పచ్చవేషగాడి పగటివేషం

దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న ముఖ్యమంత్రి నాలుక నేడు దళిత తేజం  తెలుగుదేశం అంటోంది. దళితులు శుభ్రంగా ఉండరు చదువుకోరూ అన్న ఆధిపత్య మంత్రులను సహపంక్తి భోజనాల్లో కూర్చోవలని ఆదేశిస్తోంది. దళిత మహిళలను జుట్టుపట్టుకు ఈడ్చి, కాళ్లతో తొక్కినా, వారిపై కేసైనా నమోదు చేయని రాష్ట్రంలో దళిత వాడల్లో క్యాంపులు పెట్టమని కోరుతోంది. 
బహిర్భూమికి వెళ్లిన దళిత మహిళలతో పెత్తందారు ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తే నిలదీసినందుకు, కులదురహంకారంతో అర్థరాత్రి వారి ఆటోలను ధ్వంసం చేసి, ఇళ్లకు నిప్పు పెట్టే ప్రయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోని ఉప ముఖ్యమంత్రి ఇలాఖాలో దళితుల సంక్షేమం దిగ్విజయంగా ఉంటుందట. ఊళ్లో అంబేద్కర్ విగ్రహం పెట్టబోతే సామాజిక బహిష్కరణ చేసిన గరగపర్రు వైపు కన్నెత్తి చూడని చంద్రబాబు చంద్రన్న ముందడుగు అంటున్నాడు. దళితుల భూములను నీరుచెట్టు, కుంటల తవ్వకం పేరుతో అక్రమంగా స్వాధీనం చేసుకున్న పచ్చపులులకు ఇప్పుడు దళితులపై ఆర్తి పొంగుకొస్తోంది. రాజధాని పెట్టిన జిల్లాలోనే దళితుల భూములను భూస్వాములు చేపలచెరువులుగా చేసి ఏళ్లకుఏళ్లు అనుభవిస్తున్నా, న్యాయం చేయమని బాధితులు రోజుల తరబడి దీక్షలు చేస్తున్నా పట్టించుకోని పచ్చ ప్రభుత్వం నేడు దళితులు ఎదగడానికి రిజర్వేషన్లు పెట్టానని పచ్చి అబద్ధాలు ఆడుతోంది. సబ్ ప్లాన్ నిధులను పక్కదోవ పట్టించిన చంద్రబాబు, ఆ నిందను వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అంటగట్టాలని నానా విధాలా ప్రయత్నిస్తున్నాడు.రాజధాని కోసం దళితుల అసైన్డు భూములను, చివరకు లంక భూములను కూడా బలవంతంగా చేజిక్కించుకున్న దగా కోరు దళితులకు పంచడానికి భూమిని కొన్నానంటున్నాడు. 

పిల్లలూ దేవుడూ ఒకటే అంటారు. కానీ చంద్రబాబు మాత్ర పసివాడైన మనవడిని ఒళ్లో కూర్చోబెట్టుకునే పచ్చ అబద్ధాలు ఆడేస్తున్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డ లక్షలాది ఎకరాలను దళితులకు పంచిన మాట ఆయన నోటితో కాదంటే మాత్రం చెరిగిపోతుందా? నాలుగేళ్లుగా చంద్రబాబు హయాంలో దళితులకు ఒక్క సెంటు భూమి కాని, ఒక్క ఇల్లుకానీ దక్కలేదన్న నిజం మాసిపోతుందా? వైఎస్ హయాంలో 32లక్షల ఎకరాల భూమిని పేదలకు, దళితులకు పంచారు. 13జిల్లాల్లో 25లక్షల పక్కా ఇళ్లు కట్టి, అందులో 80 శాతం దళితులకు అందించారు. 

పచ్చవేషగాడు

దళితబాంధవుడి వేషం కట్టి, దళిత ఓట్ల కోసం, సహపంక్తి పాట పాడుతూ అడుక్కుంటున్నాడు చంద్రబాబు. ఇంటింటికీ టిడిపి అన్నా, జన్మభూమి అన్నా ఊళ్లోకే రాకుండా, వచ్చిన వాళ్లకి తిట్లతో సన్మానం చేసి పంపారు ప్రజలు. ఇప్పుడు దళిత రక్షకుడినంటూ చంద్రబాబు, అతని పచ్చసైన్యం దళిత వాడల్లో అడుగుపెడితే ఈ నాలుగేళ్లలో తమకు జరిగిన అవమానాలకు అక్షరాలా సమాధానం చెప్పి పంపుతారు దళితులు. కుల వివక్షతో, పక్షపాతంతో ఇనేళ్లుగా దళితులపై దాడులు చేస్తున్న దురహంకార ప్రభుత్వం ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించిన కారణం రానున్న ఎలక్షన్లే అన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. పండగలొస్తే పగటివేషగాళ్లొచ్చినట్టు, ఎలక్షన్లొచ్చినప్పుడు ఈ పచ్చవేషగాడు కట్టే వేషాలను, మోసాలను ప్రజలు ఇక నమ్మరుగాక నమ్మరు.  
Back to Top