ఎవర్ని కదిలించినా కన్నీరే!

దాచేపల్లి(గుంటూరు):

శ్రీమతి షర్మిల పాదయాత్రలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. కష్టాలు ఎందుకు ఎదురవుతున్నాయనే అంశాన్ని కూడా వారామెకు వివరించారు. ఆదివారం శ్రీమతి షర్మిల గురజాల నియోజకవర్గంలో పర్యటించారు. దారిలో ఆమెను విద్యార్థులు, రైతులు, కూలీలూ కలిశారు. తమ కష్టాలను విన్నవించుకున్నారు.

మంచి మార్కొలొచ్చినా చదువు మానేశా!
     ‘అక్కా... పదో తరగతిలో 555 మార్కులు వచ్చాయి... మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక చదువు మానేశాను. చదువుకోవాలని నాకు ఆశగా ఉందక్కా... నన్ను చదివించవూ...’ ఇది ఈద హరిత అనే ఓ విద్యార్థిని విన్నపం..‘ఉపాధి పనికి పోతే రూ.100 కూడా రావడంలేదు... ప్రభుత్వం మాత్రం 150 రూపాయలు ఇస్తామని గొప్పలు చెప్పుకుంటుంది. మహానేత మరణానంతరం ఈ పథకం మాకు ఉపయోగపడటంలేదు.’ గామాలపాడుకు చెందిన పోలే గురవమ్మ అనే వ్యవసాయ కూలి సమస్య ఇది. ‘పంటలకు నీరందక, బోర్లకు కరెంటు లేక మా పంటలన్ని ఎండిపోయాయి... పొలం వేయాలంటేనే ప్రాణం మీదకు వస్తోంది... నీళ్లు రాక ఈ సంవత్సరం పొలం కూడా వేయలేదు. పొలం వేయకపోవడం వల్ల టిక్కీ బియ్యాన్ని 2000కుపైగా పెట్టి కొంటున్నాం. మేము పండించిన పంటకు మాత్రం ధర ఇవ్వరు గానీ వారు అమ్మిన ధరకు ఎందుకు కొనాలి?...’ కాట్రపాడుకు చెందిన మహిళా రైతు సైదమ్మ ఆక్రోశమిది.
      దాచేపల్లి మండలంలోని గామాలపాడు, నారాయణపురం గ్రామాల్లో రచ్చబండలో వృద్ధులు, మహిళలు, బాలికలు, రైతులు శ్రీమతి షర్మిలతో మాట్లాడారు. ఎవరిని కదిలించినా సమస్యల సుడిగుండాలే కనిపించాయి. నన్ను చదివించవూ అంటూ విద్యార్థిని హరిత అభ్యర్థనకు స్పందించిన షర్మిల వెంటనే వైయస్ఆర్ కాంగ్రెస్  నాయకులతో మాట్లాడి పిడుగురాళ్ళలోని నవీన విద్యా సంస్థలలో ఉచితంగా చదివించే ఏర్పాటు చేశారు. నీ చదువుకు ఎలాంటి ఢోకా లేదు. చక్కగా చదువుకో అంటూ షర్మిల ఆ విద్యార్థిని భుజం తట్టి భరోసా ఇచ్చారు.

     'బోరు కింద మూడెకరాలలో వరి పంట  వేశా. బోరుకు కరెంట్ సక్రమంగా రాకపోవటం వల్ల పంట ఎండిపోయి లక్ష రూపాయల అప్పు మిగిలింది. ప్రభుత్వం రైతులకు సక్రమంగా ఉచిత విద్యుత్తును ఇవ్వకపోవటం వలనే ఈ ఏడాది పంటలన్నీ ఎండిపోయాయి. మా పంట నష్టం ఎవరు చెల్లిస్తారని దాచేపల్లికి చెందిన తాడిపర్తి సీతారెడ్డి అనే రైతు రచ్చబండలో షర్మిలమ్మతో తన ఆవేదనను చెప్పుకున్నాడు.

     ‘మా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. నేను ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాను. రేపు ఇంటర్ చదవాలంటే నాకు ఆర్థికస్తోమత లేదు. ఈ ప్రభుత్వం ఇప్పుడు స్కాలర్‌షిప్‌లను ఇవ్వడంలేదు. జగనన్న వచ్చిన తరువాత ఉపకారవేతనాలు ఇస్తేనే నేను ఇంటర్ చదివే అవకాశముంటుంద’ని మౌనిక అనే విద్యార్థిని షర్మిలకు చెప్పుకుంది. నువ్వు ఇంటర్ చదివేలోపు జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనీ, నీలాంటి పిల్లలందరి చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా జగనన్న ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందనీ శ్రీమతి షర్మిల ఆమెకు హామీ ఇచ్చారు.
డ్వాక్రా బృందాలకు రుణాలే లేవు
     'డ్వాక్రా గ్రూపుల ద్వారా పావలా వడ్డీకి రుణాలే ఇవ్వడంలేదు. డ్వాక్రాలో ఉంటే పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని చెప్పి అవి కూడా ఇవ్వడంలేదు. రాజశేఖరరెడ్డిగారు ఉన్నప్పుడు పావలా వడ్డీకి రుణాలను తీసుకున్నాం. ఇప్పుడు పావలా వడ్డీ రుణాలు అడిగినా ఇవ్వడంలేదు. జగనన్న వస్తే మళ్ళి మాకు రుణాలు వస్తాయనే నమ్మకం ఉందని'  విజయ అనే డ్వాక్రా మహిళ షర్మిలమ్మకు చెప్పుకుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు ఇచ్చి అదుకుంటారని శ్రీమతి షర్మిల ఆమెకు భరోసా కల్పించారు.

     ఈ ప్రభుత్వ హయాంలో మేము నష్టపోవడమే తప్ప లాభపడిందేమిలేదని మహిళలు షర్మిలమ్మకు చెప్పుకున్నారు. మరో ఆరో నెలల్లో రాజన్న స్వర్ణయుగం వస్తుందని, జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, వడ్డీలేని రుణాలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, కోతలు లేని ఉచిత విద్యుత్, ఉపాధి హామీలతో పాటు మీరు అడిగిన, అడగనివన్నీ జగనన్న ప్రభుత్వంలో అందుతాయని శ్రీమతి షర్మిల తెలిపారు.

Back to Top