పూటకో మాట... రోజుకో డ్రామా

– పబ్లిసిటీ కోసమే పథకాల రూపకల్పన 
– బ్యాంకు అకౌంట్లకు చేరని పింఛన్లు 
– ఇప్పటికీ గ్రామాల్లో పనిచేయని ఈపాస్‌ మెషీన్లు 
– మొబైల్‌ బ్యాంకింగ్‌ పేరుతో మరో పబ్లిసిటీ పన్నాగం

బాబు చేష్టలన్నీ ఆడంబరాలే. ఆర్భాటంగా మొదలెట్టడం.. పూర్తవకుండానే మధ్యలో వదిలేయడం. అద్భుతం చేసేసినట్టు పేపర్లలో వార్తలు రాయించుకోవడం. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసింది. ఇప్పుడు జరుగుతున్న తంతు కూడా ఇదే. సేమ్‌ టు షేమ్‌. కాకపోతే పెరిగిపోతున్న టెక్నాలజీతో బాబు బండారం బయటపడుతోంది. టెక్నాలజీ అందరికీ అందుబాలో లేని రోజుల్లో తాను చెప్పిందే నిజమన్నట్టు ఈనాడు రాసేయడం... జనం నమ్మేయడం జరిగింది. ఇప్పుడు మాత్రం అందరికీ ఇంటర్నెట్, వైఫైలు అందుబాటులోకి రావడంతో చంద్రబాబు ఏ చిన్న తప్పుడు కూత కోసినా ఫేస్‌బుక్‌లో ఫేస్‌ వాయగొడుతున్నారు జనాలు. ఆధారాలతో సహా నిజానిజాలు జనం మధ్యకు వెళ్లడానికి ఎంతో సమయం కూడా పట్టడం లేదు. వాట్సాప్‌లో క్షణాల్లో వైరల్‌ అయిపోతుంది. ఎందులోనైతే తాను రారాజుగా చెప్పుకుని మురిసిపోతున్నాడో అదే టెక్నాలజీ బాబును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నాలుక మడతేసినప్పుడల్లా బాబుకు మొహం వాచిపోయేలా సోషల్‌ మీడియాలో చీవాట్లు తప్పడం లేదు. తాజాగా కర్నూలు జిల్లా ముచ్చుమ్రరిలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీకి చెందిన దళిత ఎమ్మెల్యే మాట్లాడుతుండగా అవమానకరంగా మైకు కట్‌ చేసి ప్రజాగ్రహానికి గురయ్యారు. బీకామ్‌లో ఫిజిక్స్‌ చదివానని జలీల్‌ఖాన్‌ చెప్పిన వీడియో సంగతైతే ఇక చెప్పనవసరం లేదు. కొన్ని గంటల్లో లక్షల మందిని చేరిపోయింది. గొప్పల కోసం జలీల్‌ఖాన్‌ అన్న మాటలు ఆయన్ను ఎంత ఇరుకున పడేశాయో చెప్పనవసరం లేదు. 

బాబు వేధింపులకు ఎవరూ మినహాయింపు కాదు
జనాన్ని చంద్రబాబు వాడినట్టుగా ఎవరూ వాడరేమో అనిపిస్తుంది. పింఛన్లకు ట్యాబ్‌లిచ్చి వీఆర్‌ఓలను, పింఛన్‌ లబ్ధిదారులను.. సర్వేల పేరుతో సామాన్య ప్రజలను, అంగన్‌వాడీలను, మొబైల్‌ బ్యాంకింగ్‌ పేరుతో విద్యార్థులను, బ్యాంకర్లను.. వీడియో కాన్ఫరెన్సుల పేరుతో  ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను, పనికి మాలిన పబ్లిసిటీ యాత్రల పేరుతో పోలీసులను, పోలవరానికి రోజుకో శంకుస్థాపన పేరు చెప్పి ఇంజినీర్లను, వేలి ముద్రలు గుర్తించని ఈపాస్‌ మెషీన్లతో తెల్ల రేషన్‌ కార్డుదారులు.. రేషన్‌ దుకాణదారులను, పది వేలు డిపాజిట్‌ చేస్తానని చెప్పి పది వేల సార్లు డ్వాక్రా మహిళలను.. టీకాలు పేరు చెప్పి ఆశా వర్కర్లను.. ఇలా ఏ వర్గాన్ని వదలకుండా చంద్రబాబు అందర్నీ విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాడు. అయితే వారితో చేయించుకోవాల్సిన పనులు పక్కన పడేసి కేవలం పబ్లిసిటీ కోసమే తిప్పుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నాడు. 

