ఎవరిని కదిలించినా.. కష్టాలు.. కన్నీళ్ళే!

దాచేపల్లి (గుంటూరు జిల్లా) : ‘అక్కా... పదవ తరగతిలో 555 మార్కులు వచ్చాయి... మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక చదువు మానేశాను. చదువుకోవాలని నాకు ఆశగా ఉందక్కా... నన్ను చదివించవూ...’ ఈద హరిత అనే ఓ విద్యార్థిని విన్నపం ఇది.. ‘ఉపాధి పనికి పోతే రూ.100 కూడా రావడంలేదు... ప్రభుత్వం మాత్రం 150 రూపాయలు ఇస్తామని గొప్పలు చెబుతోంది. రాజశేఖరరెడ్డిగారు చనిపోయిన తరువాత ఈ పథకం మాకు ఉపయోగపడటంలేదు.’ గామాలపాడుకు చెందిన వ్యవసాయ కూలీ పోలే గురవమ్మ సమస్య ఇది. ‘పంటలకు నీరందక, బోర్లకు కరెంటు లేక మా పంటలన్ని ఎండిపోయాయి... పొలం వేయాలంటేనే ప్రాణం మీదకు వస్తుంది... నీళ్లు రాక ఈ సంవత్సరం పొలం కూడా వేయలేదు. పొలం వేయకపోవడం వల్ల టిక్కీ బియ్యాన్ని 2000కు పైగా పెట్టి కొంటున్నాం. మేము పండించిన పంటకు మాత్రం ధర ఇవ్వరు గానీ వారు అమ్మిన ధరకు ఎందుకు కొనాలి?...’ కాట్రపాడు మహిళా రైతు సైదమ్మ ఆక్రోశమిది.

గుంటూరుజిల్లా దాచేపల్లి మండలంలోని గామాలపాడు, నారాయణపురం గ్రామాల్లో ఆదివారంనాడు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో వృద్ధులు, మహిళలు, బాలికలు, రైతులు తమ సమస్యలను వెళ్లబోసుకున్నారు. ఎవరిని కదిలించినా సమస్యల సుడిగుండాలే వినిపించాయి. కష్టాలు.. కన్నీళ్ళే  కనిపించాయి.

'అక్కా... నన్ను చదివించవూ' అంటూ విద్యార్థిని హరిత అభ్యర్థనకు స్పందించిన శ్రీమతి షర్మిల వెంటనే వైయస్‌ఆర్‌సిపి నాయకులతో మాట్లాడి పిడుగురాళ్ళలోని నవీన విద్యా సంస్థలలో ఉచితంగా చదివించే ఏర్పాటు చేశారు. 'నీ చదువుకు ఎలాంటి ఢోకా లేదు. చక్కగా చదువుకో' అంటూ శ్రీమతి షర్మిల ఆ విద్యార్థిని భుజం తట్టి భరోసా ఇచ్చారు.

'మూడు ఎకరాల వరి పంటను బోరు కింద వేశాను. బోరుకు కరెంట్ సక్రమంగా రాకపోవటం వల్ల పంట ఎండిపోయి లక్ష రూపాయలు అప్పు అయింది. ప్రభుత్వం రైతులకు సక్రమంగా ఉచిత విద్యు‌త్‌ ఇవ్వకపోవటం వల్లే ఈ ఏడాది పంటలన్నీ ఎండిపోయాయి. మా పంట నష్టం ఎవరు చెల్లిస్తార'ని దాచేపల్లికి చెందిన రైతు తాడిపర్తి సీతారెడ్డి రచ్చబండలో శ్రీమతి షర్మిలతో తన ఆవేదన చెప్పుకున్నాడు.

‘మా తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. నేను ఇప్పుడు పదవ తరగతి చదువుతున్నాను. రేపు ఇంటర్ చదవాలంటే నాకు ఆర్థికస్తోమత లేదు. ఈ ప్రభుత్వం ఇప్పుడు స్కాల‌ర్‌షిప్‌లు ఇవ్వడంలేదు. జగనన్న వచ్చిన తరువాత స్కాలర్‌షిప్‌లు ఇస్తేనే నేను ఇంటర్ చదివేందుకు అవకాశం ఉంటుంద’ని మౌనిక‌ అనే విద్యార్థిని శ్రీమతి  షర్మిలకు చెప్పుకుంది. 'నువ్వు ఇంటర్ చదివే‌ లోపు జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. నీకే కాదు నీలాంటి పిల్లలందరి చదువులకు ఎలాంటి ఆటంకం లేకుండా జగనన్న ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందంటూ శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.

'డ్వాక్రా గ్రూపుల ద్వారా పావలా వడ్డీకి రుణాలే ఇవ్వడంలేదు. డ్వాక్రాలో ఉంటే పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని చెప్పి అవి కూడా ఇవ్వడంలేదు. రాజశేఖరరెడ్డిగారు ఉన్నప్పుడు పావలా వడ్డీకి రుణాలు తీసుకున్నాం. ఇప్పుడు పావలా వడ్డీ రుణాలు అడిగినా ఇవ్వడంలేదు. జగనన్న వస్తే మళ్ళీ మాకు రుణాలు వస్తాయనే నమ్మకం ఉంద'ని విజయ అనే డ్వాక్రా మహిళ శ్రీమతి షర్మిలకు చెప్పుకుంది. ‌'వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు ఇచ్చి అదుకుంటార'ని శ్రీమతి షర్మిల ఆమెకు చెప్పారు.

ఈ ప్రభుత్వ హయాంలో తాము నష్టపోవడమే తప్ప లాభపడిందేమీ లేదని పలువురు మహిళలు శ్రీమతి షర్మిలకు చెప్పుకున్నారు. మరో ఆరో నెలల్లో రాజన్న స్వర్ణయుగం వస్తుందని, జగనన్న ముఖ్యమంత్రి అవుతారని, వడ్డీలేని రుణాలు, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, కోతలు లేని ఉచిత విద్యుత్, ఉపాధి హామీలతో పాటు మీరు అడిగిన, అడగనివన్నీ జగనన్న ప్రభుత్వంలో అందుతాయని‌ శ్రీమతి షర్మిల మహిళలకు భరోసా ఇచ్చారు. శ్రీమతి షర్మిల ప్రసంగాన్ని మహిళలు ఉత్సాహంతో వింటూ నిజమైన భరోసా దొరికిందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు.
Back to Top