అమరావతి రాజధానిలో పోలీసుల డ్రెస్ కోడ్ మారబోతోందా

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి లో  పోలీసుల డ్రెస్ కోడ్ , డ్యూటీ కోడ్ మారిపోతోంది అన్న మాట వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా పోలీసుల వ్యవహార శైలి చూస్తుంటే ఎవరికైనా ఈ అనుమానం కలగక మానదు. ఖాకీ డ్రెస్ లకు బదులు పచ్చ చొక్కాలు ధరించిన తెలుగుదేశం గూండాల మాదిరిగా రెచ్చిపోతున్నారు.

రాజధానిగా అమరావతి ని ఏ ముహుర్తాన ప్రకటించారో కానీ, పోలీసుల అరాచకాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడే ఎక్కువ ద్రష్టి పెడుతుండటంతో ఆయన దగ్గర మార్కులు కొట్టేయడానికి పోలీసు బాస్ లు పోటీ పడుతున్నారు. దీంతో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుల్ని వేధించటం, హింసించటం ద్వారా చంద్రబాబు దగ్గర మార్కులు వేయించేసుకోవాలని తాపత్రయ పడుతున్నారు.

రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు నిరాకరించినందుకు కక్ష కట్టి తెలుగుదేశం గూండాలు ఆరు గ్రామాల పరిధిలో విధ్వంసం స్రష్టించారు. 13 గ్రామాల్లో ఏక కాలంలో పంట పొలాల్ని తగల బెట్టేశారు. ఇందుకు కారకులు పచ్చ చొక్కా గూండాలు అన్న సంగతి అందరికీ తెలుసు. అయినప్పటికీ గుంటూరు జిల్లా పోలీసులు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకుల్ని విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేశారు. పెనుమాక, ఉండవల్లి ప్రాంతాలకు చెందని నాయకుల్ని అదుపులోకి తీసుకొని రక రకాల పోలీసు స్టేషన్లకు తిప్పి హింసించారు. చివరకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కు ఫిర్యాదు చేయటంతో పోలీసులు వెనక్కి తగ్గారు.

గుంటూరు లో జగన్ నిరాహార దీక్ష సందర్బంగా కే సాయి అనే అభిమాని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకొని పోలీసులు చిత్ర హింసలు పెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులే ఈ పనిచేయించినట్లు చెప్పాల్సిందిగా తీవ్ర ఒత్తిడి తీసుకొని వచ్చారు. దీనికి సాయి ఒప్పుకోక పోవటంతో విపరీతంగా గాయపరిచి వదిలి పెట్టారు.

తూళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇవ్వనందుకు గద్దె చంద్రశేఖర్ అనే రైతుకి చెందిన ఐదు ఎకరాల చెరకు పంటను తెలుగుదేశం గూండాలే తగలబెట్టేశారు. ఎప్పుడూ టీడీపీ కి ఓటేశే తమకే ఇంతటి అన్యాయం జరిగిందంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పర్యటన సందర్బంగా ఆయన వాపోయారు. దీంతో జగన్ పర్యటన పూర్తవుతుండగానే చంద్రశేఖర్ మేనల్లుడు సురేష్  ను పోలీసులు ఎత్తుకెళ్లారు. చిత్రహింసలకు గురి చేసి, పొలాన్ని తగలబెట్టుకొన్నది తామే అని స్టేట్ మెంట్ రాయించుకొనే ప్రయత్నం చేశారు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేయటంతో పోలీసులు దిగి వచ్చి ఆయన్ని వదిలేశారు.

గత నెల 13వ తేదీ అర్థ రాత్రి గుంటూరు నగరం శివారు చుట్టుగుంట దగ్గర ఆర్టీసీ బస్సు తగలబడింది. దీనికి కారణం మీరే అంటూ వైఎస్సార్సీపీ మద్దతు దారులు అయిన డ్రైవర్ తాతిరెడ్డి శివప్రసాద్ రెడ్డి, కండక్టర్ శ్రీనివాస్ రెడ్డి లను పోలీసులు ఎత్తుకెళ్లారు. మూడు రోజులుగా చిత్రహింసలు పెడుతూ, కుటుంబ సభ్యుల్ని కూడా కలుసుకోనీకుండా వేదిస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయటం కోసం గుంటూరు పోలీసు యంత్రాంగం విలువల్ని గాలికి వదిలేసి పనిచేస్తోంది. దీని మీద ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఎంతటి ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారు. దీనికన్నా ఖాకీ డ్రెస్ విడిచి పచ్చ చొక్కాలు వేసుకొంటే మంచిదని ప్రజలు సలహా ఇస్తున్నారు. 

Back to Top