్యాపారం
రాజధాని కోసం రైతుల నుంచి భూములు సేకరించడానికి జరిగిన హైడ్రామా అంతా ఇంతా కాదు. ముందే నిర్ణయించుకున్న ప్రకారం టీడీపీ నాయకులు తమ పొలాలకు నష్టం లేకుండా డిజైన్‌ చేసుకుని చిన్న సన్నకారు రైతుల భూములను లాక్కునేందుకు పథక రచన చేశారు. భూములు ఇవ్వలేమని అడ్డం తిరిగిన రైతులను కేసులతో బెదిరించారు. పచ్చని పంట పొలాలను అమానుషంగా అర్థరాత్రి వెళ్లి నిప్పు పెట్టారు. ఎలాగైతేనే వారి పంతం నెగ్గించుకున్నారు. తాము అనుకున్నట్టు 33వేల ఎకకాల భూమిని దోచుకున్నారు. రైతుల భూమితో టీడీపీ నాయకులు ప్లాట్ల వ్యాపారం చేయబోతున్నారంటూ ప్రజలను హెచ్చరించిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులను అభివృద్ధి నిరోధకులని ముద్ర వేసే ప్రయత్నం చేశారు. రాజధాని ముసుగులో చంద్రబాబు చేస్తున్న దోపిడీని వైయస్సార్సీపీ ముందు నుంచి చెబుతూ వస్తూనే ఉంది.  అదే జరిగింది. పేదల పొట్టగొట్టి వారి ప్లాట్లతో పచ్చనేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహా ఎవరూ ముందుకు రాకపోవడంతో రైతుల భూములు తాకట్టు పెట్టి నిధులు సమకూర్చుకోవాలని బాబు ప్రయత్నిస్తున్నారు. స్విస్‌ చాలెంజ్‌ పేరుతో 99 సంవత్సరాలు సింగపూర్‌ కంపెనీలకు మన పొలాలను కట్టబెట్టారు. రూ. 15వేల కోట్లు పెట్టుబడి పెట్టే ఏపీ ప్రభుత్వానికి 42శాతం వాటా.. రూ 300 కోట్లు పెట్టిన సింగపూర్‌ కంపెనీకి 58 శాతం వాటా అప్పగించి రాష్ట్రాన్ని నిలువునా ముంచేస్తున్నారు. 

నమ్మించి నట్టేట ముంచిన బాబు
రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఎలాంటి అన్యాయం చేయమని ముఖ్యమంత్రి పదే పదే చెప్పుకొచ్చారు. మీరు చేసే త్యాగాలను ఎన్నటికీ విస్మరించబోమని అమరావతి భూమి పూజకు వారిని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. భూములిచ్చిన రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురుకాకుండా హామీలు గుప్పించారు. భూములు త్యాగం చేసిన రైతులకు కమర్షియల్‌ ల్యాండ్, ఇంట్లో డిగ్రీ పూర్తిచేసిన వారుంటే వారికి ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ కల్పనతోపాటు వారికి వ్యవసాయ భూమి కేటాయించడం తదితర హామీలతో రైతులను మభ్యపెట్టారు. ఆయన ఆర్భాటపు ప్రసంగాలు కూడా విని అవన్నీ నిజమేనని ప్రజలు విశ్వసించారు. తీరా సంవత్సరం గడిచాక కానీ బాబు అసలు రంగు తెలిసొచ్చింది. భూములు ఇచ్చినాటినుంచి రైతులు పడని బాధ లేదు. ఎప్పటికప్పుడు ప్లాట్లు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తూ వస్తోంది. ప్రభుత్వ తీరుపై పేద రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. తమ ఓట్లతో గెలిచి పొట్టగొట్టారంటూ స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీని చిత్తుగా ఓడించేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారు. 

తాజా వీడియోలు

Back to Top