నిను మరువలేం ఓ రాజన్నా!

హైదరాబాద్, 2 సెప్టెంబర్ 2013: నమస్తే అన్నా.. నమస్తే అక్కా.. నమస్తే చెల్లెమ్మా

.. అంటూ ఆప్యాయంగా పలకరించే నిరుపేదల పెన్నిధి, రైతు బాంధవుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి‌ మనకు దూరమైపోయి సోమవారంతో నాలుగేళ్లు గడిచాయి. ప్రజల బాగు కోసం ప్రతి క్షణం పరితపించిన నాయకుడు‌ వైయస్ఆర్. ఆ ప్రజల సంక్షేమం కోసం వారి వద్దకు వెళ్తూ నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మన కళ్ల ముందు‌ నుంచి దూరమయ్యారు. కోట్లాది మందిని కన్నీటి సంద్రంలోకి నెట్టి తాను కానరాని లోకాలకు చేరుకున్నారు.

మన మధ్యన ఆయన భౌతికంగా లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలు నిలిచే ఉన్నాయి. వైయస్ఆర్ అమలు‌ చేసిన ఎన్నెన్నో పథకాలతో బడుగు, బలహీన వర్గాల్లోని ప్రతి కుటుంబమూ లబ్ధి పొందాయి. కర్షకుడు, కార్మికుడు, విద్యార్థి, వికలాంగుడు, మహిళ, నేతన్న, వృద్ధాప్య.. ఇలా అన్ని వర్గాలకు ఆయన చేసిన సేవలు అజరామరం. ‌'రాజీవ్ ఆరోగ్యశ్రీ' ద్వారా ఆ మహానేత వైయస్ఆర్ ఎందరికో పునర్జన్మ ఇచ్చారు.‌ ఆ మహామనీషి శ్రీకారం చుట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి ఆయనను నిత్యం స్మరించుకుంటూనే ఉన్నాడు.‌ ఉచిత విద్యుత్ మొదలు జలయజ్ఞం వరకూ నిరంతరం రైతుల కోసం తపిస్తూ.. దండగన్న వ్యవసాయాన్ని పండగలా మార్చిన ఘనత ఆయనదే.

నాలుగేళ్ల క్రితం ఇదే రోజు హెలికాప్టర్ ఎక్కుతూ ఆ మహానేత వైయస్ఆర్ మాట్లాడిన చివరి మాటలివి...
'ముందు చెప్పకుండా ఈ రోజు ఉదయం ఐదు గంటలకే నేను ఏ గ్రామానికి వెళ్తున్నానో చెప్పాను. సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలి కాబట్టి అంత అడ్వాన్సు నోటీసు ఇచ్చాను. ఆయా గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడున్న సమస్యలేంటో ప్రజలతో నేరుగా ఇంటరాక్ష‌న్ అవుతాను. ముందే నేను ఎక్కడికెళ్తున్నానో చెబితే అక్కడ ఏమైనా తప్పులున్నా సరిచేసుకుంటారు. అలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అంశాలూ సరిగా పనిచేస్తున్నాయా, కరువు సమస్యలు ఏమైనా ఉన్నాయా, పనులు లేకపోవడం గానీ, మంచినీళ్లు, పశుగ్రాసం లాంటి సమస్యలున్నాయా, రేష‌న్ కార్డులు, ఇళ్లు లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా అనేవి చూస్తాను. ఇందిరమ్మ పథకంలో అందరికీ ఇళ్లు మంజూరు చేశాం. ఇంకా కానివారు ఎవరైనా ఉన్నారా, కట్టుకోడానికి ఏమైనా ఇబ్బందులున్నాయా చూస్తా. బీదవాళ్లలో ఏ ఒక్కరికీ రేష‌న్ కార్డులు లేకుండా ఉండకూడదు. పెన్షన్లు రానివాళ్లు ఎవరైనా ఉన్నారా.. అలాగే ఒకరికే రెండు పెన్షన్లు రావడం లాంటివి ఉన్నాయా అనేవి నేరుగా తెలుసుకోడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నా'

ఆ త‌రువాత ఆ మహానేత గొంతు మనకు వినిపించలేదు. ఆయనా కనిపించలేదు. కోట్ల మందిని కన్నీటి సాగరంలో ముంచి దివికేగిపోయారు రాజన్న. ఉదయం హెలికాప్టర్‌లో బయల్దేరిన రాజన్న... ఎంతకూ గమ్యం చేరకపోయేసరికి రాష్ట్రమంతా తల్లడిల్లిపోయింది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని పూజలు, ప్రార్థనలు చేసిన వారెందరో. కోట్ల మంది ప్రార్థనలు, పూజలను విధి పట్టించుకోలేదు. మహానేత  ప్రయాణించిన హెలికాప్టర్‌ను పావురాలగుట్ట కబళించింది. పేద ప్రజల పెన్నిధిని మనకు దూరం చేసింది.

దట్టమైన మేఘాలు కమ్ముకున్న ఆ వేళ.. ప్రయాణం మానుకోమని అంతా రాజశేఖరరెడ్డికి సూచించారు. ప్రజల కోసం అనుక్షణం పరితపించే ఆయన.. వాతావరణం కాదు జనం అనుగ్రహం ముఖ్యమని నమ్మారు.  ప్రయాణం మానుకోమని ఎందరు వారించినా సున్నితంగా తిరస్కరిస్తూ బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరారు.