ఫోన్‌ సిగ్నలే లేదు.. మొబైల్‌ బ్యాంకింగా 
చంద్రబాబు వ్యవహారం రోజుకో పథకం.. పూటకో మాట అన్నట్టు ఉంది. పింఛన్‌ లబ్ధిదారులకు ఒక నెల అకౌంట్‌లోకి డిపాజిట్‌ చేస్తే ఒక నెల చేతికిస్తారు. అందరికీ బ్యాంకు అకౌంట్‌లు ఉండాలని ఖాతాలు ఓపెన్‌ చేయిస్తాడు. అందులో మాత్రం డబ్బులు జమ చేయడు. టెక్నాలజీ వాడాలంటాడు.. వీఆర్‌ఓలకు ఇచ్చిన ట్యాబ్‌లు పనిచేయవు. కనీసం గ్రామల్లో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ కూడా వుండదు. అక్కడ కూడా వీఆర్‌ఓలకు ఇచ్చిన ట్యాబ్‌ల్లో వేలిముద్రలు వేసి డబ్బులు తీసుకోవాలని చెబుతాడు. తీరా వెళితే ఒక్కసారన్నా పనిచేసిన పాపానపోవడం లేదు. కూలీ పనులు మానుకుని గంటల కొద్దీ, ఒక్కోసారి రోజుల తరబడి తిరగాలి. నోట్ల రద్దు నేపథ్యంలో ఒక నెల మాత్రం పింఛన్‌ లబ్ధిదారులందరికీ అకౌంట్‌లో డిపాజిట్‌ అయ్యాయి. మళ్లీ కథ మొదటికొచ్చింది. చాలా మంది పింఛన్‌ లబ్ధిదారులు ఊర్లో ఉపాధి కరువై పొట్ట చేతబట్టుకుని ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. వారందరికీ బ్యాంకు అకౌంట్‌లో పింఛన్‌ జమ చేస్తే తీసుకుంటారన్న కనీసం జ్ఞానం కూడా ఉండదు. ఇక్కడ కూడా బాబు రాజకీయాలు వదలడం లేదు. పింఛన్ల మంజూరు వంటి పనులను జన్మభూమి కమిటీలకు అప్పగించి అందరూ లబ్ధిదారులంతా వారు చెప్పినట్టు నడుచుకునేలా రూపకల్పన చేసి ఆడుకుంటున్నాడు. మళ్లీ ఇప్పుడు ప్రజలంతా నగదు రహిత లావాదేవీలు జరపాలని మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలను వినియోగించుకోవాలని సోదేస్తున్నాడు. ఆధార్‌ కార్డులు, బ్యాంకు అకౌంట్‌లు అంటూ హడావుడి మొదలెట్టాడు. తిప్పిన తిప్పు తప్పకుండా జనాన్ని తిప్పుతున్నాడు. మెషీన్లు పనిచేయక జనం ఇబ్బంది పడుతున్నా లెక్కలేదు. ఓవరాక్షన్‌ చేయడం తప్ప మరోటి తెలీదు. ఇప్పటికే ఆయన ప్రవేశపెట్టిన ఈపాస్‌ మెషీన్లు పనిచేయక గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా రేషన్‌ దుకాణాల ముందు లబ్ధిదారులు క్యూలు కడుతున్నారు. దీనిపై ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ అసెంబ్లీలో ఆధారాలతో సహా ప్రజల సమస్యలను వివరించినా బాబులో చలనం లేదు. ఇంతవరకు సాఫ్ట్‌వేర్‌ సమస్యలపై సమీక్షించి సరిదిద్దిన పాపాన పోలేదు. ఎవరు ఏమైపోతే నాకేంటి నా పబ్లిసిటీ లక్ష్యం నెరవేరిందా లేదా అనేదే బాబుకు ముఖ్యం.  రెండున్నరేళ్లలో బాబు తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా బాబుకు బుద్ధి చెప్పాలని  ప్రజలు ఎదురుచూస్తున్నారు. 
Back to Top