ఈక్వెడార్ - అసాంజే - జేజే!

వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకి రాజకీయ ఆశ్రయం కల్పించాలని ఈక్వెడార్ గురువారం నాడు -అగస్ట్ 16న-నిర్ణయించడంతో పాశ్చాత్య పాలకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది.వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకి రాజకీయ ఆశ్రయం కల్పించాలని ఈక్వెడార్ గురువారం నాడు -అగస్ట్ 16న-నిర్ణయించడంతో పాశ్చాత్య పాలకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. లైంగిక నేరాల ఆరోపణతో అసాంజేని స్వీడెన్‌కు తరలించాలన్న ప్రయత్నానికి ఆయన సహకరించలేదు. దాంతో దాదాపు మూడు నెలలుగా అసాంజే లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో రక్షణ పొందుతున్న సంగతి తెలిసిందే. అసాంజేకి రాజకీయ ఆశ్రయం కల్పించే ప్రయత్నం చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని -ప్రజాస్వామ్యానికి పురిటిగడ్డననిఇ చెప్పుకునే- బ్రిటన్ హెచ్చరించింది. అంతేకాదు- ఇల్లలుకగానే పండగ కాదనీ, రాజకీయ ఆశ్రయం ప్రకటించినంత మాత్రాన అసాంజేని ఈక్వెడార్‌కు తీసుకెళ్లినట్లు కాదనీ బ్రిటన్ తెగబడి పలికింది. దౌత్య మర్యాదలను అతిక్రమించి ఈ రీతిలో బెదిరింపులకు దిగడం ఏ విధంగా ప్రజాస్వామ్య సంప్రదాయం కాగలదో వారే సెలవిస్తే బాగుంటుంది.అది అలా ఉండగా అసాంజే మద్దతుదార్లు లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యలయం ముందు గుమిగూడి వికీలీక్స్ వ్యవస్థాపకుడికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈక్వెడార్ ప్రభుత్వం ప్రదర్శించిన తెగువనూ, గుండెధైర్యాన్నీ వాళ్లు ప్రశంసించారు. అసాంజే స్వయంగా ఈ నిర్ణయం పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ ‘ఇది ఓ చరిత్రాత్మక నిర్ణయ’మన్నారు. యన రక్షణ తీసుకుంటూ ఉన్న ఈక్వెడార్ రాయబార కార్యలయంలోకి బ్రిటిష్ పోలిస్‌లు గానీ, సైనికులు గానీ ఇంతవరకూ చొరబడలేదు. అయితే, ఆ భవంతి బయట గుమిగూడిన అసాంజే మద్దతుదార్లతో అనేక పర్యాయాలు ఘర్షణపడ్డారు. ఈక్వెడార్ నిర్నయం పట్ల బ్రిటన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అసాంజే బ్రిటిష్ వ్యవస్థ కల్పించిన అన్ని ప్రజాస్వామిక మార్గాలనూ వినియోగించుకుని విఫలమయ్యారని బ్రిటన్ వ్యాఖ్యానించింది. ఆయన్ను స్వీడెన్‌కు తరలించాల్సిన నైతిక బాధ్యత తమపై ఉందనీ, అసాంజేని అంత తేలికగా తమ దేశం వదిలి పోనివ్వమనీ బ్రిటన్ హెచ్చరించడం ప్రకంపనలు సృష్టించింది. ‘మా దేశం బ్రిటిష్ వలస కాదు. అంతర్జాతీయ న్యాసూత్రాలకు పూర్తివిరుద్ధంగా తెగబడి బ్లాక్‌మెయ్‌ల్‌కు దిగడం ప్రజాస్వామ్య, నాగరక, చట్టబద్ధ రాజ్యానికి ఎంతమాత్రం తగని పని!’ అని ఈక్వెడార్ కుండబద్దలుకొట్టినట్లు ప్రకటించింది. ‘అసాంజే వ్యక్తం చేస్తున్న భయాలు సమంజసమయినవేనని మేం నమ్ముతున్నాం. ఆయనపై రాజకీయపరమయిన కక్షసాధింపు చర్యలు తీసుకునే ప్రమాదం ఉందన్నదే మా విశ్వాసం. మా రాయబార కార్యాలయాలనుంచి ఆశ్రయం కోరేవారికి సహాయపడడమనే సత్సంప్రదాయానికి కట్టుబడే అసాంజేకి ఆశ్రయం ప్రకటిస్తున్నా’మన్నారు ఈక్వెడార్ విదేశాంగ మంత్రి రికార్డో పతినో.ఇంతకీ, అసాంజే అంటే పాశ్చాత్య రాజ్యాలకు ఎందుకంత కోపం?యథార్థవాదీ లోక విరోధీ అన్నారు పెద్దలు. అసాంజే విషయంలో ఈ మాట నూటికి నూరుపాళ్లూ నిజం. అమెరికా, బ్రిటన్ తదితర పాశ్చాత్య అగ్ర రాజ్యాల దౌత్య సిబ్బంది వారివారి కార్యాలయాలకు పంపించిన రహస్య నివేదికలను అసాంజే బట్టబయటు చేశారు. అంతర్జాతీయ న్యానిబంధనలకు పూర్తి విరుద్ధమయిన తీరులో ఈ నివేదికల తయారీ సాగింది. ఒక్కమాటలో చెప్తే, ఆయాదేశాల అంతర్గత వ్యవహారాల్లో పాశ్చాత్య అగ్రరాజ్యాలు అక్రమంగా జోక్యం చేసుకుంటున్న తీరును అసాంజే వెల్లడించారు. ఈ ఒక్క కారణం చేతనే పాశ్చాత్య ప్రజాస్వామ్య రాజ్యాలు అసాంజేపై కత్తికట్టాయి. వాటికి అలవాటయిన పద్ధతిలోనే దొంగ కేసులు బనాయించి అసాంజేని అరెస్ట్ చెయ్యాలని చూశాయి. అయితే, ఈక్వెడార్ ప్రభుత్వం అసాధారణమయిన సాహసం ప్రదర్శించి అసాంజేకి రాజకీయ ఆశ్రయం ప్రటించడంతో వాటికి కంటికి ఆవకాయ రాసుకున్నట్లయింది. దౌత్య మర్యాదలనే విస్మరించి శివాలాడడం మొదలుపెట్టారు.ఈక్వెడార్ అసాంజేకి ఆశ్రయం కల్పించాలని నిర్ణయించడం తొలి అడుగు మాత్రమే. అది సరయిన దారిలో ముందుకు సాగుతుందని ఆశిద్దాం. స్వేచ్చాస్వాతంత్య్రాల పతాకం అంతర్జాతీయ వినువీథుల్లో రెపరెపలాడాలని కోరుకుందాం. అసాంజేకి జేజేలు చెప్దాం!!

 
Back to Top