రాజన్నప్రయాణించిన హెలికాప్టర్ గమ్యం చేరలేదు. పావురాలగుట్ట మహానేతను కబళించింది. నల్లమల అడవుల్లోని పావురాలగుట్ట కొండ మీద హెలికాప్టర్ కుప్పకూలింది. మహానేత వై‌యస్ రాజశేఖరరెడ్డితో పాటు పైలట్, కో పైల‌ట్, భద్రతాధికారి, కార్యదర్శి.. అందరూ మృత్యువు ఒడిలోకి చేరిపోయారు.

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాజశేఖరరెడ్డి సాగించిన పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సువర్ణ యుగా‌న్నే చవిచూసింది. ఏ సమస్య ఎదురైనా ఆదుకునేందుకు రాజన్న ఉన్నాడన్న భరోసా జనానికి కలిగింది. రాజన్న అంటేనే కొండంత అండ అనుకున్నారు. తన ఐదేళ్ల పాలనలో అనుక్షణం ప్రజల కోసం రాజశేఖరుడు పరితపించారు. ప్రజల మేలు కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అన్నదాత ఆనందంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన మహానేత వ్యవసాయాన్ని పండగ చేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఉచిత విద్యుత్ అందించి రైతుల ఇళ్లో వెలుగులు నింపారు. పావలా వడ్డీతో మహిళలను లక్షాధికారులను చేశారు. ఫించ‌న్లు ఇచ్చి ఎంతో మంది వృద్ధులకు పెద్ద కొడుకయ్యారు. మహానేత పాలనలో బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఎంతో ధైర్యంగా బతికారు.

అందుకే ఆ సంక్షేమ సారధి పదికాలాలు పదవిలో ఉండాలని జనం ఆకాంక్షించారు. ఆశీర్వదించారు. కాని ఏనాడైతే మహానేత ఇక లేరని తెలిసిందో పేద గుండెలు తల్లడిల్లిపోయాయి. ప్రజానేత లేని ఈ లోకంలో తామూ ఉండలేం అన్నారు. రాజన్న లేరని ఆగిపోయిన పేద గుండెలెన్నో. ఏ గాయాన్నైనా మాన్చే గొప్ప శక్తి కాలానికి ఉంటుందంటారు. కాని మహానేత కానరాని లోకాలకు వెళ్ళిపోయి నాలుగేళ్లు గడుస్తున్నా ఆ గాయం ఇప్పటికీ అలానే ఉంది.

రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో రెండున్నర లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ‌వాటిలో సుమారు రెండు లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్ అం‌దేలా వైయస్ఆర్‌ తమ హయాంలో చర్యలు తీసుకున్నారు. సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, యంత్ర‌ పరికరాలు, పంట రుణాలు అందించడంతో పాటు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి అన్నదాతలకు ఆత్మబంధువయ్యారు. జలయజ్ఞం పథకం కింద జిల్లాలో ఎల్లంపల్లి, ప్రాణహిత-చేవెళ్ల భారీ ప్రాజెక్టులకు కూడా మహానేతే పునాది వేసిన వైనం మరువరానిది.

పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత చదువులకు దూరం కారాదనే ఉద్దేశంతో వైయస్ఆర్  ప్రవేశపెట్టిన ఫీజు రీయింబ‌ర్సుమెంటు పథకం ద్వారా వేలాది మంది లబ్ధి పొందారు. ఉన్నత విద్య అభ్యసించి ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకున్నారు. అంతకు ముందు రూ.75 ఉన్న సామాజిక పింఛన్లను రూ.200కు పెంచడం, రూ.2కే కిలో బియ్యం వంటి పథకాల ద్వారా వేలాది మంది పేదలకు పస్తులుండాల్సిన బాధలను ఆయన తప్పించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు ఆత్మహత్య చేసుకున్న నేతన్నల కుటుంబాలకు రూ.లక్షన్నర ప్యాకేజీ అందించడంతో ఆపద నుంచి గట్టెక్కారు. సింగరేణి కార్మికులకిచ్చే లాభాల వాటా పెంచడంతో పాటు గోదావరిఖనిలో 40 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయడంతో వారికి శాశ్వతంగా ఆశ్రయం లభించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో వేలాది మంది నిరుపేదల సొంతింటి కల నెరవేరింది.

వైయస్ఆర్ అందించిన చేయూత వల్ల స్వశక్తి సంఘాల మహిళలు నేడు సొంతంగా పలు వ్యాపారాలు నిర్వహించే స్థాయికి ఎదిగారు. పావలా వడ్డీ రుణాలు, 60 ఏళ్లు నిండిన మహిళలకు అభయహస్తం పింఛన్లు ఇచ్చి ఆదుకున్న ఘనత కూడా వై‌యస్ఆర్‌దే. సంక్షేమ పథకాలే కాకుండా జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు రాజశేఖరరెడ్డి బాటలు వేశారు. ఆయన పథకాలతో ఇంటింటికీ ఏదో విధంగా లబ్ధి జరిగిందంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆ మహానేతను ‘నిను మరువం రాజన్నా’ అంటూ జనం గుండెల్లో దాచుకున్నారు.

మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి నాలుగవ వర్థంతిని అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకులు, కార్యకర్తలు‌ సోమవారం నిర్వహిస్తున్నారు. వైయస్ఆర్ విగ్రహాలకు క్షీరాభిషేకం, అన్నదానం, దుప్పట్లు, పండ్లు పంపిణీ తదితర కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. పల్లెపల్లెలో మహానేతను గుర్తుచేసుకునేందుకు సిద్ధమయ్యారు. మహానేత వైయస్ఆర్ వర్ధంతి‌ని పురస్కరించుకు పలు సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులు, అభిమానులకు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top