చంద్రబాబుకు డబుల్‌ షాక్‌

  • – మీ పబ్లిసిటీ పిచ్చి కొంప ముంచుతోందన్న నాయకులు
  • – నగదు రహిత లావాదేవీల్లో సమస్యలున్నాయన్న కలెక్టర్లు
  • – మనసులో మాట బయటపెట్టి సీఎంకు షాకిచ్చిన వైనం
ప్రజలు, అధికారులను వేధించుకు తినే చంద్రబాబుకు మంత్రులు, కలెక్టర్లు గట్టి షాకిచ్చారు. నగదు రహిత లావాదేవీల కోసం నెట్‌ బ్యాంకింగ్, ఈ బ్యాంకింగ్, ఏపీ పర్సు వాడాలని ఊపిరి సలపనీయకుండా తల బొప్పి కొట్టిస్తున్న చంద్రబాబుకు అధికారులు ఇచ్చిన షాక్‌తో తత్వం బోధ పడింది.  రెండు, మూడు గంటలు అవగాహన కల్పించేందుకే నా విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నానని గొప్పలు పోతున్న ముఖ్యమంత్రికి కలెక్టర్ల సమావేశంలో జరిగిన పరాభవం అంతా ఇంతా కాదు. నగదు రహిత లావాదేవీలు సొంతంగా నిర్వహించి అనుభవం ఎలా ఉందో చెప్పమని కోరిన సీఎంకు వారు చెప్పిన సమాధానాలతో ఏసీలో కూడా చెమట్లు పట్టేసి చర్చను అంతటితో ముగించేశారు. కలెక్టర్లు, మంత్రులు వెల్లడించిన అనుభవాలతో ఏం చేయాలో తోచక చంద్రబాబు బిక్కమొహం వేశారు. ఎంతమంది లావాదేవీలు జరిపారని ముఖ్యమంత్రి ప్రశ్నించగా కేవలం 40 శాతం మందే డెబిట్‌ కార్డులు ఉపయోగించి కొనుగోళ్లు జరిపామని వారి నుంచి సమాధానం వచ్చింది. ఇంకో ముఖ్య విషయం చెప్పాలంటే  ‘ఏపీ పర్సు’ ఉపయోగించి నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలని చంద్రబాబు చెప్పినా ఒక్కరంటే ఒక్కరు కూడా వాడలేదు.

షాక్‌ ఎలా తగిలింది?
దేశంలో ఏ రాష్ట్ర సీఎం చేయలేని విధంగా తాను పనిచేస్తున్నానని నమ్మించడం చంద్రబాబుకు అలవాటు. దేశంలో ఎలాంటి పరిణామం జరిగినా అది తనదే ప్రగల్భాలు పలకడం మామూలే.  ఈ నేపథ్యంలోనే తన సొంత పార్టీలోనూ, అధికారుల విషయంలోనూ వ్యవహరిస్తున్న బాబుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మనసు విప్పి మాట్లాడండి అని అనేక సందర్భాల్లో పేర్కొంటారు. దీన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది నాయకులు మనసు విప్పారు. చంద్రబాబు తీసుకొనే నిర్ణయాల వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారో తేల్చిచెప్పారు.

తాజాగా పెద్దనోట్ల రద్దు విషయంలో చంద్రబాబు స్పందించిన విధానం..దానివల్ల ప్రజల్లో వస్తోన్న వ్యతిరేకతను సదరు స్వపక్షంలోని నాయకుడు సూటిగా చెప్పారు. దీన్ని మిగతావారూ సమర్థించారు. పెద్దనోట్ల రద్దుకు మీరే సూచించారని, మీరు ప్రధానికి లేఖ రాశానని ప్రకటించుకున్నారు. లోకేష్‌ కూడా తన ట్విట్టర్‌ లో నోట్ల రద్దు మీవల్లే జరిగిందని ప్రకటించి, మీ నిర్ణయాన్ని మెచ్చుకోవడంతో అది జనంలోకి వెళ్లింది. మొదటి రోజు అందరూ బాగుందనుకున్నారు. కానీ..రోజులు గడుస్తున్న కొద్దీ ప్రజల ఇబ్బందులు ఎక్కువ అయ్యాయి. దీనివల్ల నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి పార్టీకంటే కూడా మనకే ఎక్కువ నష్టం జరిగింది. మీరు అలా ప్రకటించకుండా ఉంటే బాగుండేది అని నాయకులు అనేసరికి చంద్రబాబు షాక్‌కు గురయ్యారు. దీన్ని మిగతానేతలూ సమర్థించారు. అయితే చంద్రబాబు మాత్రం దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆలోచనలో మాత్రం పడ్డారు..అందుకే పెద్దనోట్లపై మాటమార్చారు.

అధికారులు ఏం చెప్పారంటే..
చంద్రబాబు మాట్లాడటం అయిన తర్వాత అధికారుల సూచనలూ, సలహాలు కోరతారు.. అదే అలవాటులో అడిగేసరికి ఆయనకు నోటమాట రాని నిజాలు తెలిశాయి. కొంత మంది అధికారులు చెప్పిన వాస్తవాలతో సీఎంకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురయింది. మీరు తెల్లవారు జామునే టెలీకన్ఫరెన్స్‌ లు పెడుతున్నారు. ఉదయం అంతా అదే పని సరిపోతుంది. అధికారులెవరూ ప్రజలకు అందుబాటులో ఉండేలేక పోతున్నారు. దీనివల్ల ప్రజాసమస్యలు పరిష్కారం కావడం లేదు. సాక్షాత్తు మీరు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేకపోతున్నాం. దీనివల్ల ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుంది. కలెక్టర్ల సమావేశం ఒక్కరోజు సరిపోతుంది. రెండురోజుల పాటు అవసరం లేదు. ప్రభుత్వ విధానం ఏమిటో చెప్పి దాన్ని సాధించేలా లక్ష్యాలు నిర్దేశిస్తే అధికారులు పనిచేసుకుంటూ పోతారు. ఇలా రోజుల తరబడి సమావేశాల వల్ల ఉపయోగం పెద్దగా ఏమీ ఉండదు అని పేర్కొనడంతో చంద్రబాబు ఉలిక్కిపడ్డారు.

నిత్యం సమావేశాలు.. రిపోర్టుల వల్ల ఒరిగేదీమీ ఉండదు. నివేదికలు చాలా వరకూ మిమ్మల్ని (సీఎం) ప్లీజ్‌ చేయడానికే అన్నట్లు ఉంటున్నాయి. దీనివల్ల క్షేత్రస్థాయిలో జరిగేది ఏమీ ఉండదు అని అనేసరికి చంద్రబాబు ఒక్కసారిగా అవాక్కయ్యారు. మొత్తం మీద చంద్రబాబుకు అటు అధికారులూ, ఇటు నాయకులూ షాక్‌ ఇవ్వడంతో దిమ్మతిరిగి పోయింది. 

Back to Top