నాయకుల ఆదర్శం ఇదేనా

న్యూఢిల్లీ) చట్ట సభల సభ్యులుగా ఉన్న వారు చట్టాల్ని, నిబంధనల్ని రూపొందిస్తూ
ఉంటారని.. అటువంటప్పుడు అదే చట్ట సభ సభ్యులు చట్టాల్ని, నిబంధనల్ని ఉల్లంఘించటం
ఎంత వరకు సబబని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సూటిగా
ప్రశ్నించారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా జాతీయ నాయకులు శరద్ పవార్ ను కలిసిన
తర్వాత జాతీయ మీడియాతో ఆయన విడిగా మాట్లాడారు. చంద్రబాబు దుర్నీతి పాలన, విపక్ష
ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తీరు మీద మండిపడ్డారు. ఈ సందర్భంగా చట్ట సభ ల
పవిత్రతను గుర్తు చేశారు. చట్ట సభల సభ్యులు చట్టాల్ని, నిబంధనల్ని గౌరవిస్తే అది
బయట వారికి స్ఫూర్తి దాయకం అవుతుందని, కానీ ఇప్పుడు చట్ట సభల్లోని నాయకులే
విలువల్ని తుంగలోకి తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించటం,
ఫిరాయించిన వారిని అందలం ఎక్కించటం ఎంత వరకు ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాటిస్తుందని
ఆయన ప్రశ్నించారు.

        ఫిరాయింపుల చట్టం అనేది
రాజ్యాంగంలో ఒక భాగం అని, పదో షెడ్యూల్ లో దాన్ని పొందుపరిచారని గుర్తు చేశారు.
మరి, రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటే పరిస్థితిని అర్థం
చేసుకోవచ్చని వైఎస్ జగన్ అన్నారు. ఇటువంటి చర్యలు ఏ రాష్ట్రంలో పాల్పడినా తప్పే
అని అన్నారు. పాపం ఎక్కడ చేసినా పాపమే అని ఆయన వ్యాఖ్యానించారు.

        వాస్తవానికి ఫిరాయింపుల
చట్టంలోని కొన్ని లొసుగులే అధికార పక్షాలకు వరంగా మారుతున్నాయని వైఎస్ జగన్
అన్నారు. ముఖ్యంగా ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకొనే అధికారం స్పీకర్
చేతిలో పెట్టడంతో సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రాథమికంగా
స్పీకర్ అధికార పక్షానికి చెందిన వ్యక్తి అయి ఉంటారని, దీంతో ఆయన అధికార పక్షానికే
వత్తాసు పలుకుతూ ఉంటారని గుర్తు చేశారు. అంతిమంగా స్పీకర్ నుంచి ఎటువంటి చర్యలు
ఉండటం లేదని, ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతోందని ఆయన తెలిపారు. స్పీకర్ కు పదే పదే
ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల
మీద చర్యలు తీసుకొనే అధికారం ఎన్నికల సంఘానికి అప్పగించటం మేలని వైఎస్ జగన్
అభిప్రాయ పడ్డారు.  

Back to Top