ఇదీ జగన్ దెబ్బ

ఓ వీరుడు పోరాటానికి ముందు నిలిస్తే మూలనున్న ముసలోడైనా యుద్ధానికి సై అంటాడట. తెలుగు రాష్ట్రాల్లో చదువులు ’కొనే’ దుస్థితి గురించి వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ఇటీవలే మాట్లాడారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో పిల్లలు చదువును కొనుక్కునే స్థోమత లేక ఎన్ని బాధలు పడుతున్నారో నాకు తెలుసు అన్నారు వైఎస్ జగన్. తాము అధికారంలోకి రాగానే ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఫీజు నియంత్రణ అమలు చేస్తాం అని, లక్షల ఫీజులు గుంజుతున్న పరిస్థితులను మార్చి, ఫీజులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ ఈ విషయంపై విస్తృతంగా మాట్లాడటం మొదలు పెట్టిన తర్వాత కొందరు నాయకులు దీనికి అనుకూలంగా స్పందిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో తన బినామీలకు, తెలుగు తమ్ముళ్లకూ పనికొచ్చే పనులకు ఎక్కడా ఆటంకం ఉండదు. ప్రభుత్వ పాఠశాలలను మూసేసి, ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తూ తన వారికి మేలు చేకూరుస్తున్నాడు చంద్రబాబు. ప్రజలను ప్రభుత్వ విద్యకు దూరం చేసి ప్రైవేటు విద్యకు పెద్ద పీట వేయడం తన వారి లాభాల కోసమే. నేటిదాకా చంద్రబాబు అనుసరిస్తున్న కార్పొరేట్ విద్యా విధానానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గళం విప్పుతూ ఉన్నారు. నేడు టిడిపి మాజీ పొత్తు పార్టీ బిజెపి కూడా ఈ విషయాన్ని చట్ట సభలో ప్రశ్నించింది. బిజెపి నేత విష్ణుకుమార్ రాజు దీనిపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. 
రాష్ట్రంలో ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణ పై శ్రద్ధ పెట్టడం లేదని, లక్షల్లో ఫీజులు గుంజుతున్నా మిన్నకుండటానికి గల కారణం మాకు తెలుసని విమర్శించారు బిజెపి నేత విష్ణుకుమార్ రాజు. శాసన సభ ప్రశ్నోత్తరాల సమయంలో కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం పేదలకు సీట్లు ఇవ్వాలన్న నిబంధన పాటించడం లేదని కూడా అన్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేసేదెవరో తెలుసు అనడంలో నారాయణ సంస్థల అధినేత, చంద్రబాబు మంత్రి వర్గంలోని నారాయణ గురించే అని అందరికీ తెలుసు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలు ఎలాంటి ప్రమాణాలు పాటించకపోయినా, ఫీజులు మాత్రం ఏటికేడాది ఇష్టం వచ్చినట్టు పెంచుకుపోతున్నారు. హైస్కూలు స్థాయి చదువులకు కూడా ఏడాదికి దాదాపుగా లక్ష రూపాయిలు ఖర్చు అవుతోంది. సామాన్యుడు ఈ చదువుల భారం మోయలేకపోతున్నాడు. రాష్ట్రంలో విద్యావ్యస్థ పతనం అయిన తీరును ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పాదయాత్రలో ప్రతి సభలోనూ ఎండగడుతూనే ఉన్నారు. ప్రాధమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి చదువులకు భరోసా నాది అంటూ రాష్ట్ర ప్రజలకు వరంలాంటి హామీని ఇస్తున్నారు కూడా. నవరత్నాల ద్వారా నాణ్యమైన విద్యను భావితరాలకు అందించడం నాబాధ్యత అని మాటిస్తున్నారు వైఎస్ జగన్. గతంలోనూ ఫీజు పోరు అంటూ ఫీజ్ రీయంబర్స్ మెంట్  కోసం పోరాడారు ప్రతిపక్ష నేత. తన పోరాటం ద్వారా, తన నిరసన ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించే మరిన్ని గొంతులను చైతన్య పరచడం వైఎస్ జగన్ విజయం. మాజీ మిత్ర పక్షంతోటే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేలా చేసిన వైఎస్ జగన్ దెబ్బ చంద్రబాబుకు సూటిగానే తగిలింది. 
ప్రజా సమస్యలను తెలుసుకోవడం, దానిపై ప్రభుత్వాన్ని నిలదీయడం, అవసరమైతే పోరాటాలు చేయడం, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, వ్యవస్థలను కదిలించడం...ఇదీ ఓ అసలైన ప్రతిపక్ష నాయకుడి పోరాట పంథా. ఆ తీరుతోనే జన హృదయాల్లో నిలిచిపోయరు వైఎస్ జగన్. తమకోసం ఎందాకైనా వెల్లే వైఎస్ జగన్ ను చూసి తెలుగు ప్రజలు వారి గుండెలనే పూలదారులుగా పరిచి ఆ పాదయాత్రికునికి ఆహ్వానం పలుకుతున్నారు. రేపు ఆ నాయకుడికే పట్టం కట్టి తమ అభిమానాన్ని నిరూపించుకుంటామంటున్నారు. 
 
Back to Top